ఈ పని ముందే చేయొచ్చుగా ‘టైగర్’

దసరా బరిలో కాస్త భారీ నిడివితో వచ్చిన సినిమా టైగర్ నాగేశ్వరరావు మాత్రమే. దాదాపు 3 గంటల రన్ టైమ్ తో వచ్చిన ఈ సినిమాను పండగ టైమ్ లో ప్రేక్షకులు రిసీప్ చేసుకుంటారా…

దసరా బరిలో కాస్త భారీ నిడివితో వచ్చిన సినిమా టైగర్ నాగేశ్వరరావు మాత్రమే. దాదాపు 3 గంటల రన్ టైమ్ తో వచ్చిన ఈ సినిమాను పండగ టైమ్ లో ప్రేక్షకులు రిసీప్ చేసుకుంటారా అనే అనుమానాల్ని విడుదలకు ముందే వ్యక్తం చేసింది మీడియా. అయితే మేకర్స్ మాత్రం ఈ వాదనను తిప్పికొట్టారు.

టైగర్ నాగేశ్వరరావు సినిమాను కదలకుండా 3 గంటల పాటు చూస్తారంటూ ప్రకటించాడు దర్శకుడు. అక్కడితో ఆగకుండా, రోలింగ్ టైటిల్స్ వచ్చినప్పుడు కూడా సీట్ల నుంచి ప్రేక్షకులు లేవరని ధీమా వ్యక్తం చేశాడు. కానీ మీడియా అనుమానమే నిజమైంది.

టైగర్ నాగేశ్వరరావు రన్ టైమ్ పై పూర్తిస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు, సినిమాకు నెగెటివ్ టాక్ రావడానికి కూడా ఈ భారీ నిడివే ప్రధాన కారణంగా మారింది. దీంతో మేకర్స్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగారు. 3 గంటల సినిమాను 2 గంటల 37 నిమిషాలకు కుదించారు.

అయితే ఇప్పటికే ఆలస్యమైంది. టైగర్ నాగేశ్వరరావు సినిమాపై ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చేసింది. మౌత్ టాక్ కూడా నెగెటివ్ గా వెళ్లిపోయింది. ఇలాంటి టైమ్ లో సినిమా రన్ టైమ్ కుదించినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కాకపోతే, దసరా సీజన్ కాబట్టి.. ఆది, సోమవారాలు ఈ సినిమాను ప్రేక్షకులు లెక్కలోకి తీసుకునే అవకాశం ఉంది.

అయితే ఇలా నిడివి తగ్గించే పనేదో రిలీజ్ కు ముందే చేసి ఉంటే, ఇంత నష్టం జరిగి ఉండేది కాదనేది చాలామంది అభిప్రాయం. తాము తీసిన ప్రొడక్ట్ పై మేకర్స్ కు విపరీతమైన ప్రేమ ఉండడం సహజం. ఆ ప్రేమతోనే లెంగ్త్ తగ్గించలేదు. అలాంటి టైమ్ లోనే 'దిల్ రాజు ఫార్ములా'ను ఫాలో అవ్వాలి. 

యూనిట్ తో సంబంధంలేని కొంతమంది సినీ ప్రముఖులకు తన సినిమాల్ని చూపిస్తుంటారు దిల్ రాజు. వాళ్ల ఫీడ్ బ్యాక్ ఆధారంగా రన్ టైమ్ తగ్గిస్తుంటారు. టైగర్ నాగేశ్వరరావు కు కూడా ఆ పద్ధతి ఫాలో అయితే బాగుండేది. ఇప్పుడిలా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం ఎంతనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.