లవ్ స్టోరీ సినిమా నుంచి విడుదల తేదీలు రావడం, వాయిదాలు పడడం కొత్త కాదు. ఏడాదిన్నరగా అదే జరుగుతోంది. రీసెంట్ గా కూడా ఓసారి రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడీ సినిమాకు కొత్తగా మరో తేదీ ప్రకటించారు. ఈనెల 24న లవ్ స్టోరీ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు నిర్మాతలు.
ఆంధ్రప్రదేశ్ లో థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు, టిక్కెట్ రేట్లు కూడా పెంచలేదు. ఇటు తెలంగాణలో కూడా ఆక్యుపెన్సీ అంతంతమాత్రంగానే ఉంది. దీంతో తమకు గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో ఈ సినిమాను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నారు నిర్మాతలు. అయితే పరిస్థితుల్లో మార్పు కనిపించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య మరో కొత్త తేదీ ప్రకటించి సినిమాను విడుదల చేయబోతున్నారు.
కావాలంటే మేకర్స్ మరో నెల లేదా 2 నెలలు ఆగొచ్చు. ఫైనాన్షియల్ గా వాళ్లకొచ్చిన ఇబ్బందేం లేదు. కాకపోతే అక్టోబర్ నుంచి పెద్ద సినిమాలు క్యూ కడుతున్నాయి. ఆక్యుపెన్సీ, టిక్కెట్ రేట్ల మాట దేవుడెరుగు.. బడా సినిమాల పోటీతో థియేటర్లే దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే అన్ని లెక్కలు వేసుకొని, 24న వచ్చేయాలని డిసైడ్ అయ్యాడు. సో.. ఈసారి రావడం పక్కా.
ఎప్పట్లానే లాంగ్ గ్యాప్ తీసుకొని ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న సినిమా ఇది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సారంగ దరియా సాంగ్ పెద్ద హిట్టవ్వడం సినిమాకు హైప్ తెచ్చింది.