రాష్ట్రం ఆర్ధిక పరిస్థితి చూస్తే అయ్యో అని ఎవరైనా అంటారు. ఖజనా కష్టాల్లో ఉంది. ఇది పచ్చి నిజం. ఇక్కడ ప్రతి రూపాయి కూడా విలువైనదే. అలాంటి సమయంలో ఏపీకి ఆదాయాన్ని ఇచ్చే శాఖలను పరుగులు పెట్టించి పైసా వసూల్ చేయాల్సిన బాధ్యత ఏలికలదే. మరో వైపు అధికారులు సైతం తమ విధులను సక్రమంగా నిర్వహించి ఖజానాను ఎంతో కొంత పరిపుష్టం చేయాలి.
కానీ ఆదాయాన్ని అతిగా తెచ్చే మైనింగ్ శాఖలో అధికారుల తీరు మాత్రం కంప్లీట్ రివర్స్ లో ఉందన్న విమర్శలు వస్తున్నాయి. విశాఖ జిల్లా అనకాపల్లిలోని మైనింగ్ విభాగం అధికారులు మొద్దు నిద్ర పోతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గనుల శాఖలో ఏమి జరుగుతున్నా పట్టనట్లుగా ఉన్నారు అంటున్నారు.
అనకాపల్లి అసిస్టెంట్ డైరెక్టర్టర్ ఆఫీస్ పరిధిలో పెద్ద ఎత్తున ఉన్న మైనింగ్ వనరుల వల్ల సీనరేజ్ ఆదాయం కోట్లలో నెలకు వస్తుంది. రోలుగుంట, నర్శీపట్నం, మాకవరపాలెం తదితర ప్రాంతాల్లో గ్రావెల్, రోడ్ మెటల్, రఫ్ స్టోన్ వంటి వాటి ద్వారా సీనరేజ్ నెలకు కనీసంగా పదిహేను కోట్ల దాకా వస్తుంది.
అయితే వీటిని లీజునకు ఇవ్వాలి. పర్మిట్లు ఇవ్వాలి. ఆదాయ మార్గాలను పెంచాలి. కానీ మైనింగ్ అధికారులు తమకేం పట్టనట్లుగా ఉన్నారు. పర్మిట్లు లేవు, లీజులు అంతకంటే లేవు. దాంతో పాటు తనిఖీలు లేవు. ఇక ఆదాయం అంతా అక్రమదారుల పాలు అవుతోంది. తవ్వుకున్న వాడికి తవ్వుకున్నంతగా మైనింగ్ ఆదాయం పోతోంది.
దీని వల్ల ప్రభుత్వానికి ఏదో ముష్టిపడేసినట్లుగా నెలకు అరవై లక్షలు సీనరేజి వస్తే అదే గొప్ప అన్నట్లుగా సీన్ ఉంది. మరి ఎక్కడ పదిహేను కోట్ల రూపాయలు, మరెక్కడ అరవై లక్షలు. ఈ తేడాను పూడ్చడం ఎవరి పని. గనులు దోచేస్తున్న వారిని ఆపడం చేయకపోతే సర్కార్ ఆదాయానికి గండి పడిపోతోంది.
కొద్ది రోజుల క్రితం ఇక్కడ నుంచి ఒక సిన్సియర్ అధికారి విజిలెన్స్ ఏడీ ప్రతాప రెడ్డి బదిలీ తరువాత అక్రమార్కులు బోర విడిచేశారు. అదే టైమ్ లో ఉన్న అధికారులు కళ్ళు మూసుకుంటున్నారు అంటున్నారు. ఫలితంగా సర్కార్ ఖజానాకు చేరాల్సిన భారీ ఆదాయం అక్రమార్కుల పాలవుతోంది. ఇది దారుణమే.