ఇది కదా హుందాతనం అంటే..!

ఈమధ్య సమీక్షకుల మీద పడి ఏడవడం కామన్ అయిపోయింది. విమర్శనాత్మకంగా సమీక్ష వస్తే చాలు తట్టుకోలేకపోతున్నారు కొందరు మేకర్స్. ఈ విషయంలో చిన్నాపెద్ద తేడా లేదు. పెద్ద నిర్మాత మొహంమీదే తిడుతున్నాడు, చిన్న నిర్మాత…

ఈమధ్య సమీక్షకుల మీద పడి ఏడవడం కామన్ అయిపోయింది. విమర్శనాత్మకంగా సమీక్ష వస్తే చాలు తట్టుకోలేకపోతున్నారు కొందరు మేకర్స్. ఈ విషయంలో చిన్నాపెద్ద తేడా లేదు. పెద్ద నిర్మాత మొహంమీదే తిడుతున్నాడు, చిన్న నిర్మాత తన సినిమాను చంపేశారని ఏడుస్తున్నాడు. ఎటొచ్చి సమీక్షకుడిపై విరుచుకుపడడం మాత్రం ఆపడం లేదు.

రెగ్యులర్ సినిమాలకే ఓ రేంజ్ లో విమర్శలు పడుతున్న ఈ కాలంలో ఓ పొలిటికల్ సినిమాపై ఏ రేంజ్ లో ప్రతికూల సమీక్షలు వస్తాయో చెప్పనక్కర్లేదు. యాత్ర-2 సినిమాకు అలానే వచ్చాయి. సీఎం వైఎస్ జగన్ పై తీసిన సినిమా కావడంతో సహజంగానే ఓ వర్గం ఈ సినిమాను దుమ్మెత్తిపోసింది.

అయినా కూడా దర్శకుడు మహి వి రాఘవ్, ఎక్కడా మాట తూలలేదు. పరోక్షంగా కూడా సమీక్షకుల్ని ఒక్క మాట అనలేదు. తన సినిమాకు వ్యతిరేకంగా వచ్చిన విమర్శల్ని కూడా తీసుకుంటానంటున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన మాటలు అతడి హుందాతనాన్ని సూచిస్తున్నాయి.

“నేను తీసిన యాత్ర 2 కొందరికి నచ్చింది.. ఇంకొందరికి నచ్చలేదు.. తీసిందే పొలిటికట్ మూవీ, రాజకీయ నాయకుడి మీద కాబట్టి.. భిన్నాభిప్రాయాలు రావడం సహజం. కానీ ఓ స్టోరీ టెల్లర్‌గా, నేను అనుకున్న కథ, స్క్రిప్ట్‌ను తీశాను. చాలా మందికి నా సినిమా నచ్చింది. కొంతమంది పాజిటివ్‌గా రివ్యూ ఇచ్చారు. ఇంకొంత మంది నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. ఫిల్మ్ మేకర్లుగా సినిమాను తీయడం మా బాధ్యత. విమర్శించారు కదా అని నన్ను నేను డిఫెండ్ చేసుకోను.”

రివ్యూలపై మహి వి రాఘవ్ రియాక్షన్ ఇది. ఓ ఫిలిం మేకర్ గా తను ఏం చేయగలడో, ఎంత వరకు చేయగలడో అంత చేశాడు. సినిమా రిలీజైంది కాబట్టి ఇక దాని గురించి ఆలోచించనని, ఆ ప్రాజెక్టు నుంచి మానసికంగా బయటకు వచ్చేశానని చెప్పాడు.

ఈ సందర్భంగా మరో మంచి విషయం కూడా చెప్పాడు. సాధారణంగా సినిమా రిలీజైన మొదటి రోజు ఆడియన్స్ తో సినిమా చూసి, బయటకొచ్చి రెస్పాన్స్ సూపర్ గా ఉందని చెబుతుంటారు మేకర్స్. తను అలాంటి పని చేయనంటున్నాడు రాఘవ్. సినిమా ఇప్పుడే రిలీజైందని, సోమవారం వస్తే కానీ రియల్ టాక్ బయటకు రాదని ఓపెన్ గా చెబుతున్నాడు.

ఎంత మంది మేకర్స్ ఇలా ఆలోచిస్తారు..? ఎంతమంది దర్శకులు ఇలా బిహేవ్ చేస్తారు..? సినిమా ఫ్లాప్ అయిందని ఓవైపు అంతా ముక్తకంఠంతో అరుస్తుంటే, మరోవైపు తమ సినిమా హిట్టని, కలెక్షన్లు సూపర్ గా వచ్చాయని చంకలు గుద్దుకునే బ్యాచే ఎక్కువమంది ఇక్కడ.