టీ కన్నా టికెట్ రేట్లు తక్కువ..
జగన్ సర్కారు కావాలని టాలీవుడ్ ను చంపేస్తోంది
ఇలా రకరకాల మాటలు…మీమ్స్..వాట్సాప్ లో సైటర్లు..ఫేస్ బుక్ లో వెటకారాలు.
కట్ చేస్తే కొత్త రేట్లు వచ్చాయి. అదనపు రేట్లు కావాలంటే తీసుకోండి అన్నారు.
ఆంధ్ర కన్నా తెలంగాణలో ముందుగా రేట్లు ఇచ్చారు. అది కూడా టాలీవుడ్ అడిగినంతా. దాంతో ఏమయింది. పెద్ద సినిమాలకు ఓకె చిన్న, మీడియం సినిమాలు అంటే జనం థియేటర్ వైపు చూసే పరిస్థితి లేకుండా అయిపోయింది.
ఇప్పుడేమయింది. ఇండస్ట్రీ కళకళ లాడిపోతోందా? థియేటర్ లో సినిమా అంటే జనం భయపడే పరిస్థితి వచ్చేసింది. రేట్లు తగ్గించి సినిమా చూపిస్తున్నాం అని ప్రచారం చేసుకోవాల్సి వస్తోంది. జగన్ ను ఆడిపోసుకున్న వాళ్లంతా ఇప్పుడు సైలంట్ అయ్యారు.
అప్పటికి జనాల్లో జగన్ ను పలుచన చేయడానికి అది వాడుకున్నారు. ఇప్పుడు నిర్మాతలు లబో దిబో అంటున్నారు. మిడ్ రేంజ్ సినిమా బాగుందని టాక్ వచ్చినా కూడా జనం ఓటిటి వైపు చూస్తున్నారు. పెద్ద సినిమాలు వచ్చినా ఫ్యామిలీలు ఓపిగ్గా ఓటిటి కోసం వేచి వుంటున్నాయి.
దాంతో ఇప్పుడు రేట్లు పెంచవద్దు అంటూ ఎగ్జిబిటర్లను నిర్మాతలు కోరాల్సిన పరిస్థితి వచ్చేసింది. మీ రెంట్ మీకు ఇచ్చేస్తాం. నార్మల్ రేట్లకే అమ్మండి అంటూ నిర్మాతలు కోరుకుంటున్నారు. ఈ మధ్యనే సర్కారు వారి పాట నిర్మాతలు ఆంధ్ర సిఎమ్ జగన్ ను కలిసి అదనపు టికెట్ రేట్లు అడిగితే ఆయన అదే చెప్పారు.
అనవసరంగా జనాలు రాకుండా చేసుకుంటున్నారు సినిమాలకు అని. దానికి మైత్రీ నిర్మాతలు బదులిస్తూ, రేట్లు పెంచకపోతే డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు కట్టరు అన్నారు. 35 కోట్ల రేషియోలో అమ్మే సినిమాను 50 కోట్ల మేరకు అమ్ముతామంటే ఎందుకు కడతారు?
మొత్తానికి ఇప్పుడు టాలీవుడ్ కు తెలిసి వస్తోంది. టికెట్ రేట్లు అన్నవి జనానికి అందుబాటులో వుండాలని. బంగారు బాతు గుడ్డును తినాలి కానీ కోసుకుతినకూడదని. నిర్మాతలకు ఈ పాయింట్ బాగా అర్థం అయింది. మరి హీరోలకు ఎప్పుడు అర్థం అవుతుందో?