భారత మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుతో పాటు మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌కు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఈ ఏడాదిలో ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాకూర్‌తో కలుపుకోని ఐదుగురికి భారతరత్న వరించింది.
రాజీవ్ హత్యానంతరం నాయకత్వం లేని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అందరికీ పీవీ ఆమోదయోగ్యంగా కనిపించారు. మైనార్టీలోనూ సమర్థంగా ప్రభుత్వాన్ని నడపడంతో పాటు.. అప్పులతో దేశం ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి నుండి ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలను బీజం వేసి ఎకానమీని పట్టాలెక్కించారు. మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా నియమించుకుని.. హరిత విప్లవం, ఎగుమతులు, టెలి కమ్యూనికేషన్, టెక్నాలజీతో దేశం స్వయం సమృద్ధి సాధించేలా చేశారు.
అలాగే ఒక్కసారీ పార్లమెంటుకు వెళ్లని ఏకైక పీఎంగా నిలిచిన చరణ్ సింగ్ రెండు సార్లు యూపీ సీఎంగా, కేంద్ర హోంమంత్రిగా, ఆర్థిక మంత్రిగా సేవలందించారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి రైతు దూతగా పేరుగాంచారు. ఆయన పుట్టిన రోజు డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. చరణ్ సింగ్ జనతా పార్టీ తరఫున 1979 జులై 28 నుండి 1980 జనవరి 14 వరకు ప్రధానిగా చేశారు.
దేశ వ్యవసాయ రంగం రూపురేఖలు మార్చిన హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్.. ముఖ్యంగా వరి వంగడాల్లో ఎక్కువ దిగుబడి వచ్చే వాటిని సృష్టించారు. దీంతో ఆహారం కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం భారత్‌కు లేకుండా చేశారు. ఇటీవలే తన 98 ఏళ్ల వయసులో తమిళనాడు చెన్నైలోని ఆయన నివాసంలో ఎంఎస్ స్వామినాథన్ తుది శ్వాస విడిచారు. కాగా ఒకే ఏడాదిలో ఐదుగురికి భారతరత్న రావడం ఇదే తొలిసారి.