విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు తెల్లదొరల మీద అలుపెరగని పోరాటం చేసిన యోధుడు. ఆయన కేవలం 27 ఏళ్ళు మాత్రమే జీవించారు. ఆయన విశాఖ మన్యం బెబ్బులిగా మారి నాటి బ్రిటిష్ దొరల మీద భయంకరమైన యుద్ధాన్నే చేశారు. ఆంధ్ర వీర పౌరుషాన్ని ఎలుగెత్తిచాటారు.
ఇపుడు ఆయన ప్రస్థావన ఎందుకు అంటే అల్లూరి 125వ జయంతి జూలై 4న జరుగుతోంది. చరిత్రలో ఇదొక మైలురాయి లాంటి రోజు. అల్లూరి పుట్టి 125 ఏళ్ళు అయిన వేళ ఆ మహానుభావుడు దేశానికి ఏం చేశారు అన్నది ఈ తరానికి మరింతగా తెలియాల్సి ఉంది. అజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ కేంద్రం కూడా ఆయన 125 జయంతి ఉత్సవాలను వైభవంగా జరగేందుకు సిద్ధపడుతోంది.
మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా అల్లూరి పేరిట జిల్లానే ఏర్పాటు చేసి ఆయన జయంతికి ముందే ఘన నివాళిని అర్పించింది. ఇక ఉత్సవాలను పెద్ద ఎత్తున చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఇవన్నీ పక్కన పెడితే జూలై 4న ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం వస్తున్నారు ఆ రోజున అల్లూరి 125 జయంతి ఉత్సవాలని ఆయన అక్కడ ప్రారంభిస్తున్నారు.
అయితే అల్లూరి జీవితం అంతా గడిచింది విశాఖ జిల్లాలోనే. ఆయన పుట్టింది. విశాఖ జిల్లా భీమిలీ నియోజకవర్గం పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామం. ఇక ఆయన పోరాటం చేసింది చింతపల్లి అడవులలో, కొయ్యూరు తదితర ప్రాంతాలలో. ఇక ఆయన మరణించినది కూడా విశాఖ జిల్లా ఏజెన్సీలోని కొయ్యూరులో.
మరి అల్లూరి జీవితం మొత్తం అంతా కూడా విశాఖ జిల్లాతోనే ముడిపడి ఉండగా భీమవరంలో ఉత్సవాలు నిర్వహించడం పట్ల అల్లూరి అభిమానులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి 125వ జయంతి వేడుకలను విశాఖ లోనే నిర్వహించాలని, ప్రధాని నరేంద్ర మోడీ విశాఖకే రావాలని కోరుతున్నారు. దీని మీద మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు లాంటి వారు కూడా విశాఖలో అల్లూరి పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తేనే ఆ మహానుభావుడికి ఘన నివాళి అర్పించినట్లు అవుతుందని అంటున్నారు.