అనామ‌కంగా సుప్రీంకోర్టు మ‌హిళా న్యాయ‌వాది

ఆమె సుప్రీంకోర్టు న్యాయవాది. అన్నీ బాగుంటే స‌మాజంలో గౌర‌వ మ‌ర్యాద‌ల‌తో బ‌త‌కాల్సిన స్థితి. కానీ మ‌తిస్థిమితం కోల్పోయి…ఏ దిక్కూ లేకుండా విశాఖ ఆర్కే బీచ్‌లో అనామ‌క స్థితిలో ప్ర‌త్య‌క్ష‌మైంది. కానీ చ‌క్క‌ని తెలుగు, ఇంగ్లీష్‌,…

ఆమె సుప్రీంకోర్టు న్యాయవాది. అన్నీ బాగుంటే స‌మాజంలో గౌర‌వ మ‌ర్యాద‌ల‌తో బ‌త‌కాల్సిన స్థితి. కానీ మ‌తిస్థిమితం కోల్పోయి…ఏ దిక్కూ లేకుండా విశాఖ ఆర్కే బీచ్‌లో అనామ‌క స్థితిలో ప్ర‌త్య‌క్ష‌మైంది. కానీ చ‌క్క‌ని తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ భాష‌ల్లో న్యాయ‌శాస్త్రం గురించి అన‌ర్ఘ‌ళంగా మాట్లాడ్డం చూసిన వాళ్లు ఆశ్చ‌ర్య పోతున్నారు. స‌దరు మ‌హిళ న్యాయ‌విద్యాధికురాల‌ని భావించి, సంబంధిత వ్య‌క్తుల‌కు స‌మాచారం ఇచ్చారు.

ఈ నేప‌థ్యంలో ఆ మ‌హిళ‌ను విశాఖ‌ప‌ట్నం బార్ కౌన్సిల్ అధ్య‌క్షుడు న‌ర‌సింగ‌రావు, ఇత‌ర న్యాయ వాదులు ప‌ల‌క‌రించారు. త‌న పేరు ర‌మాదేవి అని, సుప్రీంకోర్టు న్యాయ‌వాదిగా చెప్పుకొచ్చారు. అంతేకాదు, త‌న గుర్తింపు కార్డును చూపారు. 

మ‌తిస్థిమితం స‌రిగా లేద‌ని గ్ర‌హించిన న్యాయ‌వాదులు ఆమెను న‌గ‌రంలోని టీఎస్సార్ కాంప్లెక్స్‌లోని ఆశ్రయానికి త‌ర‌లించారు. బ‌హుశా ఆమెను విశాఖ మాన‌సిక వైద్య‌శాల‌కు తీసుకొచ్చి, విడిచి వెళ్లారేమో అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మొద‌ట ఆమె టీఎస్సార్ కాంప్లెక్స్‌లోని ఆశ్రయంలో ఉండ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. స‌మ‌యం గ‌డిచే కొద్దీ స్థిమితంగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆ కేంద్రంలో ఆశ్ర‌యం పొందుతున్నారు. త‌న‌కు భ‌ర్త‌, కుమారుడు ఉన్న‌ట్టు ర‌మాదేవి చెబుతున్న‌ట్టు పోలీసులు పేర్కొన్నారు. ర‌మాదేవి విష‌యాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేష‌న్ దృష్టికి తీసుకెళ‌తామ‌ని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శ‌ర్మ తెలిపారు.