అవతల వాళ్ల టాలెంట్ ను అడ్డంగా వాడేసుకోవడం తెలుగు సినిమా వాళ్లకు బాగా అలవాటే. పేరెన్నిక గల , టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్లుగా, రచయితలుగా, సంగీత దర్శకులుగా పేరు పొందిన వాళ్లు.. తమ చోరకళా నైపుణ్యాన్ని రకరకాలుగా చూపిస్తూ ఉంటారు. హాలీవుడ్ సినిమాల నుంచి తెలుగు దర్శక, రచయితలు సీన్లను కాపీ కొట్టడం గురించి నేటి తరం నెటిజన్లు టాప్ డైరెక్టర్లను కూడా కడిగేస్తూ ఉంటారు. ఎస్ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి కోట్ల రూపాయల పారితోషకం డైరెక్టర్ల కాపీ కళా ప్రావీణ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే!
తమ డైనింగ్ టేబుళ్ల వద్ద కథల ఐడియాలు వచ్చినట్టుగా, తమ ఇంట్లో వాళ్లంతా కూర్చుని కథను డెవలప్ చేసినట్టుగా కాకమ్మ కథలు చెప్పే వీళ్లు, ఎవరో రాసిన దాన్ని కాపీ కొట్టి, కనీసం వాళ్లకు క్రెడిట్ ఇవ్వని వాళ్లనీ వివరించనక్కర్లేదు. కాపీ కొడితే కొట్టారు.. కనీసం ఒరిజినల్ ను రాసిన వాళ్లకు క్రెడిట్ ఇస్తే అదో ముచ్చట!
అయితే తాము చాలా మందికి ఆరాధ్యనీయులమన్నట్టుగా, తాము గురూజీలమన్నట్టుగా వీళ్లు కాపీ కొట్టడం తమ జన్మహక్కు అన్నట్టుగా ఫీలవుతూ ఉంటారు. ఆఖరికి ఒక బక్కచిక్కిన, బీద కళాకారుడిని కూడా టాలీవుడ్ సినీ పెద్దలు పెట్టే ముప్పుతిప్పలు అన్నీ ఇన్నీ కావు. అందుకు ఒక ఉదాహరణ వంగపండు పాటను టాలీవుడ్ వసూళ్ల రికార్డులను తిరగరాసిన మగధీర సినిమాలో అయాచితంగా వాడుకోవడం!
ఎంతో స్ఫూర్తిదాయకంగా, యువతను మేల్కొలిపే ఉద్దేశంతో వంగపండు తనే రాసి, బాణీ కట్టి, పాడి ఉర్రూతలూగించిన.. 'ఏం పిల్లో ఎల్దమొస్తవా..' పాటను ఆయనకు కనీసం సమాచారం ఇవ్వకుండా మగధీర సినిమాలో వాడుకున్నారు. ఆ ట్యూన్ ను ఆ లిరిక్స్ నూ వాడుకున్నారు. వాళ్ల పాటమధ్యలో వాడేసుకున్నారు. ఆ సినిమాతో పాటు ఆ పాట కూడా హిట్టైంది. వాస్తవానికి వంగపండు వంటి వాగ్గేయకారుడు ఆ పాటను రాసుకున్న సందర్భం, బాణీ కట్టిన ఊపు వేరు. వీళ్లేమో ఐటమ్ సాంగ్ మధ్యలో పెట్టేసుకున్నారు.
ఉన్నత భావాలతో రాసుకున్న పాటను తమ చిల్లర పాటలో కలిపేసుకున్నారు. కనీస అనుమతి లేకుండా వాడుకున్నారు. తన పాటను అడ్డదిడ్డంగా, కనీసం తన అనుమతి లేకుండా వాడటంపై వంగపండు అసహనం వ్యక్తం చేశారు. అప్పుడు కూడా ఆయనను అటు దర్శకుడు రాజమౌళి కానీ, ఆ సినిమా నిర్మాత అల్లు అరవింద్ కానీ, సంగీత దర్శకుడు కీరవాణి కానీ పట్టించుకోలేదు. ఆఖరికి వాళ్ల ఇళ్ల ముందు నిలబడాల్సి వచ్చింది ఆ కళాకారుడు. ఆయన పాటను, అనుమతి లేకుండా, అడ్డంగా వాడుకుని.. చివరకు ఆయనను తమ ఇళ్ల ముందు నిలబెట్టి.. ఆయనను రోడ్డు మీదకు తీసుకొచ్చిన ఘతన టాలీవుడ్ లో దిగ్ధదర్శకులుగా, సినీ పెద్దలుగా చలామణి అవుతున్న వారిది. ఆ సమయంలో ప్రింట్ మీడియా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. చివరకు ఏదో మొక్కుబడిగా స్పందించారు. ఇదీ ఒక పేద కళాకారుడి విషయంలో టాలీవుడ్ స్పందించిన తీరు!