టాలీవుడ్ లో రేపు ఓ మెగా మీటింగ్ జరగబోతోంది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, సినిమా జనాలు చాలా మంది హాజరయ్యే ఈ సమావేశాన్ని మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రలో టాలీవుడ్ సమస్యల పరిష్కారం దిశగా మెగాస్టార్ అందరినీ ఓ తాటిపైకి తీసుకువచ్చి, ముందుకు వెళ్తున్నసంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇప్పటికే రెండుసార్లు ఆంధ్ర సిఎమ్ జగన్ ను కలిసి వచ్చారు. తనతో పాటు పలువురు టాప్ హీరోలను కూడా తీసుకుని వెళ్లారు. మరోపక్కన ప్రభుత్వం నియమించిన కమిటీ తన నివేదికను పూర్తి చేసి అందించే పనిని దాదాపుగా పూర్తి చేసింది.
మరో రెండు మూడు వారాల్లో ఆంధ్రలో కొత్త రేట్లు, నిబంధనలు వస్తాయని అందరూ భావిస్తున్నారు. బహుశా ఈ మొత్తం వ్యవహారాన్ని ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు వివరిస్తారేమో అని టాలీవుడ్ వర్గాల బోగట్టా.
కానీ అది అసలు విషయం కాదని, తెలంగాణలో ఇటీవల రేట్లు భారీగా పెరిగాయి. ఆ రేట్లు అమ్ముతుంటే సినిమాలకు రన్నింగ్ పడిపోతోంది. ఎనిమిది కోట్లు కలెక్ట్ చేస్తాయి అనుకున్న రేంజ్ సినిమాలు అయిదు కోట్ల దగ్గర ఆగిపోతున్నాయి. అందువల్ల ప్రభుత్వం రేట్ల విషయం ఫ్లెక్సిబులిటీ ఇచ్చింది కనుక, తగ్గించి అమ్మాలని సింగిల్ స్క్రీన్ ల యజమానులను మెగాస్టార్ చిరంజీవి కోరబోతున్నారని తెలుస్తోంది.
కానీ ఈ విషయంలో సింగిల్ స్క్రీన్ యజమానులు విముఖతతో వున్నారని తెలుస్తోంది. భీమ్లానాయక్ ముందు ఇలా కోరినట్లయితే కచ్చితంగా అది రాంగ్ సిగ్నల్స్ ఇస్తుంది కూడా. ఏం జరుగుతుందో రేపు తెలుస్తుంది.