వకీల్ సాబ్.. హిందీ సినిమా పింక్ కు రీమేక్, నారప్ప.. తమిళ సినిమా అసురన్ కు రీమేక్, తిమ్మరసు.. కన్నడ సినిమా బీర్బల్ కు రీమేక్, ఇష్క్.. మలయాళంలో అదే పేరుతో రూపొందిన సినిమాకు రీమేక్.. ఇవన్నీ ఈ మధ్య రిలీజులు.
ఇక రాబోయే సినిమాల్లో.. కూడా రీమేక్ ల పరంపర కొనసాగనుంది. అయ్యప్పనుమ్ కోషియుం రీమేక్ గా పవన్ కల్యాణ్ సినిమా, అంథాధూన్ రీమేక్ గా నితిన్ సినిమా, దృశ్యం 2 రీమేక్, లూసీఫర్ రీమేక్, వేదాళం రీమేక్, నయట్టు రీమేక్, కప్పెల రీమేక్.. ఇవీ తరచూ వినిపిస్తున్న సినిమా వార్తలు.
తెలుగు వాళ్లకు సొంతంగా సినిమా తీయడం చేతగాక కాదు. ఇదో కంఫర్ట్ జోన్ గా మారుతున్నట్టుగా ఉంది. ప్రత్యేకించి పెద్ద హీరోలు, మార్కెట్ ఉన్న హీరోలే ఇలాంటి రీమేక్ లు చేస్తూ ఉంటే నవ్వుకోవాల్సిన పరిస్థితి. ఇది వరకూ కన్నడీగులు విపరీతంగా రీమేక్ లు చేసే వారు. ఎంతలా అంటే.. నూటికి 90 శాతం రీమేక్ సినిమాలు అక్కడ వచ్చేవి. అది కూడా అక్కడి పెద్ద హీరోలే నిత్యం అలా రీమేక్ ల మీద బతుకీడ్చేవారు.
ఇప్పుడు టాలీవుడ్ లో కూడా పెద్ద హీరోలే ఇలా రీమేక్ లే సినిమాలు అన్నట్టుగా వ్యవహరిస్తే ఎలా? అనేది ప్రశ్న. అందులోనూ.. టాలీవుడ్ గమనించుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఇది డిజిటల్ ఎరా. ఎక్కడో సౌత్ కొరియన్ సినిమాలను కూడా వీక్షించేస్తున్నారు ప్రేక్షకులు. సౌత్ కొరియన్ డైరెక్టర్ల చరిత్రను కూడా చెప్పేంత స్థాయికి ఎదిగిపోయారు.
వర్క్ ఫ్రమ్ హోం లో పదులు, వందల సినిమాలు చూసిన వారు కనిపిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. ఇక చూడటానికి కొత్తగా ఏముంది? అనే ధోరణిని ప్రేక్షకులు ఏర్పరుచుకుంటుంటే, టాలీవుడ్ స్టార్లు మాత్రం.. రీమేక్ లు అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విచారకరమైన అంశం. ప్రత్యేకించి.. ఏడాదిన్నరగా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ల వీక్షణకు, ఓటీటీలకు జనాలు బాగా అలవాటు పడిన తరుణంలో వరస పెట్టి ఈ రీమేక్ ల వాయింపులు వెగటు పుట్టించేలా ఉన్నాయి.