ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఫైర్ అయ్యారు. ఈయన జగన్ సొంత జిల్లాలోని కమలాపురం నుంచి ప్రాతినిథ్యం వహించారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ నుంచి టికెట్ ఆశించారు. నిరాశే ఎదురైంది.
తనను కాదని పుత్తా నరసింహారెడ్డికి ఇవ్వడంతో వీరశివారెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో ఆయన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్రనాథ్‌రెడ్డికి మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచి ఆయన వైసీపీలోనే కొనసాగుతున్నారు.
తాజాగా ఇవాళ కమలాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్‌పై విమర్శలు గుప్పించడం చర్చనీయాంశమైంది. కమలాపురంలో నిర్వహిస్తున్న బాదుడేబాదుడు కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటున్న తరుణంలో జగన్‌పై విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీకి చేరువ కావడానికే విమర్శలు చేశారా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్‌పై వీరశివారెడ్డి విమర్శల గురించి తెలుసుకుందాం.
జగన్ పాలన తుగ్లక్ కూడా నవ్వుకునేలా ఉందని ఘాటు విమర్శలు చేశారు. కేసుల నుంచి బయట పడేసేందుకే రాజ్యసభ సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. ఆర్.కృష్ణయ్య, నిరంజన్‌రెడ్డి ఏపీలో ఏ జిల్లాకు చెందిన వారో చెప్పాలని వీరశివారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరికి రాజ్యసభ సీట్లు ధారాదత్తం చేశారని మండిపడ్డారు.
వైసీపీలో రాజ్యసభకు అర్హులైన నాయకులు లేనందు వల్లే తెలంగాణ నుంచి అరువు తెచ్చుకున్నారా? అని నిలదీశారు. 2024 ఎన్నికల్లో జగన్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వీరశివ విమర్శల వెనుక వ్యూహం ఏంటి? అనే చర్చకు తెరలేచింది. బలమైన కారణంతోనే వీరశివారెడ్డి విమర్శలకు దిగారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.