ఒకే ఒక్క ఫొటో… టీడీపీతో పాటు ఆంధ్రప్రదేశ్ పరువు పోగొట్టింది. వీళ్లా మన నాయకులు అని సిగ్గుపడేలా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎంపీలు వ్యవహరించారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా ఎదుట నలుగురు టీడీపీ ఎంపీలు నిలిచిన విధానం తలదించుకునేలా ఉంది.
రాజకీయంగా వైసీపీ, టీడీపీ విధానాలు… వారివారి పార్టీ లేదా వ్యక్తిగత అవసరాలని సరిపెట్టుకోవచ్చు. కానీ ఢిల్లీలో ఏపీ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాల్సిన ప్రజాప్రతినిధులు, అందుకు విరుద్ధంగా తలదించుకునేలా కేంద్రానికి సాగిలపడుతున్నారనేందుకు గురువారం ఈనాడు పత్రికలో ప్రచురితమైన ఫొటోనే నిలువెత్తు నిదర్శనం.
ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌ఖడ్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వైసీపీ తమ మద్దతును ఎన్‌డీఏ అభ్యర్థికి ప్రకటించింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కాస్త ఆలస్యంగా బుధవారం మద్దతు తెలిపింది. ఏపీలో అన్ని పార్టీలు బీజేపీకే జై కొడుతున్నాయనే విమర్శ ఉన్నా, అధికారప్రతిపక్ష పార్టీలు పట్టించుకోవడం లేదు.
ఇదిలా వుండగా జగదీప్ ధన్‌ఖడ్‌ను కలిసి మద్దతు ప్రకటించిన అనంతరం టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్ నేరుగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా వద్దకు వెళ్లారు.
అమిత్‌షా కూచుని నమస్కరిస్తుంటే, ఆయన ఎదుట టీడీపీ నలుగురు ఎంపీలు నిలబడి తలొంచుకుని, చేతులు కట్టుకుని వుండడం ఏపీ ప్రజానీకం మనసుల్ని చివుక్కుమనిపించింది.
కనీసం తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలిపారన్న గౌరవం కూడా లేకుండా నలుగురు పార్లమెంట్ సభ్యుల్ని నిలబెట్టి, తాను కూచుని అమిత్‌షా వ్యవహరించిన తీరు ఏపీలో చర్చనీయాంశమైంది. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఆవిర్భవించిన టీడీపీకి చంద్రబాబు నేతృత్వంలో ఎంతటి దుస్థితి ఏర్పడిందో అనే ఆవేదన పౌరసమాజం నుంచి వ్యక్తమవుతోంది.
బహుశా ఈ ఫొటో చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణుల్ని కూడా మనస్తాపానికి గురి చేసి వుంటుంది. ఒకవైపు బీజేపీ అవమానిస్తున్నా, వెన్ను వంచి సాగిలపడేంతగా మన ఎంపీలు తప్పు చేశారా? అనే చర్చ జరుగుతోంది.
టీడీపీ ఎంపీలు వ్యక్తిగతంగా తమ పరువు ప్రతిష్టలను ఏం చేసుకున్నా అభ్యంతరం లేదని, కానీ ఏపీ సమాజాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద తాకట్టు పెట్టడం ఏంటనే నిలదీతలు ఎదురవుతున్నాయి.