థూచ్ థూచ్‌…నేన‌లా అన‌లేదు!

ఒక మాట మాట్లాడ్డం…దానిపై జ‌నం నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తే యూ ట‌ర్న్ తీసుకోవ‌డం రాజ‌కీయ నాయ‌కుల‌కు అల‌వాటే. సాగు చ‌ట్టాల‌పై కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ తాను అన్న మాట‌కు క‌నీసం…

ఒక మాట మాట్లాడ్డం…దానిపై జ‌నం నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తే యూ ట‌ర్న్ తీసుకోవ‌డం రాజ‌కీయ నాయ‌కుల‌కు అల‌వాటే. సాగు చ‌ట్టాల‌పై కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ తాను అన్న మాట‌కు క‌నీసం 24 గంట‌లు కూడా క‌ట్టుబ‌డి వుండ‌లేదు. 

కొన్నిరాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని, సాగు చ‌ట్టాల‌పై వెన‌క్కి త‌గ్గామ‌ని, తిరిగి స్వ‌ల్ప మార్పుల‌తో తీసుకొస్తామ‌ని కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి నిన్న మ‌హారాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లో కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పారు. కేంద్ర మంత్రి వ్యాఖ్య‌ల‌పై దేశ వ్యాప్తంగా నిర‌స‌న వెల్లువెత్తింది.

మోడీ స‌ర్కార్ కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, అందువ‌ల్లే సాగు చ‌ట్టాల‌ను మ‌ళ్లీ తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌నే విమ‌ర్శ‌లు పెద్ద ఎత్తున వ‌చ్చాయి. దీంతో పంజాబ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ త‌దిత‌ర రాష్ట్రాల్లో జ‌రగ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుంద‌ని బీజేపీ భ‌య‌ప‌డింది. ఈ నేప‌థ్యంలో మంత్రికి చీవాట్లు పెట్టి, త‌న మాట‌ల్ని వెన‌క్కి తీసుకోవాల‌ని ఆదేశించింది.

ఈ నేప‌థ్యంలో మంత్రి ఆదివారం సాగు చ‌ట్టాల‌పై మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సాగు చ‌ట్టాల‌ను మ‌ళ్లీ తీసుకొస్తామ‌ని తాను అన‌లేద‌ని కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి మాట మార్చారు. తన మాటలను ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయని తోమర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ్యవసాయ చట్టాలను మళ్లీ వెనక్కి తీసుకొస్తామని తాను చెప్పనే లేద‌న్నారు. 

రైతుల శ్రేయస్సు కోసం కేంద్ర ప్రభుత్వం మంచి చట్టాలు చేసింద‌న్నారు. కొన్ని కారణాల వల్ల వెనక్కి తగ్గామ‌న్నారు. అయితే రైతుల శ్రేయస్సు గురించి త‌మ‌ ప్రభుత్వం పని చేస్తూనే ఉంటుంద‌న్నారు. ఎందుకంటే రైతులే ఈ దేశానికి వెన్నెముక అని మాట మార్చ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి ప్ర‌తిప‌క్షాల దెబ్బ‌కు కేంద్ర‌మంత్రికి జ్ఞానోద‌యం అయిన‌ట్టుంది. మ‌రోసారి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌కుండా ఉంటారో లేదో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది.