బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన శివపార్వతి ఆర్టిస్టులను సున్నితంగా, సుతిమెత్తగా కడిగి పారేశారు. కరోనా బారిన పడకపోతే ఎవరేమిటో తెలిసేది కాదని, కానీ ఇప్పుడు అందరి గురించి అర్థమైందని ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన ఆమె ఓ భావోద్వేగ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మానసికంగా ఎంత సంఘర్ణణకు గురయ్యారో ఆ వీడియోలో ఆమె గద్గద స్వరంతో చెప్పిన మాటలు వింటే అర్థమవుతుంది.
“ప్రభాకర్ నటిస్తూ నిర్మిస్తున్న “వదినమ్మ” యూనిట్‌కు నమస్కారం. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. మళ్లీ ఇంటికి వస్తానో లేదో అన్న పరిస్థితిలోకి వెళ్లిపోయాను. పది రోజులు ఆస్పత్రిలోనే ఉన్నాను. ఆ తర్వాత నిన్న రాత్రి ఇంటికి చేరాను. ఈ మధ్యలో రెండు ఆస్పత్రులు మారాను. ఈ విషయం ప్రభాకర్‌కు, అతని యూనిట్‌కు కూడా తెలుసు. ఈ విషయంలో నేను ఎవర్నీ ఏమీ అనదలుచుకోలేదు. థ్యాంక్స్ చెప్పదల్చుకున్నాను. ఎందుకంటే ఈ పరిస్థితి రాకపోతే ఎవరేంటి? అని తెలిసేది కాదు. కానీ ఇప్పుడు తెలిసింది.
నేను వదినమ్మ యూనిట్‌లో పని చేసిన ఆర్టిస్ట్‌ను. కానీ నా గురించి ఎవరూ ఏ ఆస్పత్రిలో ఉన్నారు? ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? అని అడగలేదు. ఇది దురదృష్టం. అంటే ఎవరి సమస్య వాళ్లదే.. ఇక్కడ ఎవరికి ఎవరూ తోడుండరు. ప్రభాకర్ దగ్గర నుంచి కూడా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయను. మేము కూడా అలాగే ఉండాలి. నటించామా? ఆ క్షణాన్ని, ఆ ప్రదేశాన్ని, ఆ మనుషులను అక్కడితో మర్చిపోవాలి.. అంతే! మనుషుల మధ్య సంబంధాలు అలా మారిపోయాయి. అంత కృత్రిమంగా తయారయ్యాయి. నేను 5 ఏళ్ల నుంచి సినిమాలు చేయకపోయినా జీవిత రాజశేఖర్ ఆస్పత్రికి వచ్చి నా పరిస్థితి తెలుసుకుని నాకు సాయం చేశారు.
నేను పోయానని తెలిసినా ఇంతే రెస్పాన్స్ అవుతారు. ఎవరికీ తెలియనివ్వరు. సైలెంట్‌గా సీరియల్ తీసుకుంటారు. మనిషి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడం తప్పు. ఆర్టిస్ట్‌ల పట్ల ప్రేమ పంచితే చచ్చిపోయే వాడికి కూడా బలం వస్తుంది. ఇది మర్చిపోవద్దు. ” అని శివ పార్వతి భావోద్వేగానికి లోనయ్యారు.
నిజానికి బుల్లితెర నటి శివపార్వతి కరోనాకు థ్యాంక్స్ చెప్పాలి. కరోనా బారిన పడకుండా ఉంటే తాను ఎంతో కాలం ఎంతో ఊహించుకుంటూ వచ్చిన మనుషుల నిజ స్వరూపం ఏంటో ఆమెకు తెలిసి వచ్చేది కాదు. ఇక మీదట భవిష్యత్‌లో జీవితాన్ని ఎలా లీడ్ చేయాలో కరోనా అనుభవం గొప్ప గుణపాఠం నేర్పింది. అందువల్ల శివపార్వతి తన చుట్టూ ఉన్న మనుషుల గురించి ఎక్కువ భ్రమలు పెట్టుకోకుండా ముందుకెళ్లడమే ఏకైక మార్గం.