ఇండియాలో క‌రోనా రోజువారీ కేసుల త‌క్కువే.. కానీ!

గ‌త ఇర‌వై నాలుగు గంట‌ల్లో దేశంలో సుమారు ఏడు వేల క‌రోనా కేసులు నిర్ధార‌ణ అయిన‌ట్టుగా కేంద్ర ప్ర‌భుత్వ రోజువారీ గ‌ణాంకాల్లో పేర్కొన్నారు. రోజుకు ఏడు వేల క‌రోనా కేసులు అంటే ఇది క‌నిష్ట…

గ‌త ఇర‌వై నాలుగు గంట‌ల్లో దేశంలో సుమారు ఏడు వేల క‌రోనా కేసులు నిర్ధార‌ణ అయిన‌ట్టుగా కేంద్ర ప్ర‌భుత్వ రోజువారీ గ‌ణాంకాల్లో పేర్కొన్నారు. రోజుకు ఏడు వేల క‌రోనా కేసులు అంటే ఇది క‌నిష్ట స్థాయి కిందే లెక్క‌! ఫ‌స్ట్ వేవ్ పూర్తిగా త‌గ్గుముఖం ప‌ట్టింది అనుకున్న ద‌శ‌లో కూడా ఇండియాలో ఇంత క‌న్నా ఎక్కువ కేసులే వ‌చ్చాయి ప్ర‌తి రోజూ! ఇలా ఇండియాలో గ‌త ఏడాదిన్న‌ర నుంచి కేసుల సంఖ్య‌ను ప‌రిశీలిస్తే.. ప్ర‌స్తుతం క‌నిష్ట స్థాయిలోనే ఉంది ప‌రిస్థితి!

అయితే.. ఇప్పుడే ఆందోళ‌న అధికంగా వ్య‌క్తం అవుతూ ఉండ‌టం గ‌మ‌నార్హం. ఒమిక్రాన్ వేరియెంట్ తో ఇండియాలో క‌రోనా టెన్ష‌న్ ఇప్పుడిప్పుడు మ‌ళ్లీ పెరుగుతూ ఉంది. దాదాపు నెల కింద‌టే ద‌క్షిణాఫ్రికాను గ‌డ‌గ‌డ‌లాండించింది ఈ వేరియెంట్. ఇప్పుడు ఒమిక్రాన్ భ‌యాల నేప‌థ్యంలో… మ‌ళ్లీ ప్ర‌భుత్వాలు లాక్ డౌన్లు, ఆంక్ష‌లు అంటున్నాయి. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు ర‌క‌ర‌కాల ఆంక్ష‌ల‌ను ప్ర‌క‌టించాయి. రానున్న వారం ప‌ది రోజులకు గానూ ఆంక్ష‌ల‌ను ప్ర‌క‌టించాయి.

ఇక ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కూ 422 ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు న‌మోదైన‌ట్టుగా ప్ర‌భుత్వం నిర్ధారించింది. అయితే వీరిలో కోలుకున్న వారి సంఖ్య వంద‌కు పైనే ఉందని కూడా తెలుస్తోంది. మిగ‌తా వారికి చికిత్స అందుతోంది. ఒమిక్రాన్ వేరియెంట్ కు గురైన పేషెంట్ల‌ను చూసిన ద‌క్షిణాఫ్రికా డాక్ట‌ర్లు దీంతో మైల్డ్ సింప్ట‌మ్స్ ఉంటాయ‌ని చెప్పిన నేప‌థ్యంలో.. కోలుకున్న వారి సంఖ్య కూడా వేగంగా పెరుగుతున్న నేప‌థ్యంలో.. దీన్నొక లైట్ వేరియెంట్ అని వైద్య ప‌రిశోధ‌కులు మొద‌టి నుంచి చెబుతున్నారు. అయితే.. వేగంగా వ్యాపిస్తుంది అనేది ఈ వేరియెంట్ విష‌యంలో బాగా వినిపిస్తున్న మాట‌.

అలాగే ఇండియాలో ఒమిక్రాన్ కు గురైన వారిలో దాదాపు నాలుగో వంతు మంది రెండో డోసుల వ్యాక్సిన్ ను పొందిన వారే అనే విశ్లేష‌ణ కూడా విస్తు గొలుపుతూ ఉంది. నాలుగు వంద‌ల కేసులు వ‌స్తే.. వారిలో దాదాపు ఎన‌భై మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారేన‌ట‌. దీన్ని బ‌ట్టి.. వ్యాక్సినేష‌న్ జ‌రిగి ఉన్నా.. ఈ వేరియెంట్ లో క‌రోనా వైర‌స్ సోకే అవ‌కాశాలు ఉన్నాయ‌ని స్ప‌ష్టం అవుతోంది. సింప్ట‌మ్స్ మైల్డ్ అనే అంటున్నా.. వ్యాక్సినేష‌న్ ను కూడా ఈ వేరియెంట్ త‌ల‌ద‌న్నేలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే విశ్లేష‌ణ‌లు ఆందోళ రేపుతున్నాయి. దీంతో ఆంక్ష‌లు పెట్ట‌డానికే ప్ర‌భుత్వాలు మొగ్గుచూపుతున్న‌ట్టున్నాయి!