వైసీపీ కార్యకర్తలతో గురువారం నుంచి ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ కానున్నారు. కార్యకర్తలు ఏం చెబుతారో అనే ఆందోళన నేతల్లో కనిపిస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తమకెలాంటి ప్రయోజనం లేదనే ఆవేదన, ఆగ్రహం వైసీపీ కార్యకర్తల్లో బలంగా ఉంది. పార్టీ పెద్దలు, ప్రభుత్వంపై వైసీపీ కార్యకర్తల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందనే ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది.
ఇప్పటికే మూడేళ్ల పరిపాలనా కాలం పూర్తి కావడం, ఇక రెండేళ్లు మాత్రమే గడువు ఉన్న పరిస్థితుల్లో… ఇప్పటికైనా ఏమైనా చేస్తారా? లేదా? అనే అనుమానం, ఆశ వైసీపీ కార్యకర్తల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి కార్యకర్తలతో జగన్ సమావేశం కావాలని నిర్ణయించుకోవడం కీలక పరిణామంగా చెప్పొచ్చు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమావేశం జరగనుంది. మొదటగా కుప్పం నియోజకవర్గానికి చెందిన 60 మంది కార్యకర్తలతో జగన్ భేటీ కానున్నారు.
మూడేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పేదలకు అందిస్తున్న లబ్ధి తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రజాభి ప్రాయం ఎలా ఉంది? రానున్న ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఏం చేయాలనే అంశాలపై జగన్ అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఈ సమావేశానికి సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇన్‌చార్జ్ కూడా హాజరవుతారా? లేదా? అనేది తెలియాల్సి వుంది.
ప్రజాప్రతినిధుల ఎదుట కార్యకర్తలు నిజాలు చెప్పడానికి భయపడతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా సమావేశానికి ఎవరు వెళ్లాలో ఎంపిక చేసి, సీఎం ఎదుట ఏం మాట్లాడాలో కూడా చెప్పి పంపుతున్నారనే చర్చ జరుగుతోంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై ప్రజాభిప్రాయాల్ని నిర్భయంగా జగన్ ఎదుట చెబితేనే వైసీపీకి మంచి జరుగుతుంది. లోటుపాట్లను సరిదిద్దుకునే అవకాశం వుంటుంది.
అలా కాకుండా బటన్ నొక్కుడు కార్యక్రమంలో లబ్ధిదారులతో మాట్లాడించినట్టుగా, కార్యకర్తల సమావేశంలో “జగనన్నా నువ్వు తోపు, తురుం ఖాన్” అంటే మాత్రం ఆయన్ని మోసగించినట్టే. కార్యకర్తలతో సమావేశ ఉద్దేశమే దెబ్బతింటుంది.
జగన్‌కు నిజంగా వాస్తవాలు తెలియాలంటే కార్యకర్తలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. గత మూడేళ్లుగా పొగడ్తల జడివానలో తడిసి ముద్దవు తున్న జగన్‌కు నెగెటివ్ అంశాలు కాస్త ఇబ్బంది కలిగించొచ్చు. కానీ వాటినే వినాలి. ఆ తర్వాత తప్పొప్పలపై అధ్యయనం జరగాలి. ఈ సమావేశం జరిగే తీరే, మిగిలిన నియోజకవర్గాల కార్యకర్తలపై తప్పక పడుతుంది. అందుకే కుప్పం వైసీపీ కార్యకర్తల సమావేశం అత్యంత కీలకమైందని భావించొచ్చు.