రూటు మార్చిన హీరోలు.. ఈసారి ఏమౌతుందో?

కరోనా తర్వాత థియేట్రికల్ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. ఓ మోస్తరుగా ఉన్న సినిమాల కోసం ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. కొంతమంది హీరోల సినిమాలకైతే, హిట్ టాక్ వచ్చినా థియేటర్ కు వచ్చి చూడాలనుకోవడం…

కరోనా తర్వాత థియేట్రికల్ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. ఓ మోస్తరుగా ఉన్న సినిమాల కోసం ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. కొంతమంది హీరోల సినిమాలకైతే, హిట్ టాక్ వచ్చినా థియేటర్ కు వచ్చి చూడాలనుకోవడం లేదు. దీంతో కొంతమంది హీరోలు రూటు మార్చారు. ఇన్నాళ్లూ సిల్వర్ స్క్రీన్ ను పట్టుకొని విక్రమార్క ప్రయత్నాలు చేసిన హీరోలు కొంతమంది, ఇప్పుడు ఓటీటీ బాట పట్టారు.

వరుసగా ఫ్లాపులు చవిచూస్తున్న రాజ్ తరుణ్ ఓటీటీలోకి ఎంటరయ్యాడు. అహనా పెళ్లంట అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈనెల్లోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. సినిమా నుంచి ఓటీటీలోకి వచ్చినా తన మార్క్ వదల్లేదు రాజ్ తరుణ్. తనకు సూటయ్యే కథ, క్యారెక్టర్ నే ఎంచుకున్నాడు. ఈ ఓటీటీ వెంచర్ తో హిట్ కొట్టి మళ్లీ వెండితెరపైకి రావాలనేది ఇతగాడి ప్లాన్.

అటు ఆది సాయికుమార్ కూడా ఇదే పనిలో ఉన్నాడు. గ్యాప్ లేకుండా సినిమాలు తీస్తూ, వరుసపెట్టి ఫ్లాపులు అందుకుంటున్న ఈ హీరో, సినిమాలకు కాస్త విరామం ఇచ్చాడు. ఓటీటీలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇతడు నటిస్తున్న వెబ్ సిరీస్ ఒకటి భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. దాదాపు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టులంతా ఇందులో నటిస్తున్నారు.

అటు సుశాంత్ ఆల్రెడీ ఓటీటీలోకి ఎంటరై చేతులు కాల్చుకున్నాడు. అతడు నటించిన ఓ వెబ్ సిరీస్ అభాసుపాలైంది. నవీన్ చంద్ర సినిమాలు చేస్తూనే, అడపాదడపా ఓటీటీలో కూడా మెరుస్తున్నాడు. ప్రస్తుతానికి ఇతగాడి పరిస్థితి బాగుంది. అటు శ్రీకాంత్ కూడా తనకొచ్చిన ఏ అవకాశం వదలకుండా ఓటీటీలో దూసుకుపోతున్నాడు.

ఇక త్వరలోనే రానా-వెంకీ కలిసి ఓ వెబ్ డ్రామాలో కనిపించబోతున్నారు. అటు నాగచైతన్య కూడా దూత అనే ఓ వెబ్ సిరీస్ చేశాడు. త్వరలోనే వీళ్ల ప్రాజెక్టులు కూడా స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. ఇక ఎప్పట్నుంచో వెబ్ సిరీస్ చేస్తానంటున్న నాగార్జున కూడా త్వరలోనే ఓటీటీలో అడుగుపెట్టబోతున్నారు.

ఇలా ఇండస్ట్రీకి చెందిన చాలామంది హీరోలు రూటుమార్చారు. సక్సెస్ లేని హీరోలు ఓటీటీపైనే ఆధారపడుతుంటే, క్రేజ్ ఉన్నప్పటికీ కొత్తదనం కోసం ఓటీటీలో అడుగుపెడుతున్నారు మరికొంతమంది. అన్నట్టు ఈ హీరోలతో పాటే పైరసీ కూడా ఓటీటీలోకి ఎంటరైంది. ఇలా స్ట్రీమింగ్ కు రావడం ఆలస్యం, అలా పైరసీ సైట్లలో కనిపిస్తున్నాయి చాలా వెబ్ డ్రామాలు.