ఈ హిందీ మోజు ఎప్పటికి పోతుందో?

నిజానికి సరైన సినిమా పడాలే కానీ మన మార్కెట్ తక్కువేమీ కాదు. దాదాపు 150 కోట్ల మార్కెట్ కేవలం మన రెండు రాష్ట్రాల్లోనే వుంది.

టాలీవుడ్ జ‌నాలకు ఇప్పుడంతా హిందీ మోజు. పాన్ ఇండియా సినిమా అంటే అర్థం అదే. ఎందుకంటే కన్నడ, తమిళ నాట ఏనాటి నుంచో మన తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా చేస్తున్నది ఏమిటంటే కన్నడ, తమిళ భాషల్లో విడుదల తప్ప వేరు కాదు. మలయాళం మార్కెట్ ఏమంత ఎక్కువ కాదు. మన సినిమాల లెక్కలతో పోల్చుకుంటే చాలా అంటే చాలా తక్కువ. ఇక మిగిలింది హిందీ మార్కెట్ నే. కొడితే మామూలుగా వుండదు. కానీ అలా కొట్టాలంటే చాలా కష్టం. దాదాపుగా లాటరీ కొట్టినట్లే. రాజ‌మౌళి, ప్రభాస్ సినిమాలు మాత్రమే నార్త్ బెల్ట్ కు ఇప్పుటి టేకిట్ గ్రాంట్ గా దగ్గరయ్యాయి.

లాటరీ అని ఎందుకు అనాల్సి వస్తోంది అంటే, కార్తికేయ 2, హనుమాన్, పుష్ప ఈ సినిమాల హిందీ సక్సెస్ ను ఎవ్వరూ ముందుగా ఊహించలేదు. కార్తికేయ 2 లో అనుపమ్ ఖేర్ ఎపిసోడ్, పుష్ప లో ఐటమ్ సాంగ్, రష్మిక క్రేజ్, హనుమాన్ లో హనుమంతుడు అంశాలు కలిసి సినిమాలను నార్త్ మార్కెట్ లో సక్సెస్ చేసాయి. అలా అని ఈ ఎలిమెంట్లు వుంటే నడిచిపోతుందనే గ్యారంటీ కూడా లేదు.

నార్త్ లో హిట్ కొడితే వచ్చే డబ్బులు వేరు. కానీ అలా హిట్ కొట్టడం సంగతి అలా వుంచితే అక్కడ విడుదలకు, మార్కెట్ కు చేయాల్సిన ఖర్చు కూడా ఎక్కువే. లైగర్ సినిమాకు నార్త్ లో చేసినంత పబ్లిసిటీ, మరే తెలుగు సినిమాకు జ‌రగలేదు. కానీ సినిమా డిజాస్టర్. అలాంటి రేంజ్ లో పబ్లిసిటీ చేయాలి అంటే కోట్ల బడ్జెట్ పబ్లిసిటీకే పెట్టాలి.

ఇక రెండో సంగతి. థియేటర్ మార్కెట్. నార్త్ అంటే చిన్న ఏరియా కాదు. సగం ఇండియా అంతా కలిపి నార్త్. ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని థియేటర్లు. మనవాళ్లు మెయిన్ గా మహరాష్ట్ర, యుపి, ఢిల్లీ ఈ ప్రాంతాల మీద దృష్టి పెడతారు. కొంత వరకు కలకత్తా. ఈ మేరకు విడుదల చేయాలన్నా కూడా కనీసం అయిదు నుంచి పది కోట్లు ఖర్చు వుంటుంది. రాబట్టిన దాంట్లోంచి ఈ ఖర్చు అంతా పోయాక మిగిలింది లాభం.

మరి ఇలాంటి ఫీట్ చేయడం అంటే లాటరీ కొట్టాల్సిందే. కానీ మన హీరోలకు మాత్రం తమ రెమ్యూనిరేషన్ అమాంతం పెంచుకోవడానికి నార్త్ మార్కెట్ ఓ అవకాశం అని అనిపిస్తోంది. అందుకే తెలుగునాట పబ్లిసిటీ అంటే కిలోమీటర్ దూరం వుండే రవితేజ‌ లాంటి హీరోలు కూడా ముంబాయి వెళ్లి తెగ కిందా మీదా అయిపోతారు. కానీ ఫలితం మాత్రం ఎలా వుంటుంది అన్నది టైగర్ నాగేశ్వరరావు లాంటి సినిమా చెప్పనే చెప్పింది.

నిజానికి సరైన సినిమా పడాలే కానీ మన మార్కెట్ తక్కువేమీ కాదు. దాదాపు 150 కోట్ల మార్కెట్ కేవలం మన రెండు రాష్ట్రాల్లోనే వుంది. సరైన కాంబినేషన్ సినిమా అయితే 100 కోట్ల నుంచి 150 కోట్ల నాన్ థియేటర్ మార్కెట్ వుంది. ఈ మార్కెట్ ను సరిగ్గా టార్గెట్ చేసి, కొట్టగలిగితే అదే పది వేలు. చేతిలో వున్న ఈ అవకాశాన్ని వదిలేసి, గాల్లో చూస్తూ పరుగుతున్నారు. పరుగెత్తడం తప్పు కాదు. కానీ అందరికీ ఈ పరుగు అనవసరం. దాని వల్ల నిర్మాతలకు వృధా ఖర్చు తప్ప సాధించేది ఏమీ లేదు.

గత ఏడాది కాలంగా పాన్ ఇండియా అంటూ హడావుడి మొదలుపెట్టి, ముంబాయిల్లో మీడియా పేరంటాలు పెట్టి, నిర్మాతల‌ జేబులకు చిల్లులు పెట్టిన చాలా సినిమాల వైనం గమనిస్తే ఈ సంగతి అర్థం అవుతుంది.

9 Replies to “ఈ హిందీ మోజు ఎప్పటికి పోతుందో?”

  1. ఎప్పుడో త్రేతా యుగం నించి దక్షిణం వారికి ఆ ఆత్మ న్యూనతా భావం ఉంది.. మన అగ్ర హీరో లు చాలా మందే అందుకే అక్కడి అమ్మాయిలని పెళ్లి చేసుకుంటారు…

    1. మన అగ్రహీరోల్లో ఎన్టీఆర్, ఏన్నార్, కృష్ణ, శోభన్బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రవితేజ, రాంచరణ్, అల్లు అర్జున్, మహేష్, పవన్కళ్యాణ్, etc…… ఇంతమందిలో అక్కడి అమ్మాయిలని పెళ్లి చేసుకున్నవాళ్లు ఎంతమంది ఉన్నారో చెప్పండి సార్…….

    2. తెలుగు మహేష్ (నమ్రత), తమిళ్ సూర్య( జ్యోతిక) తప్పితే నార్త్ ఇండియన్ అమ్మాయిని చేసుకున్న సౌత్ ఇండియా హీరో నటులు ఎవరు వున్నారు?

      కుష్బూ సౌత్ ఇండియా లో స్థిర పడ్డారు ఎప్పుడో. కనుక ఆమె నార్త్ ఇండియన్ కింద లెక్క లోకి రారు.

    3. ఎంత మంది నార్త్ వారిని , సౌత్ ఇండియా సినిమా వాళ్ళు పెళ్లి చేస్తుకున్నారు, పేరు తెలిస్తే చెప్పండి..

      నమ్రత – మహేష్

      జ్యోతిక – సూర్య

      ..

      ఇంకా ??

  2. పాన్ ఇండియా మోజు కాదు, ఇంకేదో కాదు…

    ఇంతకు ముందు బాలీవుడ్ లో ఏదో పొడుద్దామని వెళ్లి తన్నించుకొని వాపసు వచ్చిన చిరు, వెంకీ, నాగ్ లను చూసి ఇప్పటి తరం వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు

    అందుకే పైవాళ్ళ లాగ డైరెక్ట్ సినిమాలు చేయకుండా పాన్ ఇండియా ముసుగులో తెలుగు డబ్బింగ్ సినిమాలు వదిలి సంతృప్తి పడుతున్నారు

Comments are closed.