Advertisement

Advertisement


Home > Movies - Movie News

టాలీవుడ్ కు ఫండింగ్ సమస్య

టాలీవుడ్ కు ఫండింగ్ సమస్య

అసలే అనేక సమస్యలతో సతమత అవుతున్న టాలీవుడ్ కు మరో సమస్య ఎదురవుతోంది. సినిమా పరిశ్రమ పుట్టిన దగ్గర నుంచి ఇఫ్పటి వరకు నూటికి తొంభై తొమ్మిది సినిమాలు ఫైనాన్స్ మీదే తయారవుతాయి. ఇప్పడు టాలీవుడ్ కు ఇదే సమస్య కాబోతోంది. 

ఇన్నాళ్లూ ఫైనాన్స్ అంటే నిర్మాతలకు పెద్దగా సమస్య కాదు. బడా ఫైనాన్సియర్ల దగ్గర నుంచి చిన్నచిన్న వారి వరకు సినిమా నిర్మాణాలకు అప్పులు ఇవ్వడానికి రెడీగా వుండేవారు. అలాగే కొందరు మీడియా అధినేతలు కూడా ఇంతో అంతో వడ్డీకి ఇవ్వడం అన్నది కామన్.

అలాగే నల్లధనం కాస్త పేరుకున్న రాజకీయ నాయకులు, బడా కాంట్రాక్టర్లు కూడా ఫండింగ్ కు ముందుకు వచ్చేవారు. టాలీవుడ్ లో సత్యరంగయ్య, వెంకట్రామిరెడ్డి అనే ఇధ్దరు బడా ఫైనాన్సియర్లు వున్నారు. వంద కోట్లు అయినా రెడీ. అలాగే ఇంకా మరి కొందరు వున్నారు కానీ అయిదు, పది కోట్ల నుంచి మహా అయితే పదిహేను కోట్ల వరకు రెడీ.

ఇప్పుడు ఆకస్మిక పరిణామం ఏమిటంటే, సత్యరంగయ్య, సినిమా ఫైనాన్స్ వ్యాపారాన్ని నిలిపివేసారు. సినిమాల పరిస్థితి బాగా లేకపోవడం, రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి బాగుండడంతో నిధులు అన్నీ అటు మళ్లించారు. మరీ తప్పదంటే బాగా పేరున్న, నమ్మకం వున్న ఒకరిద్దరు నిర్మాతలకు అదీ తప్పని సరైతే ఇస్తాము తప్ప, ఇక రెగ్యులర్ సినిమా ఫైనాన్స్ నిలిపివేసామని ఈ ఇద్దరు బడా ఫైనాన్సియర్లు చెప్పేసినట్లు తెలుస్తోంది.

పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు/నిర్మాతలు అయిన దిల్ రాజు, చినబాబు, మైత్రీ నవీన్, డివివి దానయ్య ఇలా అందరికీ ఈ రెండు సంస్థలే ఫండింగ్ చేస్తాయి. ఇప్పుడు వారంతా వేరే మార్గాలు వెదుక్కోవాల్సి వుంటుంది.

ఇదిలా వుంటే రాజకీయాలు, మైనింగ్, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వచ్చే ఫండింగ్ కూడా సినిమాలకు రావడం లేదు. ఎందుకంటే ఒక ఏడాదిలో అయినా ఎన్నికలు వస్తాయి. లిక్విడ్ క్యాష్ రెడీగా వుంచడం అవసరం. ఇప్పుడు సినిమా వాళ్ల దగ్గర బ్లాక్ అయితే ఇక అంతే సంగతులు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ మైనింగ్ చేసే రాజకీయనాయకుడి డబ్బులు ఇలాగే ఓ నిర్మాత దగ్గర బ్లాక్ అయిపోయాయని తెలుస్తోంది. అలాగే ఆంధ్రకు చెందిన ఓ రాజకీయ నాయకుడి డబ్బులు కూడా ఒకరి దగ్గర బ్లాక్ అయిపోయాయని బోగట్టా.

టాలీవుడ్ కు చెందిన ఓ బడా నిర్మాణ సంస్థ ఇప్పుడు ఫండింగ్ కోసం దిక్కులు చూస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సంస్థ ఓ పెద్ద సినిమాను మొదలుపెట్టాల్సి వుంది. కానీ అంత ఫైనాన్స్ కావాలంటే ఇప్పుడు చాలా కష్టం. అందుకే కిందా మీదా పడుతున్నారు.

మొత్తం మీద టాలీవుడ్ కు ఈ ఫండింగ్ సమస్య కూడా కొత్తగా వచ్చి పడింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?