మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలకు ఇంకా రెండు, మూడు నెలలుండగానే సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ‘మా’ అధ్యక్ష స్థానాన్ని దక్కించుకోడానికి వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికైతే నలుగురు అధ్యక్ష బరిలో నిలవనున్నట్టు తమకు తాముగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాము అధ్యక్షులమైతే ఇండస్ట్రీకి చేయగలిగే మంచి పనులేంటో చెబుతూ, సభ్యుల ఆదరణను చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ సందర్భంగా కులం, మతం, ప్రాంతాలు ‘మా’ ఎన్నికల తెరపైకి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో విలక్షణ నటుడు మంచు మోహన్‌బాబు తనయుడు, యువ హీరో విష్ణు పోటీ చేస్తుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అధ్యక్ష బరిలో నిలిచే వారిలో చిన్న వయస్కుడు విష్ణే. ఇండస్ట్రీకి ఎంతో రుణపడి ఉన్నామని, ఆ రుణాన్ని తీర్చుకుంటానని విష్ణు చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. తనకు అవకాశం ఇస్తే, ఎంతో మంచి చేస్తానని విజ్ఞప్తి చేశారు. మంచు విష్ణు బహిరంగ లేఖలోని ముఖ్య అంశాలేంటో చూద్దాం.
‘ఈ ఏడాది జరగనున్న ‘మా’ అధ్యక్ష పదవికి నేను నామినేషన్ వేస్తున్నాను. సినిమా పరిశ్రమనే నమ్ముకున్న కుటుంబంలో పుట్టిన నేను తెలుగు సినిమాతోనే పెరిగాను. మన పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టనష్టాలు.. ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన నాకు ‘మా’ కుటుంబసభ్యుల భావాలు, బాధలు బాగా తెలుసు. నాకు, నా కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు అందించిన తెలుగు సినిమా పరిశ్రమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆ రుణం తీర్చుకోవడానికి ఈ పరిశ్రమకు సేవ చేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను.
నా తండ్రి మోహన్‌బాబు ‘మా’ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా చేసిన సేవలు, వారి అనుభవాలు, నాయకత్వ లక్షణాలు ఇప్పుడు నాకు మార్గదర్శకాలయ్యాయి. ‘మా’ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగా నా సేవలు సంపూర్ణంగా అందించాలనుకుంటున్నాను. పెద్దల అనుభవాలు, యువరక్తంతో నిండిన కొత్త ఆలోచనలు కలగలిపి నడవాలనే నా ప్రయత్నం, మీ అందరి సహకారంతో విజయ వంతం కావాలని ఆశిస్తున్నా’ అని మంచు విష్ణు పేర్కొన్నారు.
‘మా’ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖుల మద్దతు ఎవరెవరికి ఉంటుందో అనే అంశంపై టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. నలుగురు పోటీలో దిగుతుండడం వల్ల సామాజిక వర్గాల వారీగా ఓట్ల డివిజన్ జరిగితే నష్టమెవరికి, లాభం ఎవరికి? అంతిమంగా విజయం ఎవరిని వరిస్తుందనే అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.