విజయవాడ ఎంపీ కేశినేని నాని అంటే చంద్రబాబు వణికిపోతున్నారా? అనే ప్రశ్నకు…ఔననే సమాధానం వస్తోంది. కేశినేని పదేపదే పార్టీ వ్యతిరేక కామెంట్స్ చేస్తున్నా, చంద్రబాబునాయుడు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై టీడీపీలో అంతర్గతంగా కొందరు కుతకుతలాడుతున్నారు. బాబు భయాన్ని కేశినేని అలుసుగా తీసుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. తన తమ్ముడు కేశినేని చిన్నాకు టికెట్ ఇచ్చినా చేయనని, అలాగే బుద్ధా వెంకన్న, బొండా ఉమాల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసినా అధిష్టానం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ఏంటనే నిలదీతలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే తమ ప్రత్యర్థి వైఎస్ జగన్ విషయానికి వస్తే, ప్రభుత్వ వ్యతిరేక కామెంట్స్ చేస్తున్న ఆనం రామనారాయణరెడ్డిపై చర్యలు తీసుకోవడాన్ని గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఆనం పవర్స్ కట్ చేయడాన్ని కేశినేని వ్యతిరేకులు ఉదహరించడం గమనార్హం.
తమ్ముడు చిన్నితో పాటు మరో ముగ్గురికి సీటు ఇస్తే సహకరించబోనని కేశినేని చంద్రబాబుకు తేల్చి చెప్పారు. బహిరంగంగా కేశినేని పార్టీ ధిక్కార వ్యాఖ్యలు చేసినా అధిష్టానం ఎందుకు చూస్తూ ఊరుకున్నదో అర్థం కావడం లేదనే ప్రశ్న ఆయన వ్యతిరేకుల నుంచి వస్తోంది. టీడీపీలో దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్ లాంటి అంతర్జాతీయ నేరస్తులు, అలాగే భూకబ్జాదా రులు, కాల్‌మనీ సెక్స్ రాకెట్ మోసగాళ్లు ఉన్నారని సొంత పార్టీకి చెందిన ఎంపీ వ్యాఖ్యానిస్తే, అది అధికార పార్టీకి ఆయుధం ఇచ్చినట్టు కాదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
బొండా ఉమా, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాతో కేశినేని నానికి కొన్నేళ్లుగా విభేదాలున్నాయి. వీరు పరస్పరం బహిరంగంగానే విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేశినేని నాని మరోసారి ఫైర్ కావడం వెనుక కారణాలపై చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా విజయవాడలో తమ్ముళ్ల మధ్య విభేదాలు చంద్రబాబు నాయకత్వానికి సవాల్‌గా నిలిచాయి. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నా చంద్రబాబు ఏం చేయలేరనే సంకేతాలు జనంలోకి వెళుతున్నాయి.