సినీ పరిశ్రమలో కమ్మవారిది కాదు కాపులదే ఆధిపత్యం

“తెలుగు సినిమా రంగంలో కమ్మవారిదే పైచేయి”. ఈ అభిప్రాయం ఎన్నో దశాబ్దాలుగా నడిచింది. కారణం అప్పట్లో పెద్ద హీరోలంతా కమ్మవారే- ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, కృష్ణ, శోభన్ బాబు…ఇంకా ఎందరో. వీరిలో…

“తెలుగు సినిమా రంగంలో కమ్మవారిదే పైచేయి”. ఈ అభిప్రాయం ఎన్నో దశాబ్దాలుగా నడిచింది. కారణం అప్పట్లో పెద్ద హీరోలంతా కమ్మవారే- ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, కృష్ణ, శోభన్ బాబు…ఇంకా ఎందరో. వీరిలో స్టూడియోల అధినేతల కూడా ఉన్నారు. అన్నపూర్ణ, రామానాయుడు, రామకృష్ణ, పద్మాలయ స్టూడియోలు వీరివే. దశాబ్దాల నాటి సారధి స్టూడియో, తర్వాత రామోజీరావు కట్టిన ఫిల్మ్ సిటీ గురించి చెప్పక్కర్లేదు. వీరు కాక నిర్మాతల్లో అగ్రభాగం కమ్మవారే. అగ్రశ్రేణి దర్శకుల్లో కూడా ఈ కులం ప్రాబల్యం గణనీయమైనది.

1940 ల వరకు కళాత్మక వ్యాపారంగా ఉన్న సినిమాని వ్యాపారాత్మక కళగా మార్చింది ఈ సమాజికవర్గమే. తద్వారా ఇదొక పెద్ద పరిశ్రమగా మారింది. ఎందరికో ఉపాధి కల్పించింది. ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. దేశంలో హిందీ తర్వాత తెలుగు సినిమాలే ఎక్కువ సంఖ్యలో రావడానికి కారణం ఈ రంగాన్ని బలమైన వ్యాపారంగా మలచడమే కారణం. ప్రతిభకి, కులానికి సంబంధం లేదని పైకి చెప్పుకున్నా కమ్మ సామాజిక వర్గంలోని నిర్మాతల, హీరోల, స్టూడియో అధినేతల సమిష్టి కృషి వల్లనే తెలుగు సినీ రంగం హిందీరంగానికి పోటీ ఇవ్వగలిగే స్థాయిలో సినీవ్యాపరం చేస్తూ వస్తోంది.

తొలి తరంలో హెచ్.ఎం.రెడ్డి, కే.వి.రెడ్డి, బీ.ఎన్. రెడ్డి, నాగిరెడ్డి వంటి దిగ్గజాల పేర్లు వినపడినా తర్వత కాలంలో కమ్మవారి ప్రాబల్యం బాగా పెరిగింది. ఎందరో రెడ్డికులానికి చెందిన డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలైతే వచ్చారు కానీ హీరోలుగా, స్టూడియో ఓనర్స్ గా మాత్రం నిలబడలేకపోయారు. కొన్నాళ్లు ఎస్వీ కృష్ణా రెడ్డి తన మార్కు సినిమాలు తీసి అగ్రశ్రేణిలో నిలబడ్డారు. ప్రస్తుతం హీరోల్లో నితిన్, కార్తికేయ, నిర్మాతల్లో దిల్ రాజు ఈ సామాజిక వర్గానికి చెంది హవా కొనసాగిస్తున్నారు. ఇక క్షత్రియ కులానికి చెందిన సినీ హీరోల్లో ఒకప్పటి హరనాథ్, కృష్ణం రాజు, రవితేజ..ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ గుర్తుకొస్తారు. కనుక ఈ రెండు కులాల వారిది రాసి తక్కువైనా వాసి పెద్దది.

ఇదిలా ఉంటే సినీ సంగీత సాహిత్య రంగంలో అన్ని కులాలవారు ఉన్నా అధిక సంఖ్యలో మాత్రం బ్రాహ్మణులే ఉంటున్నారు. ఘంటసాల, సుశీల, జానకి, ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ, పీ.బి. శ్రీనివాస్, శ్రీకృష్ణ విష్ణుభొట్ల, సిద్ శ్రీరాం, హేమచంద్ర, శ్రీరామచంద్ర, రేవంత్, సునీత ఉపద్రష్ట, గీతా మాధురి ఇలా లెక్కపెట్టలేనంత మంది గాయక గాయనీమణులు ఈ సమాజిక వర్గం వారే. సంగీత దర్శకులుగా అప్పట్లో సాలూరి రాజేశ్వర రావు, పెండ్యాల, కె.వి.మహదేవన్ హవా నడిచినా క్రమంగా ఇళయరాజా ప్రవేశించినప్పటి నుంచీ సంగీత దర్శకత్వంలో బ్రాహ్మణుల పై చేయి తగ్గింది. కీరవాణి, రమేష్ నాయుడు, చక్రవర్తి వంటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన సంగీత దర్శకులు కూడా తమ సత్తా చాటుకున్నారు. అప్పటికీ బ్రాహ్మణ కులానికి చెందిన కోటి ఇళయరాజాకి సమాంతరంగా,  ఇతర సంగీత దర్శకులకి గట్టి పోటీనిస్తూ తెలుగు సినిమా వరకు తన జెండా చాలానాళ్లు ఎగరేశారు. ప్రస్తుతం అగ్రశ్రేణి సంగీత దర్శకుల్లో తమన్ ఈ సమాజిక వర్గం నుంచి నిలబడ్డారు. ఇక గీత రచయితల్లో నాడు, నేడు కూడా సింహ భాగం బ్రాహ్మణులే. కొందరు బ్రహ్మణేతురలైన గీతరచయితలు కూడా తమ హవాని కొనసాగిస్తున్నారు.
దర్శకుల్లో కూడా బ్రాహ్మణ వర్గం చరిత్రలో నిలబడే సినిమాలు తీసారు. ఆదుర్తి సుబ్బారవు, కె, విశ్వనాథ్, సింగీతం శ్రీనివాస రావు, జంధ్యాల, త్రివిక్రం శ్రీనివాస్  ఇలా అగ్రశ్రేణికి చెందిన వారు ఉన్నారు.

అది పక్కన పెడితే ప్రస్తుతం సినీరంగంలో పైచేయి మాత్రం కాపు సామాజిక వర్గానిదే. తిరుగులేని స్టార్ గా చిరంజీవి ఎదుగుదల, ఆయన ఇద్దరు సోదరులూ నటులు కావడం..వారిలో పవన్ కళ్యాణ్ మరొక పెద్ద స్టార్ కావడం…దీనికి తోడు రాం చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్ లతో పాటు త్వరలో పవన్ కళ్యాన్ తనయుడు అకీరా నందన్ కూడా తెరంగేట్రానికి సిద్ధమౌతున్నాడు. ఇంతమంది సినీ హీరోలున్న కుటుంబం దేశం మొత్తం మీద ఒక్క మెగా కుటుంబమే. వీరందరికీ కంచుకోట అల్లు అరవింద్. ఇప్పటికే సినీ రంగంలో ఒక బలమైన అభిప్రాయం నెలకొని ఉంది. మెగా క్యాంప్ ఆశీర్వాదం ఉంటే చాలు..24 క్రాఫ్ట్స్ లో ఏ క్రాఫ్టులోనైనా ఎదగడానికి అని. దాసరి నిష్క్రమణం తర్వాత చిరంజీవికే ఆ స్థానాన్ని భర్తీ చేయగల సీనియారిటీ, హుందా తనం, వరసుల బలం ఉందన్నది నిర్వివాదాంశం.

ఎలా చూసుకున్నా సినీరంగం మీద పట్టు కమ్మ కులం నుంచి కాపు కులానికి మారిందిప్పుడు.

అయితే కేవలం కులం ప్రాతిపదికిన మాత్రమే సినీరంగం నడవదు. ఇక్కడ ప్రతిభదే పైచేయి. అది నిజమే అనిపిస్తుంది. లేకపోతే పైన చెప్పుకున్న కులాలకి చెందని ఎందరో ఈ రంగంలో రాణిస్తున్నవారున్నారు.

కానీ కొన్ని కులాలవారు అధికసంఖ్యలో ఈ రంగంలో పాగా వేసుకుని ఉన్నారు. దానికి కారణం తరతరాలుగా వారి జన్యువుల్లో ప్రవహిస్తున్న ప్రతిభాపాటవాలు, ఆసక్తులు ఒక కారణం. కృషి, పట్టుదల, సాధన, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మరొక కారణం.

ఒక వ్యాపారి తన తర్వాత తన వ్యాపారాన్ని చూసుకోవాలని కోరుకున్నట్టుగా, ఒక లాయర్ తన కొడుకుకి ఏ మాత్రం ఆసక్తి ఉన్నా తన వారసుడిగా తీర్చిదిద్దాలని అనుకున్నట్టుగా, దాదాపు అందరు సినీ స్టార్స్ తమ పిల్లల్ని స్టార్స్ గానే చూడాలనుకోవడం సహజం. వ్యక్తిగత కృషి, క్రమశిక్షణ, ప్రతిభ వల్ల నిలబడే వాళ్లు నిలబడతారు, కాని వాళ్లు తెరమరుగవుతారు.

గ్రేట్ ఆంధ్ర బ్యూరో