గతానికి భిన్నంగా అభివృద్ధి అజెండాగా సాగుతున్న పాలన ఏపీలో ఉందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్ చెప్పారు. జగన్ కి ఉన్న ముందు చూపు వల్లనే ఏపీలో విప్లవాత్మకమైన చర్యలను అనేకం తీసుకుంటున్నామని ఆయన అన్నారు.
ఏ నిర్ణయం తమ ప్రభుత్వం తీసుకున్నా ప్రజల మేలు గురించే ఆలోచన చేస్తామని చెప్పారు. ఇక ఆదరాబాదరాగా నిర్ణయాలు తీసుకోవడం అనేది ఉండదని, ప్రతీదీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మీదటనే ఆమోదం ఉంటుందని చెప్పారు.
కొత్త జిల్లాల విషయంలో ఈ రోజుకు ఈ రోజు తీసుకున్న డెసిషన్ కాదని, చాలా కాలంగా దీని మీద కసరత్తు జరిగిందని ఆయన అన్నారు. అయినా సరే కొన్ని చోట్ల ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని పరిశీలించడం జరుగుతుందని ధర్మాన చెప్పుకొచ్చారు.
చాలా వరకూ ఆమోదయోగ్యంగానే కొత్త జిల్లాల కూర్పు ఉందని, అయితే అక్కడక్కడ కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని, వాటిని తాము తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. అదే విధంగా కొత్త జిల్లాలకు సీనియర్ అధికారులను నియమించి పాత జిల్లాలతో సరిసమానంగా అభివృద్ధి బ్యాలన్స్ చేస్తామని చెప్పారు.
మొత్తం మీద చూసుకుంటే కొత్త జిల్లాల విషయంలో ఎదురవుతున్న సమస్యలు, నిరసనల మీద ప్రభుత్వం దృష్టి సారిస్తుంది అని డిప్యూటీ సీఎం చెప్పడం విశేషం. అదే టైమ్ లో లోక్ సభకు ఒక జిల్లా అన్న కాన్సెప్ట్ ని కొనసాగిస్తామని చెప్పడం ద్వారా తమ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా చేయాలన్న డిమాడ్లను పక్కన పెట్టేసినట్లే అంటున్నారు. చూడాలి మరి కొత్త జిల్లాల విషయంలో పుట్టుకొస్తున్న సవాళ్ళను ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో.