బాబుకు మెమొరీ లాస్ అయిందని, కొడుక్కి పార్టీ పగ్గాలు ఇస్తారట అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా అన్నారు. బాబును టార్గెట్ చేస్తూ బుధవారం ఆయన ట్వీట్ అస్త్రాలు సంధించారు. ఆ ట్వీట్ల సంగతేంటో చూద్దాం.
“పార్టీ వ్యవహారాలను కొడుకుకు అప్పగించాలని బాబు గారు అనుకుంటున్నారా? వయసు పెరగడం, జ్ఞాపకశక్తి క్షీణించడంతో కుమారుడికి పగ్గాలు ఇస్తారంట. కరోనా ఉధృతి తగ్గగానే లోకేశ్ నాయుడును కాబోయే సీఎం'గా ఎలివేట్ చేసేలా సైకిల్ యాత్ర చేయించాలని ఎల్లో మీడియా ముఖ్యులు రూట్ మ్యాప్ ఇచ్చారంట” అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. బాబు, లోకేశ్‌లంటే విజయసాయిరెడ్డిలో ఎక్కడా లేని క్రియేటివిటీ అంతా వచ్చేస్తుంది.
చంద్రబాబుపై ఎప్పుడూ ఒక ట్వీట్‌తో విజయసాయిరెడ్డి సరిపెట్టే రకం కాదు. ఖచ్చితంగా రెండు ట్వీట్లతో స్వీట్లు తినిపించాల్సిందే. మరో ట్వీట్‌లో ఏమన్నారంటే…
“బాబు నాయుడు… ప్రధానిని, ఆయన కుటుంబాన్ని తిట్టిన నోటితోనే ఆయన నాయకత్వాన్ని పొగిడారు. సీబీఐ, ఈడీ, ఐటీ, ఎన్ఐఏ ఏపీలోకి రావటానికి వీల్లేదన్న నోటితోనే కేంద్ర ప్రభుత్వ విచారణ కావాలంటున్నారు. ఇంకా ఇలాంటి చిత్ర విచిత్రాలు, విడ్డూరాలు ఎన్ని చూడాలో మరి..!” అంటూ విమర్శించారు.
మొత్తానికి కరోనా పుణ్యమా అని సోషల్ మీడియా వేదికగా విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయాల్ని హీటెక్కిస్తున్నారు. కరోనా బారిన పడిన విజయసాయి కోలుకుని వచ్చిన తర్వాత చంద్రబాబుపై వరుస వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.