కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సత్సంబంధాలున్న నేపథ్యంలో…టీటీడీ అనుబంధ ఎస్వీబీ చానల్‌లో కొందరు అధికారుల అహంకార ధోరణితో జగన్ సర్కార్‌కు హిందూ వ్యతిరేకమనే చెడ్డపేరు వస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో బుధవారం ప్రధాని మోడీ రామాలయం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమాన్ని దేశంలోని అన్ని జాతీయ , ప్రాంతీయ చానళ్లు అన్ని కార్యక్రమాలను పక్కన పెట్టి ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఎవరెన్ని విమర్శించినా అయోధ్యలో రామాలయం కట్టడం హిందువుల మనోభావాలకు సంబంధించి అతిపెద్ద కార్యక్రమం. అందువల్లే ఈ కార్యక్రమానికి అంత ప్రాధాన్యం.
కాగా టీటీడీ అనుబంధంగా కాంగ్రెస్ హయాంలో నాటి ఆలయ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలో శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌ను ప్రారంభించారు. ఈ చానల్ ద్వారా హిందుత్వ గొప్పదనాన్ని నలుదిశలా చాటి చెప్పడం ముఖ్య ఉద్దేశం. అయితే అయోధ్యలో ప్రధాని మోడీ భూమిపూజను ప్రసారం చేయకపోవడం వివాదాస్పదమవుతోంది.
అయోధ్యలో రామాలయ భూమి పూజలను ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడం ద్వారా కోట్లాది మంది హిందువుల మనోభావాలను ఎస్వీబీసీ (శ్రీవేంకటేశ్వర భక్తి చానల్) దెబ్బతీసిందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి వెళ్లిన శారదాపీఠం విశాఖలో ప్రత్యక్ష ప్రసారాలు చేసే టీటీడీ అయోధ్య ప్రసారాలు ఎందుకు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ ఆగ్రహించడంలో న్యాయం ఉంది. హిందూ ధర్మప్రచారం కోసం నెలకొల్సిన ఎస్వీబీసీలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామాల య నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రసారం చేయకపోవడంలో ఔచిత్యం ఏంటి? ఒకవైపు జగన్ సర్కార్ చేపట్టిన మూడు రాజధానుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో సానుకూలంగా సహకరిస్తున్న తరుణంలో…టీటీడీలోని కొందరు అధికారుల వల్ల చెడ్డపేరు వస్తోంది.
అనేక వివాదాల మధ్య ఎస్వీబీసీ చైర్మన్‌గా సినీ నటుడు పృద్వీరాజ్‌ను తొలగించిన నేపథ్యంలో కొత్తవారిని నియమించలేదు. ఎస్వీబీసీ ఎండీగా టీటీడీ అదనపు జేఈవో ధర్మారెడ్డికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. అలాగే సీఈవోగా వెంకటనాగేష్ వ్యవహరిస్తున్నారు. హోదాలపై ఉన్న శ్రద్ధాసక్తులు, చానల్ ప్రసారాలపై కనబరచడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ రామాలయ ప్రసారాలను చూపుతున్నారు.