కరోనా కష్టకాలంలో చాలా వ్యాపారాలు పడకేశాయి. అదే సమయంలో కొన్నిరంగాలు భారీ లాభాలు కళ్లజూశాయి. అలాంటి వాటిలో వైద్యరంగం ఒకటి. ముఖ్యంగా మెడికల్ షాపుల వ్యాపారం దాదాపుగా 10 రెట్లు పెరిగింది. కరోనా మందులతో పాటు, విటమిన్ ట్యాబ్లెట్లు, ఇమ్యూనిటీ బూస్టర్ల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయల్లా మారింది.
ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ నివేదికలో.. విటమిన్ టాబ్లెట్ల విషయంలో భారతీయ మార్కెట్ విలువ ఎంత పెరిగిందో స్పష్టంగా తెలుస్తోంది. గడిచిన ఏడాది కాలంలో భారతీయులు ఏకంగా 15వేల కోట్ల రూపాయల విటమిన్లు మింగేశారని అర్థమవుతోంది.
భారత్ లో విటమిన్ సప్లిమెంట్లు, రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలు (ఇమ్యూనిటీ బూస్టర్ల) మార్కెట్ 2019లో 5వేల కోట్ల రూపాయలుగా ఉంటే.. 2020లో అది ఏకంగా 15 వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. అంటే ఏడాదిలోనే 3 రెట్లు పెరిగిందన్నమాట..
కరోనా భయంతో భారతీయుల్లో విటమిన్ టాబ్లెట్లు, ఇమ్యూనిటీ బూస్టర్ల వ్యాపారం ఓ రేంజ్ లో పెరిగింది. కరోనా చికిత్సలో భాగంగా వైద్యులు కూడా విటమిన్ ట్యాబ్లెట్లను సూచించడంతో.. వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత కూడా చాలామంది వాటిని కొనసాగిస్తున్నారు. దీంతో ఈ వ్యాపారంలో వృద్ధి చోటుచేసుకుంది.
ఆరోగ్యం కంటే ఏదీ ఎక్కువ కాదని కరోనా గుణపాఠం నేర్పింది. దీంతో సగటు భారతీయిడి ఆలోచనా విధానం కూడా మారింది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు విటమిన్ సప్లిమెంట్లపై ఆధారపడటం మొదలు పెట్టాడు. అలా ఏడాదిలో ఏకంగా 15వేల కోట్ల రూపాయల హెల్త్ సప్లిమెంట్లను తీసుకున్నారు భారతీయులు.