ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు చేసే ప్రత్యర్థులపై మంత్రి రోజా ఒంటికాలిపై విరుచుకుపడుతుంటారు. ఇప్పుడామెకు కొత్త ప్రత్యర్థి దొరికారు. ఆ కొత్త ప్రత్యర్థి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల. సభలు, సమావేశాల్లో తన అన్న ప్రభుత్వంపై షర్మిల తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ ముఖ్య నాయకులెవరూ ఆమెను పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఆమెకు కౌంటర్ ఇచ్చి, అనవసరంగా షర్మిల ఇమేజ్ పెంచడం ఎందుకనే ఆలోచనలో వైసీపీ నేతలున్నారు.
కానీ మంత్రి రోజా ఊరికే ఉండే నాయకురాలు కాదు కదా! షర్మిలపై ఇవాళ రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు షర్మిల ఏ పార్టీలో వున్నారో ఆలోచించుకోవాలని హితవు పలికారు. వైఎస్ జగన్‌ను జైలుపాలు చేసిన కాంగ్రెస్ పార్టీతో షర్మిల చేతులు కలిపి అన్యాయం చేశారని ఆగ్రహించారు. తెలంగాణలో పోరాటం చేస్తా అని చెప్పి కాంగ్రెస్‌లో తన పార్టీని ఎందుకు విలీనం చేసిందో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు షర్మిల ఎందుకొచ్చారు? ఏ ప్రయోజనాలు పొందడానికి కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారో చెప్పాలని రోజా ప్రశ్నించారు. తన తండ్రి వైఎస్సార్ జీవించి వుంటే కాంగ్రెస్‌పై ఉమ్మేసేవాళ్లని తిట్టిన షర్మిల… ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఆ పార్టీలో చేరారని రోజా నిలదీయడం విశేషం.
వైఎస్ జగన్ దమ్మున్న నాయకుడని రోజా ప్రశంసలతో ముంచెత్తారు. అమిత్‌షా కాళ్లు పట్టుకున్న చంద్రబాబు తమ చిత్తూరు జిల్లాలో పుట్టడం సిగ్గుచేటని రోజా విమర్శించారు. రాజకీయంగా చంద్రబాబు రోజురోజుకూ దిగజారుతున్నారని రోజా మండిపడ్డారు.