మూడు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తుల్ని, రహస్యంగా పెళ్లిళ్లు చేసుకునే వ్యక్తుల్ని నిత్య పెళ్లికొడుకు అనడం పరిపాటి. అయితే ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తికి మాత్రం ఇంతకంటే పెద్ద పేరు ఏదైనా ఉంటే పెట్టాలి. ఎందుకంటే, అతడిప్పుడు 88వ సారి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు మరి.
పశ్చిమ జావ ప్రాంతంలోని మజలెంకాకు చెందిన ఓ రైతుకు ఇదే పని. అతడి పేరు కాన్. వయసు 61 సంవత్సరాలు. ఇప్పటివరకు 87 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇప్పుడు 88వ పెళ్లికి రెడీ అవుతున్నాడు.
తన 86వ భార్యకు విడాకులిచ్చాడు కాన్. ఇప్పుడు ఆమెనే తిరిగి వివాహం చేసుకోబోతున్నాడు. విడాకులు తీసుకున్నప్పటికీ, తన మాజీ భార్యకు తనపై ప్రేమ తగ్గలేదని, అందుకే తనను తిరిగి పెళ్లాడుతున్నట్టు వెల్లడించాడు కాన్.
తొలిసారి 14వ ఏట పెళ్లి చేసుకున్నాడు కాన్. తన కంటే రెండేళ్ల పెద్దదైన అమ్మాయిని వివాహం ఆడాడు. జస్ట్ రెండేళ్లు మాత్రమే కాపురం చేశాడు. ఆ తర్వాత ఆమె వెళ్లిపోయింది. ఆ రెండేళ్లలోనే అమ్మాయిల గురించి తనకు పూర్తిగా తెలిసిపోయిందంటున్నాడు కాన్.
అప్పట్నుంచి మినిమం గ్యాప్స్ లో పెళ్లిళ్లు చేసుకుంటూనే ఉన్నాడు. అందుకే ఇతడ్ని స్థానికంగా 'ప్లే బాయ్ కింగ్' అని పిలుస్తారు. తను ఎవ్వర్నీ బలవంతంగా వివాహం చేసుకోనని చెబుతున్నాడు కాన్. అలా అని పెళ్లి చేసుకోకుండా ప్రేమను ఇవ్వలేనని కూడా చెబుతున్నాడు. అందుకే 61 ఏళ్లలో 87 పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందని, ఇప్పుడు 88వ పెళ్లికి రెడీ అవుతున్నానని అన్నాడు.
తన జీవితంలో తనకు పొలం పనులు చేయడం, పెళ్లి చేసుకోవడం మాత్రమే తెలుసంటున్నాడు కాన్. ఇతడికి ఎంతమంది పిల్లలు ఉన్నారనే అంశంపై ఎవ్వరికీ స్పష్టత లేదు.