ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు కోసం 1200 మందికి పైగా నామినేషన్లు వేస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంతమంది అభ్యర్థులను బ్యాలెట్ లో చూపించాలంటే.. ఎన్ని ఈవీఎం మెషిన్ల అవసరం పడుతుంది? అసలు ఈవీఎంల ద్వారా సాధ్యమేనా? బ్యాలెట్ పేపర్ ముద్రించినా కూడా.. అది ఓ పుస్తకం లాగా వస్తుందే తప్ప.. బ్యాలెట్ పేపర్ లాగా ఉంటుందా? అభ్యర్థులు తమ గుర్తు చెప్పుకోవడం మాత్రమే కాకుండా, తమ గుర్తు బ్యాలెట్ పుస్తకంలోని ఫలానా పేజీలో ఉంటుందని కూడా ప్రచారంలో చెప్పుకోవాలా? ఇవన్నీ చాలా పెద్ద ప్రశ్నలు! అసలు ఈ రేంజిలో నామినేషన్లు దాఖలైతే ఏ ఎన్నికైనా జరుగుతుందా? లేదా? అనేది కూడా డౌటే!
ఇప్పుడు తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ఉప ఎన్నిక జరిగితే గనుక.. అందులో 1200కు పైగా నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విషయం ఏంటంటే.. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు వలన నిర్వాసితులు అయిన తమకు ప్రభుత్వం ఇంకా పూర్తిస్థాయి పరిహారం చెల్లించనందున.. వాళ్లంతా కుటుంబానికి ఒక నామినేషన్ ఎమ్మెల్యే ఎన్నికలో వేయాలని నిర్ణయించుకున్నారు.
డిండి ఎత్తిపోతల పథకంలో అయిదు రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. వీటిలో కిష్టరాయినిపల్లి, చర్లగూడెం రిజర్వాయర్ల పరిధిలోని తమకు పరిహారం పూర్తిగా చెల్లించలేదని వారు ఆందోళన చేస్తున్నా పట్టించుకున్న వారు లేరు. ఈ నేపథ్యంలో కుటుంబానికి ఒకరు వంతున నామినేషన్లు వేయాలని వారు నిర్ణయించుకున్నారు. అదే జరిగితే పెద్ద చరిత్ర అవుతుంది.
ఈ దేశంలోనే ఇప్పటిదాకా నామినేషన్లలో రికార్డు సృష్టించిన ఘనత, చైతన్యం నల్గొండ జిల్లాకే ఉంది. ఫ్లోరోసిస్ సమస్యను పట్టించుకోని ప్రభుత్వాల తీరుకు నిరసనగా 1996 పార్లమెంటు ఎన్నికల్లో 485 మంది నామినేషన్లు వేశారు. యావత్ దేశం.. నల్గొండ ఎన్నికవైపు ఆసక్తిగా చూసింది. బ్యాలెట్ గా కావలిస్తే పుస్తకం ప్రింట్ చేయవచ్చు గానీ.. అంతమంది అభ్యర్థులకు కేటాయించడానికి ఎన్నికల సంఘం వద్ద ఆనాటికి గుర్తులు లేవు. దాంతో ఆ ఎన్నికను రద్దు చేసి తర్వాత నిర్వహించారు.
ఇప్పుడు మునుగోడుకు ఉప ఎన్నిక వస్తే అదే పరిస్థితి రిపీట్ అవుతుంది. 1200 మందికి పైగా నామినేషన్లు వేస్తే.. వారికి కేటాయించడానికి ఎన్నికల సంఘం వద్ద గుర్తులు కూడా ఉండవు. దాన్ని రద్దు చేసి మళ్లీ నిర్వహించాల్సిందే!