సినిమా టికెట్లపై ప్రభుత్వానికి క్లారిటీ ఉందా..?

ఓవైపు FDC పోర్టల్ ద్వారా ప్రేక్షకులు టికెట్లు కొనుక్కోవచ్చు అంటారు, మరోవైపు ఆన్ లైన్ సంస్థలు కూడా ఆ సైట్ ద్వారా టికెట్లు కొని, ఆ తర్వాత విక్రయించుకోవచ్చు అంటారు. అసలు ప్రభుత్వమే కొత్త…

ఓవైపు FDC పోర్టల్ ద్వారా ప్రేక్షకులు టికెట్లు కొనుక్కోవచ్చు అంటారు, మరోవైపు ఆన్ లైన్ సంస్థలు కూడా ఆ సైట్ ద్వారా టికెట్లు కొని, ఆ తర్వాత విక్రయించుకోవచ్చు అంటారు. అసలు ప్రభుత్వమే కొత్త సైట్ పెడితే.. మిగతా వెబ్ సైట్లతో కన్ఫ్యూజన్ ఎందుకు..? మళ్లీ ఆయా సైట్లు కమీషన్ తీసుకుని అంతిమంగా ప్రేక్షకుడి జేబుకి చిల్లు పెట్టడం ఎందుకు..?  

ఇప్పటికే ఏపీలో సినిమా టికెట్ల విషయంలో నానా రాద్ధాంతం జరిగింది. తొందరపడి నిర్ణయం తీసుకుంది ఎవరైనా.. తిట్టించుకుంది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే. ఇప్పటికైనా ఆన్ లైన్ టికెట్ల విషయంలో స్థిరమైన నిర్ణయానికి వస్తే మంచిది. అమ్మితే ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలి. లేదా గతంలోలాగా పట్టించుకోవడం వదిలేయాలి.

కొత్త జీవో ఏం చెబుతోంది..

రాష్ట్రంలో ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయానికి రాష్ట్ర ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (FDC) సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన జీవో కూడా విడుదల చేశారు. కొత్తగా ఆన్ లైన్ టికెట్లపై 1.95 శాతం కమీషన్ విధిస్తున్నామన్నారు. ఈ కమిషన్ ప్రభుత్వం తీసుకుంటోందని ఇప్పటికే తప్పుడు ప్రచారం జనాల్లోకి వెళ్లింది. అయితే కమీషన్ లో 0.95శాతం సర్వీస్ ప్రొవైడర్ కి, మిగిలిన 1 శాతం పరిశ్రమ అభివృద్ధికి అని చెబుతున్నారు ప్రభుత్వ పెద్దలు. 

ఈ వ్యవహారంతో ఏపీలో ఉన్న అన్ని థియేటర్లు, తమ సీటింగ్ కెపాసిటీని కచ్చితంగా చెప్పాలి. ప్రతి టికెట్ ని ఆన్ లైన్ లోనే అమ్మాలి. ఇంటి దగ్గరే ఆన్ లైన్ లో బుక్ చేసుకునేవారితో పాటు, థియేటర్ కి వచ్చి అక్కడ కౌంటర్లో ఆన్ లైన్ లో కూడా బుక్ చేసుకునే వెసులుబాటు ఇచ్చారు.

బ్లాక్ మార్కెట్ ని అరికట్టగలరా..?

ప్రైవేట్ వెబ్ సైట్స్ అయితే థియేటర్లతో కుమ్మక్కై టికెట్లను బ్లాక్ చేసుకుని, ఎక్కువ రేటుకి థియేటర్ల యాజమాన్యమే అమ్మే అవకాశముంటుంది. ఇప్పుడు ప్రభుత్వ వెబ్ సైట్ కాబట్టి, ఆ సమస్య ఉండదు, కానీ ఆన్ లైన్ లో బల్క్ గా బుక్ చేసుకున్నవారు ఆ తర్వాత థియేటర్ల వద్ద బ్లాక్ మార్కెటింగ్ మొదలు పెడితే దానికి విరుగుడు ఏంటో ప్రభుత్వం చెప్పలేకపోతోంది.

జస్ట్ టికెట్స్ అనే సంస్థను సర్వీస్ ప్రొవైడర్ గా పేర్కొంటున్నారు. ఆ సంస్థకు 0.95 శాతం కమిషన్, మిగతా 1 శాతం సినీ పరిశ్రమ అభివృద్ధికి ఖర్చు పెడతామంటున్నారు. దీనిపై త్వరలో థియేటర్ల ఓనర్లతో ఎఫ్.డి.సి. తరపున ఎంవోయూ కుదుర్చుకోడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఒప్పందాల్లో జిల్లా కలెక్టర్లదే కీలక పాత్ర.

కమీషన్ లో కమీషన్..

సినిమా టికెట్ల విక్రయం ఇకపై ఎఫ్.డి.సి. వెబ్ సైట్ ద్వారా జరుగుతుంది. అంతవరకు బాగానే ఉంది. అయితే ఆ సైట్ లో టికెట్లు కొనుగోలు చేసి, మిగతా సైట్లు వాటిని ఆన్ లైన్లో విక్రయించుకోవచ్చు అనే వెసులుబాటు మాత్రం మరింత కన్ఫ్యూజన్ ని తెచ్చిపెడుతోంది. ఆర్టీసి టికెట్లు కూడా అధికారిక వెబ్ సైట్ కంటే, ప్రైవేట్ వెబ్ సైట్స్ లో ఎక్కువ రేటు ఉంటాయి. అవగాహన లేనివారు ప్రైవేట్ సైట్స్ లో టికెట్లు తీసుకుంటారు. కానీ ఖాళీలు మాత్రం రెండు వెబ్ సైట్స్ లో ఒకేరకంగా చూపిస్తాయి.

ఇప్పుడు సినిమా థియేటర్లలో టికెట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో అమ్ముతామని చెబుతూ.. మళ్లీ ప్రైవేట్ సంస్థలు కూడా ఆన్ లైన్ లో టికెట్ కొనుక్కోవచ్చు అనే ఆప్షన్ ఎందుకిచ్చారో అర్థం కావడంలేదు. తిరిగి ఆయా సంస్థలు తమ కమిషన్ ని కలుపుకుని టికెట్ రేట్లు పెంచితే.. అప్పుడు ఆ అపనింద భరించేది ఎవరు..?

మొత్తమ్మీద సినిమా టికెట్లు అనే తేనెతుట్టెను కదిల్చి.. ఇప్పటికే ఆ బురద అంటించుకుంది ప్రభుత్వం. పదే పదే ఇప్పుడు మార్పులు, చేర్పులు, జీవోలు, ఎంవోయూలు అంటూ దీన్ని మరింత రచ్చ చేసే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. టికెట్ రేట్లు పెరిగినప్పుడు జనాలు ప్రభుత్వాన్ని తిట్టుకున్నారు, టికెట్ రేట్లు తగ్గినప్పుడు థియేటర్ల ఓనర్లు ప్రభుత్వాన్ని తిట్టుకున్నారు. మధ్యలో వేలు పెట్టి ఇబ్బంది పడిండి, పడుతోంది మాత్రం ప్రభుత్వమే.