సంక్రాంతి సందర్భంగా విడుదలైన పెద్ద హీరోల సినిమాలకు సంబంధించి వసూళ్ల నంబర్లు హోరెత్తిపోతున్నాయి! అదిగో పది కోట్లు, ఇదిగో యాభై కోట్లు, అల్లదిగో వంద కోట్లు… అంటూ ఉన్నవీ లేనివీ కలిపి ప్రచారానికి నోచుకుంటూ ఉన్నాయి! నైజాంలో ఇంత, నెల్లూరులో ఇంత, అమెరికాలో అంత అంటూ.. సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో రొటీన్ ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. ఇవన్నీ ప్రచారాలే! అంటే ఎవరికి వారు చేసుకునేవే!
హీరోల ఫ్యాన్స్ కు ఆ మేరకు సోషల్ నెట్ వర్కింగ్ ఉంది. దీనికి తోడు నిర్మాణ సంస్థలు తమ సినిమాలు ఎలాంటి స్థితిలో ఉన్నా.. వసూళ్ల విషయంలో భారీ నంబర్లను ప్రకటించేసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడవు! అదేమంటే అవన్నీ ఉత్తుత్తి నంబర్లు అని ప్రచారం కోసం తాము అలా చెబుతాం తప్ప అలాంటిదేమీ ఉండదని.. ఏ ఐటీ దాడులో, జీఎస్టీ దాడులో జరిగినప్పుడు ఈ నిర్మాతలు తాపీగా చెప్పుకుంటూ ఉంటారు!
ఏతావాతా వెర్రివాళ్లు ఈ వసూళ్ల నంబర్లను నమ్మే వాళ్లు మాత్రమేననమాట. ఒకవేళ ఈ వసూళ్లన్నీ నిజమే అనుకుందాం. ఈ పాటికి వీరసింహారెడ్డి ఒక యాభై అరవై కోట్లు, వాల్తేర్ వీరయ్య ఇంకో డెబ్బై కోట్లు, ఇంకా విజయ్ సినిమా తెలుగు తమిళంలో కలిపి మరిన్ని పదుల కోట్లు , ఇక అజిత్ సినిమా అయితే ఇప్పటికే వంద కోట్ల రూపాయల వసూళ్ల మార్కును దాటేసిందట!
మరి ఇంకేం.. మరో ఏడాది సంక్రాంతికి కూడా పెద్ద హీరోలంతా తమ రేంజ్ సినిమాలను అందించేసినట్టే! తలా ఒక వంద కోట్ల రూపాయలో, అంతకు మించి వసూళ్లను సాధించేశారంటే.. హిట్స్ ను, సూపర్ హిట్స్ ను కొట్టేసినట్టే! ఇన్నేసి కోట్ల రూపాయలు వచ్చేశాయంటే ఆ సినిమాలన్నీ హిట్టే!
ఇంకేముంది.. చెప్పుకోవడానికి! స్టార్ హీరోలు కథలు, కథనాల విషయంలో శ్రద్ధ వహించడం లేదని, ప్రత్యేకించి తెలుగు స్టార్లు నాలుగైదు ఫైట్లు, నాలుగైదు పాటలు, పంచ్ డైలాగులు తప్ప తమ సినిమాల్లో మరేవాటికీ తావు ఇవ్వడం లేదని సగటు సినీ ప్రేక్షకుడు వాపోవడం కేవలం అరణ్య రోదనే ఇక! వీరయ్య, వీర సింహారెడ్డిలకే వందల కోట్ల రూపాయలు వచ్చేసే పుణ్యానికి ఇక చిరంజీవో, బాలకృష్ణో.. ప్రత్యేకంగా కథ, కథనాల మీద విపరీతంగా కసరత్తు చేసేయాల్సిన అవసరం ఏమిటి?
ఈ సినిమాలతోనే లాభాలు వస్తున్నప్పుడు జుట్టు ఊడిపోయిన దశలో ఆ హీరోలు ప్రత్యేకంగా కథల మీద జుట్టుపీక్కోవాల్సినంత అవసరం లేకపోవచ్చు! ఇదే విధంగా.. రొటీన్ గా, పరమ రొటీన్ గా వసూళ్ల పర్వాలను కొనసాగించుకోవచ్చు. ఇక అనే జనాలు ఎప్పుడూ అంటూనే ఉంటారు. అభిమానులు ఉండగా.. ఈ హీరోలు వండిందే పరమాన్నంగా ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకైనా థియేటర్లలో చూస్తుండగా.. ఇక హీరోలకు ఏల చింత!