టాలీవుడ్ లోకి చాలా మంది వస్తుంటారు. అందులో వారసులు, డబ్బున్న బాబుల బాబులు ఎక్కువగా వుంటారు.
స్వంతంగా ఎన్ని సినిమాలు అయినా చేయగలిగిన కెపాసిటీతో వుంటారు. కానీ ముందుగా స్వంత సినిమా చేయగానే తరువాత నుంచి వేరే బ్యానర్ల మీదకు వెళ్తారు.
ఇదో కొత్త టెక్నిక్. ఆ బ్యానర్ సినిమా తీసింది అంటే ఆ హీరోకి కాస్త డిమాండ్ వచ్చినట్లే అన్న ప్రచారం ఇండస్ట్రీలోకి పంపడానికి ఇదో టెక్నిక్.
ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు…హీరో మహేష్ మేనల్లుడు అశోక్ ఓ సినిమా చేసారు. ఆ తరువాత మరి సినిమాలు చేయాలన్నా ఏ నిర్మాత ముందుకు రాలేదు.
డబ్బుల సమస్య లేదు. వేల కోట్లు వున్నాయి. అందుకే ఇప్పుడు అశోక్ తల్లి, మహేష్ సోదరి కొన్ని ప్రామినెంట్ బ్యానర్లను సంప్రదిస్తున్నారని బోగట్టా. పెట్టుబడి తమదే. మీ బ్యానర్ లో సినిమా చేసిపెట్టండి అంటూ.
పూరి జగన్నాధ్ టాప్ డైరక్టర్. ఆయన కొడుకు ఆకాష్ పూరి చాలా ప్రయత్నాలు చేసాడు కానీ వర్కవుట్ కావడం లేదు. అందుకే ఈసారి బయట బ్యానర్ కు పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారు.
కథ, మాటలు, కాస్త డబ్బులు ఇస్తాం సినిమా చేసి పెట్టండి అని పూరి జగన్నాధ్ తరపున చార్మి కొన్ని బ్యానర్లను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏస్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు హర్షిత్. స్వంత బ్యానర్ లో ఓ సినిమా చేసాడు. మరో సినిమా చేస్తున్నాడు. ముచ్చటగా మూడో సినిమా మాత్రం వేరే బ్యానర్ లో చేయాలని ఆలోచన. ఇందుకోసం దిల్ రాజు కొన్ని బ్యానర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు.
మొత్తం మీద టాలీవుడ్ లో వారసుల మార్కెట్ పెంచడానికి, వారిని నిలబెట్టడానికి ఇలా ఓ కొత్త టెక్నిక్ ను కనిపెట్టారు.