నవంబర్ బాక్సాఫీస్: పెద్ద సినిమా ఎక్కడ?

పెద్ద సినిమాలన్నీ క్రిస్మస్ కోసమో, సంక్రాంతి కోసమో ఎదురుచూస్తున్నాయి. దీంతో ఈనెల బాక్సాఫీస్ బోసిపోయింది. చెప్పుకోడానికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ, అందులో క్రేజ్ ఉన్న సినిమా ఒక్కటి కనిపించడం లేదు. ఇంతకీ…

పెద్ద సినిమాలన్నీ క్రిస్మస్ కోసమో, సంక్రాంతి కోసమో ఎదురుచూస్తున్నాయి. దీంతో ఈనెల బాక్సాఫీస్ బోసిపోయింది. చెప్పుకోడానికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ, అందులో క్రేజ్ ఉన్న సినిమా ఒక్కటి కనిపించడం లేదు. ఇంతకీ ఈ నెల ఏఏ సినిమాలొస్తున్నాయి?

ఈ వీకెండ్ ఏకంగా అరడజనుకు పైగా చిన్న సినిమాలొస్తున్నాయి. వీటిలో చెప్పుకోదగ్గ మూవీ ఊర్వశివో రాక్షశివో. సుదీర్ఘ విరామం తర్వాత అల్లు శిరీష్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఇంతకుముందు ఈ సినిమాకు ప్రేమ కాదంట అనే పేరు పెట్టారు. ఆఖరి నిమిషంలో టైటిల్ మార్చి, ఊర్వశివో రాక్షసివో అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ప్రమోషన్ గట్టిగానే చేస్తున్నారు కానీ జనాల్లో నలగడం లేదు ఈ సినిమా.

ఈ సినిమాతో పాటు లైక్ షేర్ సబ్ స్క్రైబ్ అనే సినిమా వస్తోంది. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకుడు. కామెడీ బాగా పేలుతుందనే అంచనాల మధ్య థియేటర్లలోకి వస్తోంది ఈ సినిమా. ఈ వీకెండ్ వస్తున్న సినిమాల్లో ఈ రెండు మాత్రమే చెప్పుకోదగ్గ సినిమాలు. తగ్గేదేలే, బనారస్, బొమ్మ బ్లాక్ బస్టర్, జెట్టీ, సారధి లాంటి సినిమాలు పెద్దగా చప్పుడు చేయడం లేదు.

రెండో వారంలో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, యశోద, మసూద, నచ్చింది గర్ల్ ఫ్రెండ్ సినిమాలొస్తున్నాయి. వీటిలో సమంత నటించిన యశోద సినిమా ఇప్పటికే ట్రయిలర్ తో ఆకట్టుకుంది. ప్రమోషన్ కూడా ప్రారంభించారు. అటు అల్లరి నరేష్ నటించిన మారేడుమిల్లి ప్రజానీకం సినిమా మాత్రం సౌండ్ చేయడం లేదు. జీ స్టుడియోస్ అండతో నాన్-థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అవ్వడంతో, నామ్ కే వాస్తే ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసి చేతులు దులుపుకుంటారేమో. వీటితో పాటు వస్తున్న మసూద, నచ్చింది గర్ల్ ఫ్రెండ్ సినిమాలపై ఎలాంటి అంచనాల్లేవు.

ఇక మూడో వారంలో శ్రీసింహా నటించిన భాగ్ సాలే, హెబ్బా పటేల్ చేసిన తెలిసినవాళ్లు సినిమాలు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే వీటి విడుదల తేదీలు ఇంకా ఫిక్స్ చేయలేదు. వీటితో పాటు ఇన్ సెక్యూర్, ఎర్రర్-500, మాటేమంత్రము, శశివదనే లాంటి సినిమాలు ఈ నెలలో వచ్చే అవకాశం ఉంది.

ఇలా ఎట్నుంచి ఎటు చూసినా అన్నీ చిన్న సినిమాలు, అంచనాల్లేని మూవీస్ మాత్రమే విడుదలవుతున్నాయి. ఓవరాల్ గా నవంబర్ మొత్తమ్మీద సమంత నటించిన యశోద సినిమానే అంతోఇంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. సక్సెస్ అయితే అల్లు శిరీష్ సినిమా కూడా మెరుస్తుంది.