సినిమా టికెట్ ల బుకింగ్ యాప్ బుక్ మై షో కి నైజాంలో ఎదురుదెబ్బ తగిలేలా వుంది. ఎవ్వరూ బుక్ మై షో ద్వారా టికెట్ లు అమ్మకూడదని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. బుక్ మై షో కారణంగా ప్రేక్షకుల మీద మరీ ఎక్కువ అదనపు భారం పడిపోతోందని సినిమా పెద్దలు భావిస్తున్నారు. అందుకే ఇప్పటి నుంచి ఈ విషయం సెటిల్ అయ్యే వరకు కౌంటర్ ల్లోనే విక్రయించాలని ఎగ్జిబిటర్లకు ఆదేశాలు జారీ చేసారు.
ఇటీవల తెలంగాణలో టికెట్ రేట్లు భారీగా పెరిగాయి. దానికి బుక్ మై షో కమిషన్ కలిపితే రేట్లు ఇంకా పెరిగాయి. ఇవి ఫుట్ పాల్ నెంబర్ మీద గట్టి ప్రభావం కనబరుస్తున్నాయి. అందుకని కౌంటర్ సేల్ చేస్తే బెటర్ అని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
బుక్ మై షో యాజమాన్యం దిగి వస్తే అప్పుడు మళ్లీ ఆలోచించవచ్చని డిసైడ్ చేసారు. ఈ విషయమై నైజాం భీమ్లా నాయక్ డిస్ట్రిబ్యూటర్ శిరీష్ ను సంప్రదించగా, ప్రేక్షకులపై మరీ ఎక్కువ భారం పడుతోందని, అందుకే ఇలా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కొన్నాళ్ల పాటు కౌంటర్ల ద్వారానే టికెట్ లు విక్రయిస్తామన్నారు.
ఆసియన్ సినిమాస్ సునీల్ ను సంప్రదించగా, బుక్ మై షో కమిషన్ ముఫై రూపాయల వరకు వుండడం నిజమే అని, కానీ సిటీలో పెట్రోలు ఖర్చు, సమయం అన్నీ చూసుకుంటే చాలా పెద్ద మొత్తం ఆదా అయినట్లు అని అన్నారు. ఎక్కడి నుంచో ఫ్యామిలీ అంతా థియేటర్ కు వాహనంలో వచ్చి, టికెట్ లు దొరక్క వెనక్కు వెళ్తే ఎంత వృధా అవుతుందో లెక్క వేసుకుంటే లాజిక్ అర్థం అవుతుందన్నారు.