గాలికి పోయే పిండి కృష్ణార్ఫ‌ణం..థియేట‌ర్ల‌కు ఛాన్స్!

ఎవ‌రెన్ని చెప్పినా.. ఎవ‌రెన్ని ట‌న్నుల సానుభూతిని కురిపించినా.. ఏపీలో సినిమా టికెట్ల రేట్లు మ‌రీ త‌క్కువేమీ కాదు. ప్ర‌భుత్వం ఐదు రూపాయ‌ల‌కే సినిమా టికెట్ల‌ను అమ్మ‌మంటోంది అంటూ తొండి వాద‌న‌తో  సినిమా వాళ్లు, థియేట‌ర్లు…

ఎవ‌రెన్ని చెప్పినా.. ఎవ‌రెన్ని ట‌న్నుల సానుభూతిని కురిపించినా.. ఏపీలో సినిమా టికెట్ల రేట్లు మ‌రీ త‌క్కువేమీ కాదు. ప్ర‌భుత్వం ఐదు రూపాయ‌ల‌కే సినిమా టికెట్ల‌ను అమ్మ‌మంటోంది అంటూ తొండి వాద‌న‌తో  సినిమా వాళ్లు, థియేట‌ర్లు క‌లిసి డ్రామాలను ర‌క్తి క‌ట్టిస్తూ ఉన్నారు. ఎక్క‌డా టికెట్ ధ‌ర నూటా యాభైకి త‌గ్గ‌దు. అయితే తొలి వారంలో.. దందాకు మాత్రం చెక్ ప‌డింది. సినిమా విడుద‌లైన రోజున‌, వీలైతే తొలి వారంలో ఇష్టానుసారం టికెట్ ధ‌ర‌ను.. అది కూడా అన‌ధికారికంగానే సుమా! అమ్ముకోవ‌డానికి మాత్రం వీలు కాదు.

విడుద‌లైన సినిమాకు ఉన్న క్రేజ్ ను బ‌ట్టి ఇన్నాళ్లూ… టికెట్ ధ‌ర‌ను క‌నిష్టంగా రెండు వంద‌ల‌తో మొద‌లుపెట్టి, గ‌రిష్టంగా వెయ్యి రూపాయ‌లు, ప‌దిహేను వంద‌ల వ‌ర‌కూ కూడా అమ్ముకున్నారు. అయితే.. ప‌న్నుల వ‌ద్ద‌కు వ‌చ్చే స‌రికి ప్ర‌భుత్వానికి చెప్పే లెక్క‌ల్లో టికెట్ ధ‌ర ఏ ప‌దో ఇర‌వై మాత్ర‌మే!  

అదేమంటే.. కొనేవాడు కొంటున్నాడు, కొనేవాడికి లేని బాధ మీకెందుకు? అనే ప్ర‌శ్న‌! మ‌రి కొంటున్న వాడు ఎంత‌కు కొంటున్నాడో.. అధికారికంగా కంప్యూట‌రైజ్డ్ టికెట్ ను ఇచ్చి, వాటి మేర‌కు ప‌న్నులు చెల్లించారా ఇన్నాళ్లూ? అంటే అదేమీ లేదు! మొత్తం మోస‌మే! 

సినీ వీరాభిమానుల్లోని క్రేజ్ ను సినిమా వాళ్లూ, థియేట‌ర్ల ఓన‌ర్లు సొమ్ము చేసుకుంటూ ఉంటే, ప్ర‌భుత్వానికి కాకిలెక్క‌లు చెబుతూ ఉంటే.. ప్ర‌భుత్వం అన్నీ మూసుకుని వీరు ఆడేఆట‌కు తందానా అనాలి! అన‌కపోతే బందులు!

ఇప్పుడు వ‌ర‌స పెట్టి థియేట‌ర్లు క్లోజ్ అవుతున్నాయి. అవుతున్న‌ట్టుగా మీడియాకు ప్ర‌త్యేకంగా స‌మాచారం ఇస్తున్నారు. వాస్త‌వానికి ఇప్పుడు థియేట‌ర్ల‌ను తెరిచేసుకుని ఆడించేసుకుని పిండేసుకోవ‌డానికి సినిమాలూ లేవు. సినిమాలున్నా.. ప్రేక్ష‌కుల్లో వంద‌కు వంద శాతం థియేట‌ర్ల‌కు వ‌చ్చే  ప‌రిస్థితి ఇంకా రానేలేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ థియేట‌ర్ల వైపుకు మ‌ళ్లీ దారి ప‌ట్టింది కేవ‌లం యాభై శాతం మంది కూడా లేకపోవ‌చ్చు. మిగిలిన వారు ఇంకా వెళ్లాలా.. వ‌ద్దా.. అనే శ‌ష‌భిష‌ల్లోనే ఉన్నారు. మ‌రోవైపు ఒమిక్రాన్ అంటూ మ‌ళ్లీ ఆంక్ష‌లు మొద‌ల‌వుతున్నాయి!

మ‌రి ఇప్పుడు గాక‌.. బంద్ ల‌కు అవ‌కాశం ఎప్పుడు?  గాలికి పోయే పిండి కృష్ణార్ప‌ణం అన్న‌ట్టుగా… ఎలాగూ థియేట‌ర్ల‌ను మూసుకోవ‌డం త‌ప్ప మ‌రో ఆప్ష‌న్ లేని స‌మ‌యంలో,  బంద్ అంటే.. పోయె. నిబంధ‌న‌ల మేర‌కు థియేట‌ర్లను న‌డ‌ప‌డం లేదు, తెరిస్తే అధికారులు రైడ్ అంటారు. మూసేస్తే నిర‌స‌న‌, క‌క్ష సాధింపు .. వంటి మాట‌లు మాట్లాడొచ్చు క‌దా!