టిప్ టిప్ బర్సా పానీ… దేశ వ్యాప్తంగా మోగిపోయిన పాట. ఉత్తరాది దక్షిణాది తేడాల్లేకుండా సూపర్ హిట్ అయిన పాట. 90స్ లో, ఆడియో క్యాసెట్ల యుగంలో… ఆకాశవాణీ వివిధ భారతి ప్రోగ్రామ్ లో.. ఒక ఊపు ఊపిన పాట. యూట్యూబ్ పాపులర్ అయ్యాకా కూడా.. ఇంటర్నెట్ విస్తృతం అయ్యాకా.. కూడా ఈ సాంగ్ మోగుతూనే ఉంది. ఈ పాట ఏ సినిమాలోది, ఆ సినిమాను ఎంత మంది చూశారనేది పక్కన పెడితే, ఈ పాట మాత్రం ఆల్ టైమ్ సూపర్ హిట్స్ లో ఒకటి.
ప్రత్యేకించి ఈ పాటలో రవీనా విజృంభించిన తీరు.. అమోఘం అనే చెప్పాలి. హాట్, బ్యూటిఫుల్ రెయిన్ సాంగ్స్ లో టాప్ పొజిషన్లలో ఉంటుంది టిప్ టిప్ బర్సా పానీ! మరి అలాంటి పాటను రీమిక్స్ చేయడం అంటే.. సాహసమేనే చెప్పాలి!
మరి ఆ సాహసం చేసిన.. సూర్యవంశీ యూనిట్ కు .. ఆ పాట విలువ తెలుసా మీకు? అంటూ.. క్లాస్ పీకాల్సిన సమయం వచ్చినట్టుగా ఉంది! ఆ టెంపో ఏదీ? ఆ బీట్ ఏదీ? మీరు ఎంచుకున్న శ్రుతేమిటి? ఆ పాట శ్రుతేమిటి? మేము ఏదో ఊహించుకుంటాం.. మీరు మాత్రం అక్కడకు రారు! అని కత్రినాకైఫ్ కే కాదు, అక్షయ్ కుమార్ కు కూడా క్లాస్ తప్పదు!
వాస్తవానికి ఒరిజినల్ లో నర్తించిన అక్షయ్ కుమారే ఈ రీమిక్స్ వెర్షన్ లోనూ కనిపించాడు, కాకపోతే భావరాహిత్యంగా! ఒరిజినల్ లో అక్షయ్ ఎక్స్ ప్రెషన్ తో పోలిస్తే.. ఇందులో ఏరకంగానూ గుర్తుండిపోడు. ఇక కత్రినా కైఫ్ తను చేయగలిగిందంతా చేసింది కానీ, రవీనాను ఏ మాత్రం మరిపించలేకపోయింది.
కత్రినాకు తన ఖాతాలో మంచి డ్యాన్స్ నంబర్లున్నాయి. వాటితో ఆట్టుకునే ఈ షీలా.. ఈ రీమేక్స్ లో మాత్రం తేలిపోయింది. రవీనా ఎందుకు ప్రత్యేకమో కత్రినా ప్రతిభా ప్రదర్శన తర్వాత మరోసారి స్పష్టం అవుతుంది.
ఇక ఈ వానపాటకు అయితే వ్యూస్ ఉన్నాయి, యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. అంతా ఓకే, ఆ పాత సింగర్ల గానమే మరోసారి వినిపిస్తుంది, అయినా.. ఇది చూశాకా, ఒరిజినల్ వెర్షన్ ను మరోసారి చూస్తే తప్ప తృప్తి ఉండదు!