ఆంధ్రలో జిల్లాల విభజన ప్రతిపాదన ముందుకు వచ్చింది. జగన్ అనేక ప్రతిపాదనల లాగానే యిదీ కోర్టులోనే పెండింగులో వుండిపోతుందేమో తెలియదు కానీ ఉగాదికి చేస్తామని, యీ లోగా సలహాలు చెప్పమనీ అడుగుతున్నారు. సహజంగానే కొన్ని వివాదాలు ముందుకు వచ్చాయి. అయినా మొత్తం మీద ఫర్వాలేదన్నట్లుంది. మౌలికంగా విభజన ఆలోచనైతే మంచిదే. విభజన వలన ఖర్చులు పెరుగుతాయన్నమాట వాస్తవమే కానీ ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలలో కొన్ని మరీ పెద్దగా వున్నాయి. తెలంగాణలో అయితే 10 ఉంటే వాటిని మూడు రెట్లకు పైగా 33 చేశారు. ఆంధ్రలో 13 నుంచి 26 అంటే, రెండు రెట్లు మాత్రమే చేశారు. అందుకు సంతోషించాలి. జనాభా సగటు చూస్తే 15 జిల్లాల జనాభా 17-20 లక్షల మధ్యన వుంది. 8 జిల్లాల జనాభా 20-23 మధ్య వుంది. ఒకటి (బాపట్ల) 16 ఉంది. రెండు జిల్లాలలో మాత్రం 10కి లోపే. మన్యం (9.72), అల్లూరి (9.54) ఉంది. అల్లూరి విస్తీర్ణం 12 వేల చకిమీ. మన్యంది 4 వేల చకిమీ.
తూగో వంటి పేద్ద జిల్లాను పెట్టుకుని సబ్ కలక్టరు, జాయింటు కలక్టరు అంటూ పాలించడం కంటె యిదే మెరుగు. వాళ్ల ఆఫీసులనే యిప్పుడు కలక్టరాఫీసులుగా మార్చేయవచ్చు. వికేంద్రీకరణ ఎప్పుడూ మంచిదే. పార్లమెంటు స్థానాలు ఎన్ని వుంటాయో, అన్ని జిల్లాలు చేస్తామని చెప్పారు. 25 స్థానాలుంటే జిల్లాలు 26 అయ్యాయి. కొత్త జిల్లాలు పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికన ఏర్పాటు చేస్తాం అని చెప్తూ వచ్చారు. కానీ అన్ని సందర్భాల్లోనూ అలా కాలేదు. ఆ కాన్సెప్టుతో మొదలుపెట్టి కొన్ని సర్దుబాట్లు చేసి వుంటారు. వాటిల్లో అవతలివాళ్లకు కొన్ని లోపాలు కనబడతాయి. ‘పార్లమెంటు స్థానం ఏ ఊరి పేరుతో వుందో, ఆ ఊరిలోనే జిల్లా ముఖ్యపట్టణం పెడతామని అన్నారు, యిప్పుడు మాట తప్పారు’ అని రాజంపేట, హిందుపురం వాళ్లు వాదిస్తున్నారు. అలా అన్నారని నాకు తెలియదు కానీ చాలా జిల్లాలలో అది పాటించారు. పాటించని నియోజకవర్గాలు చూస్తే నరసాపురం నియోజకవర్గం ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాకు భీమవరం కేంద్రంగా చేశారు. హిందుపురం ఉన్న శ్రీ సత్యసాయి జిల్లాకు పుట్టపర్తిని కేంద్రం చేశారు. అరకు ఉన్న అల్లూరి జిల్లాకు పాడేరును కేంద్రం చేశారు. రాజంపేట ఉన్న అన్నమయ్య జిల్లాకు రాయచోటిని కేంద్రం చేశారు. కొత్తగా ఏర్పడిన మన్యం జిల్లాకు పార్వతీపురాన్ని కేంద్రం చేశారు.
4 జిల్లాలలో యీ సూత్రం పాటించకపోవడానికి రాజకీయ కారణాలతో పాటు పాలనాసౌలభ్యం కూడా వుందేమో నాకు తెలియదు. ప్రజలు అడిగినప్పుడు ఎవరైనా ప్రభుత్వ ప్రతినిథి ఇదీ కారణం అని చెప్పాలి. ఎందుకంటే జిల్లా కేంద్రంగా ఏర్పడితే రియల్ ఎస్టేటు బిజినెస్ బాగా అవుతుందనే ఆలోచనతో స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి చేసి వుంటాడనే అనుమానాలు వ్యక్తం చేశారు కొందరు. జిల్లా కేంద్రం అయినంత మాత్రాన భూమి విలువ పెరిగిపోతుందా? ప్రస్తుతం కృష్ణా జిల్లాకు కేంద్రం మచిలీపట్నం, భూమి విలువ అక్కడ ఎక్కువో, విజయవాడలో ఎక్కువో అందరికీ తెలుసు. కొత్తగా ఏర్పరచిన జిల్లా ముఖ్యపట్టణం జిల్లా మధ్యలో లేదు అని కొందరి వాదన. రాష్ట్ర రాజధాని విషయంలోనే అది అక్కరలేదని వాదించేవాళ్లలో నేనొకణ్ని. అన్నీ ఆన్‌లైన్ అయిపోయిన యీ రోజుల్లో ఆఫీసుకి వెళ్లేవాళ్లు కొద్దిమందే. రహదారులు, రవాణా సౌకర్యాలు బాగా పెరిగిన యీ రోజుల్లో జిల్లా పరిధిలో దూరాలు ఓ లెక్కా?
ఏ ఊళ్లో పెట్టినా విమర్శలు వస్తూనే వుంటాయి. ‘ఇక్కడెందుకు? అక్కడ పెట్టవచ్చుగా? అసలు యీ విభజన యిప్పుడే ఎందుకు చేశారు? ఆగవచ్చుగా? అనేక సమస్యలున్నపుడు దీనికి తొందరేముంది? చేసేదుంటే పరిపాలనలోకి రాగానే చేసి వుండాల్సింది. అప్పుడెందుకు చేయలేదు? ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల నుండి దృష్టి మళ్లించడానికి చేశారు..’ ఎట్సెట్రా విసుర్లు ఎప్పుడు చేసినా యిలాటివి తప్పవు. ఏది ఏమైనా నెల్లాళ్లు గడువిచ్చారుగా, అభ్యంతరాలుంటే తెలుపుకోవచ్చు. వింటే వింటారు, లేకపోతే లేదు. ఈ ప్రభుత్వాలన్నీ యిదే వరస! తాము చేద్దామనుకున్నవి చేస్తారు. తమ పార్టీ నాయకులు అభ్యంతరాలు చెప్తే సవరణలు చేస్తారు. మామూలు ప్రజల సలహాలు వింటారన్న నమ్మకాలు లేవు. ఓ ఊరు తీసి, మరో జిల్లాలో కలిపినా పాలనాపరంగా అంత తేడా రాదు. పన్నుల పరంగానూ ప్రజలకూ తేడా రాదు. నీటి తగాదాలు వచ్చేస్తాయంటున్నారు. అలా అయితే జిల్లాల మధ్యే కాదు, ఊళ్ల మధ్యా, వ్యక్తుల పొలాల మధ్యా వస్తాయి. రాష్ట్రాల వారీ నీటి కేటాయింపులు వుంటాయి తప్ప, జిల్లా వారీ కేటాయింపులు ఉండవుగా! జిల్లాల వారీ ఉద్యోగ నియామకాలు జరిగినప్పుడే వస్తుంది తంటా. లోకల్ కాదంటారు. జిల్లాల విభజన తర్వాత తెలంగాణలో టీచర్ల బదిలీలు పెద్ద సమస్యయి కూర్చుంది కదా!
ఇక జిల్లాల పేర్ల గురించి చెప్పుకోవాలంటే, అన్నమయ్య, సత్యసాయి, బాలాజీ, అల్లూరి, ఎన్టీయార్ పేర్లు పెట్టడం హర్షణీయం. సత్యసాయి చుట్టూ వివాదాలున్నా భక్తులిచ్చిన విరాళాలతో ఆయన ఆ ప్రాంతానికి మంచినీటి సౌకర్యం కల్పించాడు. విద్య, వైద్య వసతులు కల్పించాడు. తిరుపతి కేంద్రంగా ఉన్న జిల్లాకు బాలాజీ అని పెట్టకుండా వెంకటేశ్వరస్వామి అని పెట్టాలని కొందరి వాదన. బాలాజీ అనే పేరే ఆయనకు లేదని కొందరి వాదన వింటే నవ్వు వచ్చింది. పేర్లు ఎంత సింపుల్‌గా వుంటే అంత మంచిది. బిరుదుతో సహా పెద్ద పేర్లు పెట్టేస్తే చివరకు అవి పొడి అక్షరాల్లో మిగులుతాయి. ప్రకాశం జిల్లా అని పెట్టారు తప్ప ‘ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు’ జిల్లా అని పెట్టి వుంటే దాన్ని ఎటిపిపి జిల్లా అనేసేవారు. ప్రకాశం గారి పేరు మరుగున పడిపోయేది.
నెల్లూరు జిల్లాకు అమరజీవి పొట్టి శ్రీరాములు జిల్లా అని పేరు పెట్టేటప్పుడు జస్ట్ శ్రీరాములు జిల్లా అంటే పోయేది. ఇప్పుడు కూడా శ్రీ పొట్టి శ్రీరాములు (‘‘సాక్షి’’ వాళ్లు దీన్ని కూడా విడగొట్టి శ్రీ రాములు అనుకుని, ఎస్‌పిఎస్‌ఆర్ నెల్లూరు అని రాశారు, ఆంధ్రజ్యోతి వాళ్లు ఎస్‌పిఎస్ జిల్లా అని రాశారు) అనక్కరలేదు. సత్యసాయి పేరు ముందు, బాలాజీ పేరు ముందు కూడా శ్రీ పెట్టనక్కరలేదు. సాక్షిలో శ్రీ సత్యసాయి అని, బాలాజీ అని రాశారు. జ్యోతివాళ్లు శ్రీ సత్యసాయి, శ్రీ బాలాజీ అని రాశారు. ఎన్టీయార్‌కు మాత్రం యిద్దరూ శ్రీ పెట్టలేదు. ఒక స్థాయికి చేరినవాళ్లకు శ్రీలు అక్కరలేదు. దేవుళ్లకు అసలే అక్కరలేదు. శ్రీ ఈశ్వరుడు, శ్రీ విష్ణువు, శ్రీ బ్రహ్మ అంటామా? వెంకటేశ్వరస్వామి అంటే చాలదూ, శ్రీ చేర్చాలా? చెప్పవచ్చేదేమిటంటే పేరెంత చిన్నగా పెడితే అంత బాగా ఆ పేరు ప్రజల నోళ్లల్లో నానుతుంది. ఎన్టీయార్, వైయస్సార్ అనే పొడి అక్షరాలు ప్రాచుర్యంలో వున్నాయి కాబట్టి వాటిని అలాగే పెట్టవచ్చు. అల్లూరి సీతారామరాజు అనే బదులు అల్లూరి అంటే చాలు. లేకపోతే ఎఎస్‌ఆర్ జిల్లాగా వాడకంలోకి వచ్చేస్తుంది.
ఇంకో పాయింటేమిటంటే పేరు పెద్దదైన కొద్దీ పత్రికలు పూర్తి పేరు వాడకుండా సగం పేరే వాడడం మొదలెడతాయి. వైయస్ మరణం తర్వాత ముఖ్యమంత్రి అయిన రోశయ్య కడప జిల్లాకు ‘వైయస్ రాజశేఖర రెడ్డి కడప జిల్లా’ అని పేరు పెట్టారు. ఇక అప్పణ్నుంచి ‘‘సాక్షి’’ పేపరు కడప ఎగరగొట్టేసి వైయస్సార్ జిల్లా అనే రాస్తూ వచ్చింది. ‘‘ఈనాడు’’ వైయస్ రాజశేఖర రెడ్డి ఎగరగొట్టేసి, ఒట్టి కడప జిల్లా అనే రాస్తూ వచ్చింది. ఇక్కడో జోక్ గుర్తుకు వస్తోంది. ఎవరో శ్రీశ్రీని అడిగారట – ‘మీ శిష్యరత్నం ఆరుద్ర ఎలా ఉన్నాడు?’ అని. అప్పటికే శ్రీశ్రీకి, ఆరుద్రకు పడడం మానేసింది. శ్రీశ్రీ ‘శిష్యుడంటే అతను ఒప్పుకోడు, రత్నం అంటే నేను ఒప్పుకోను.’ అని జవాబిచ్చారట. ఇలా ఆ జిల్లా పేరులో సగభాగం ఒకరికి నచ్చలేదు, తక్కినభాగం యింకోరికి నచ్చలేదు. దీనికి రాజకీయ కారణాలున్నాయన్న సంగతి లోకవిదితం. రేపు ఎన్టీయార్‌కృష్ణా జిల్లాకు కూడా యీ అవస్థకు గురికావచ్చు. అందువలన ఇలాంటి జాయింటు పేర్లు అవీ మానేసి, చిన్న పేరు మాత్రమే పెడితే అందరూ చచ్చినట్లు అదే వాడతారు.
తక్కిన పేర్ల గురించి చర్చ ఏమీ రాలేదు కానీ, ఎన్టీయార్ పేరు దగ్గరే కాస్త చర్చ జరిగింది. ప్రతిపక్ష పార్టీ టిడిపి వ్యవస్థాపకుడు అనే కారణంగా వైసిపి వారు దాన్ని పక్కన పెట్టేయకపోవడం హర్షణీయం. సినిమా నటుడిగా ఆయనతో పోటీపడేవాళ్లు ఉండవచ్చు కానీ, రాజకీయంగా, సామాజికంగా పెనుమార్పు తెచ్చిన నాయకుడు ఎన్టీయార్. ఆయన అంత్యక్రియలకు హాజరైన జనసంఖ్యే కొలబద్ద. ‘ఓ పక్క అన్న కాంటీన్‌లు ఎత్తివేస్తూ జిల్లాకు ఆయన పేరు పెట్టడమేమిటి?’ అంటూ కొందరు ఎత్తి పొడిచారు. ‘స్టాలిన్ చూడండి, అమ్మ కాంటీన్ పేరు కంటిన్యూ చేస్తున్నాడు’ అని ఎత్తి చూపారు కూడా. గమనించవలసిన దేమిటంటే జయలలిత బతికి లేదు. ఉన్నపుడు కూడా జయలలితకు కరుణానిధికి ఉప్పూనిప్పూ కానీ, స్టాలిన్‌తో వైరం లేదు. ఇక్కడ బాబు-జగన్ సంగతి అలా కాదు. బాబు పనులన్నీ చరిత్రలోంచి తుడిచేయాలని జగన్ యత్నం. రేపు బాబు మళ్లీ అధికారంలోకి వస్తే జగన్ పెట్టిన పేరులన్నీ మార్చేయడం ఖాయం. నిజానికి ‘అన్న క్యాంటీన్’ అనగానే జనాలకు గుర్తుకు వచ్చేది ఎన్టీయార్ కాదు, అవి పెట్టించిన బాబు!
ఇంకో విమర్శ ఏమిటంటే, ఎన్టీయార్ పెట్టిన పార్టీ నాయకులను అరెస్టు చేస్తూ, మరో పక్క ఓ జిల్లాకు ఆయన పేరు పెట్టినంత మాత్రాన ప్రాయశ్చిత్తం ఉంటుందా? అని. రెండూ వేర్వేరు అంశాలు. ఆ మాట కొస్తే ప్రస్తుత టిడిపి పార్టీలో ఎన్టీయార్‌కే చోటు లేకుండా పోయింది. తెలుగుజాతిని ప్రభావితం చేసిన నాయకుడు కాబట్టి ఓ జిల్లాకు ఆయన పేరు పెట్టడం సమంజసం. పెట్టడంలో రాజకీయ చతురత వుందనేది నిస్సందేహం. దానివలన ఎన్టీయార్ అభిమానులు సంతోషిస్తారు తప్ప, బాబు అనుయాయులు హర్షించరనేది కూడా నిస్సందేహం. కానీ ఆ మాట పైకి చెప్పలేక ‘పేరు పెట్టడం వరకు మంచిదే అయినా విజయవాడతో సంబంధం ఏముంది? ఆయన పుట్టిన ఊరు మచిలీపట్నం జిల్లాలో వుంది కాబట్టి దానికి పెట్టాలి’ అంటూ వ్యాఖ్యలు చేశారు కొందరు. మచిలీపట్నంకు పెడితే పెట్టవచ్చు కానీ, విజయవాడతో సంబంధం లేదనడం సరి కాదు. ఎన్టీయార్ జీవితంలో విజయవాడకూ ముఖ్యమైన పాత్ర వుంది. ఈయన పేరు కలపడం వలన కృష్ణానది ఔన్నత్యం తగ్గిపోతుంది అనుకుంటే అప్పుడు మచిలీపట్నంకు మార్చవచ్చు.
కొందరు ఇంకాస్త ముందుకు వెళ్లి ఎన్టీయార్ పేరు పెట్టగానే సరి కాదు, ఆయన పుట్టిన నిమ్మకూరును జిల్లా కేంద్రంగా చేసి.. అంటూ ఎక్కడెక్కడికో వెళ్లిపోతున్నారు. ఉన్న సౌకర్యాలను వాడుకోకుండా, కొత్తవాటిని డెవలప్ చేయాలంటే ఎప్పటికయ్యేను? జూనియర్ నటించిన ‘‘ఆంధ్రావాలా’’ సినిమా నిర్మాత యింటర్వ్యూ చూశాను. ఆడియో ఫంక్షన్ నిమ్మకూరులో పెడితే 9-10 లక్షల మంది వచ్చి పడ్డారుట. ఆ ప్రాంతమంతా అష్టదిగ్బంధం అయిపోయి యూనిట్ వాళ్లంతా అష్టకష్టాలు పడ్డారట. అలాటి ఊరిని జిల్లా కేంద్రంగా మార్చగలరా? ఇప్పుడేమైనా రోడ్లు అవీ వేశారేమో, 25 అడుగుల ఎన్టీయార్ విగ్రహం, 14 ఎకరాల్లో పార్కు అవీ ప్రభుత్వం వారే పెడతారట. మంచిదే, దానితో పాటు ఎన్టీయార్ స్మారక మ్యూజియం కూడా పెడితే టూరిస్టులు వస్తారు. ఒట్టి విగ్రహం అంటే మోజుండదు. మ్యూజియం గురించి ఎన్టీయార్ సంతానానికి పట్టదు. లక్ష్మీపార్వతి దశాబ్దాలుగా ఆ మాట చెప్తూనే కాలక్షేపం చేస్తున్నారు. చెన్నయ్‌లో ఎమ్జీయార్‌కు ఉన్నట్లుగానే ఎన్టీయార్‌కు ఒకటి పెట్టడం సముచితం. ఇవన్నీ పెట్టినపుడు కృష్ణాకు బదులుగా, మచిలీపట్నం జిల్లాకే ఎన్టీయార్ పేరు పెట్టవచ్చు కదా! జిల్లా కేంద్రం మచిలీపట్నమే వుండవచ్చు.
జిల్లా పేర్ల ప్రకటన రాగానే ఎన్టీయార్ కుటుంబం రియాక్షన్ కోసం ఎదురు చూసి, వారిలో కొందరు మాత్రమే హర్షించినందుకు, తక్కినవారు మౌనంగా వున్నందుకు కొందరు వ్యాఖ్యానించారు. పురంధరేశ్వరిపై వచ్చిన అనుచిత వ్యాఖ్యలు ఖండించడానికి ఆలస్యంగానైనా ఏకమైన కుటుంబం యిలాటి ఆనందదాయకమైన విషయాన్ని ఎందుకు స్వాగతించలేదు అని అడిగారు. రోశయ్య కడప జిల్లా పేరు మార్చినపుడు వైయస్ కుటుంబం మాత్రం స్వాగతించిందా అని కొందరు అడిగారు. ముఖ్యమంత్రి పదవి అడిగితే అదివ్వకుండా కేవలం జిల్లాకు పేరు పెట్టి సంతోషించండి అంటే ఎలా? అని అప్పటి వైయస్ కుటుంబం మూడ్. ఇప్పుడు ఎన్టీయార్ కుటుంబానికి కూడా ఎలా రియాక్టవ్వాలో తెలిసి వుండదు. బాబు కాస్త తటపటాయించి గార్డెడ్ స్టేటుమెంటు యిచ్చారు. పురంధరేశ్వరి, తర్వాత రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. వాళ్ల లెక్కలు వాళ్లకు ఉండవచ్చు. సామాన్యులకు వాటితో పని లేదు.
మచిలీపట్నం జిల్లాకు ఎన్టీయార్ పేరు పెడితే కృష్ణాతో కలపనూ అక్కరలేదు. .. నిమ్మకూరు వుంటుంది కాబట్టి అని సమర్థించుకోనూ వచ్చు. కానీ ఒక చిక్కు వుంది. వెంటనే కృష్ణా జిల్లాలో విజయవాడకు చెందిన వంగవీటి రంగా పేరు పెట్టమనే డిమాండు ఊపందుకుంటుంది. ఇప్పటికే కాపుల ప్రాధాన్యత తగ్గించేశారు అని మొదలుపెట్టేశారు. ఈనాటి సమాజంలో ప్రతి చోటా కులప్రస్తావన వస్తూనే వుంది. ఏం చేసినా కులం కోణంలోంచి చూస్తారు. వైశ్యుల మనోభావాలు దెబ్బ తింటున్నాయన్న వాదనతో ‘‘చింతామణి’’ నాటకప్రదర్శనను ఆంధ్ర ప్రభుత్వం నిషేధించడాన్ని ఎద్దేవా చేస్తూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ‘రోశయ్య మరణిస్తే చూడడానికి వెళ్లని జగన్‌కు వైశ్యుల మీద ప్రేమ కారిపోతోందనుకోవాలా?’ అనే ధోరణిలో రాశారు. రోశయ్యగార్ని వైశ్యుడిగానే ఎందుకు చూడాలి? రాజకీయ ప్రత్యర్థిగా చూడవచ్చుగా! పైగా ఆయన ఒక్కడే వైశ్యుడా? ఆయనను నిరాదరించనంత మాత్రాన యావత్తు వైశ్యలోకం మీద కక్ష కట్టినట్లా?
బాబుకు కమ్మ కులాభిమానం వుందంటారు, మళ్లీ సొంత తమ్ముడికి, మావగారికి అన్యాయం చేశారంటారు. జగన్‌కు రెడ్డి కులాభిమానం ఉందంటారు, మళ్లీ సొంత చెల్లికి అన్యాయం చేశాడంటారు, బాబాయి హంతకుణ్ని వెనకేసుకుని వస్తున్నాడంటారు. ఇవి ఎలా పొసుగుతాయి? సొంత బంధువులది వేరే కులమా? ఇలా విస్తృతంగా ఆలోచించడం మానేసి ప్రతీది కులం కోణంలో చూడడం జరుగుతోంది కాబట్టి కులపరంగా కూడా సమతూకం పాటిస్తే మంచిదని నా ఉద్దేశం. బాలాజీ, అన్నమయ్య వంటి ధార్మికమైన పేర్లు పక్కన పెట్టేస్తే, ప్రకాశం బ్రాహ్మణుడు, అల్లూరి క్షత్రియుడు, శ్రీరాములు వైశ్యుడు, వైయస్సార్ రెడ్డి కోటాలోకి వచ్చే మైనారిటీ, ఎన్టీయార్ కమ్మ, సత్యసాయి బిసి. సత్యసాయి ఆధ్యాత్మిక గురువు కాబట్టి కులాల చట్రంలో బిగించకూడదు అనుకుంటే గౌడ కులస్తుడు, స్వాతంత్ర్య యోధుడు, సర్దార్ బిరుదాంకితుడు, బిసి హక్కుల పోరాట వీరుడు, గౌతు లచ్చన్న (1909-2006) పేరు శ్రీకాకుళం జిల్లాకు పెట్టవచ్చు. ఇక మిగిలిన ప్రముఖ కులాలు హరిజన, కాపు.
ఆంబేడ్కర్ పేరు ఓ జిల్లాకు పెట్టాలని కొందరంటున్నారు. ఎక్కడివాడో అయిన ఆయన పేరెందుకు? ఇప్పటికే ఊరూరా ఆయన పేర వాడలు, విగ్రహాలు ఉన్నాయి. మన కర్నూలు జిల్లాకు చెందిన దామోదరం సంజీవయ్య గారున్నారు కదా! వివాదరహితుడు. సాహితీప్రియుడు. దేశంలోనే తొలి హరిజన ముఖ్యమంత్రి. కాంగ్రెసు పార్టీలో, కేంద్రంలో కూడా ముఖ్యపదవులు అలంకరించారు. మొన్ననే శతజయంతి పూర్తయింది. ఆయన పేరు కర్నూలు జిల్లాకి పెట్టవచ్చు. ఇక కాపుల గురించి, రంగా ఎంత గొప్ప నాయకుడైనా, ప్రజలతో మమేకమైనా, రాష్ట్రమంతా ఆయన విగ్రహాలు పెడుతూ వచ్చినా, ఒక వర్గానికే చెందినవాడు. హింసా రాజకీయాలు చేశారు కాబట్టి ఆయన పేరు పెట్టడం భావ్యం కాదు. అలా అయితే అనంతపురం జిల్లాకు పరిటాల రవి పేరు పెట్టమంటారు. అన్నమయ్య జిల్లాకు మరో ఫ్యాక్షనిస్టు పేరు పెట్టమంటారు. కాపు వర్గంలో వివాదరహితుణ్ని, ప్రముఖుణ్ని ఎంచుకోవాలి.
నాకు తోచినది కాకినాడ జిల్లాకు ఆ పేరు బదులుగా రఘుపతి వెంకటరత్నం నాయుడు (1882-1939) గారి పేరు పెడితే బాగుంటుంది. ఆయన విద్యావేత్త. కాకినాడ పిఆర్ కాలేజీ ప్రిన్సిపాల్. సంఘసంస్కర్త. సర్ బిరుదాంకితుడు. స్త్రీవిద్యను ప్రోత్సహించారు. వెనకబడిన వర్గాల విద్యార్థులకు భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. బ్రహ్మసమాజం ద్వారా కులనిర్మూలనకు కృషి చేశారు. వారిని బ్రహ్మర్షి అనేవారు. కాకినాడ కాకపోతే మచిలీపట్నంలో పుట్టారు కాబట్టి ఆ జిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టకపోతే ఈయన పేరు పెట్టవచ్చు. సరే, యివన్నీ మనబోటి వాళ్ల ఊహలు. ఏలినవారి లెక్కలు వారికి ఉంటాయి. మొదటే చెప్పినట్లు యీ జిల్లాల బిల్లు పాసయినప్పటిమాట! ఈలోగా కోర్టుకి వెళ్లడాలు, స్టేలు తెచ్చుకోవడాలూ ఎలాగూ వుంటాయి. (ఫోటో – రఘుపతి వెంకటరత్నం, సంజీవయ్య, గౌతు లచ్చన్న)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2022)