తెలుగు సినీ నటీనటుల సంఘం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు దాదాపు గడిచిన మూడు పర్యాయాల నుంచి హడావుడిగా జరుగుతూనే వున్నాయి.
నిధులు లేవు..అధికారాలు లేవు. పెద్దగా పలుకుబడి లేదు. కానీ మా సంఘం అధ్యక్షపదవికి మాత్రం పోటా పోటీ పరిస్థితి ఏర్పడుతోంది.
గతంలో ఏమో కానీ ఈ సారి పోటీ వెనుక ఆసక్తికరమైన విషయం దాగి వుందని టాలీవుడ్ ఇన్నర్ సర్కిళ్లలో బలంగా వినిపిస్తోంది.
మా ఎన్నికల పోటీ ఎంత మంది మధ్య తిరిగినా, ప్రతీసారీ తెరపైకి వచ్చే అంశం ఒకటి వుంది. మా సంఘానికి సొంత భవనం అన్నదే ప్రతీసారీ కీలక అజెండా.
ఈ అజెండా వెనుక మరో అజెండా దాగి వుందని, దాని ఫలితమే ఈసారి ఎన్నికల పోటీ వెనుక వ్యూహమని టాలీవుడ్ లో వినిపిస్తున్న వదంతి.
అసలు ఏమిటిదంతా..?
ఈసారి అధ్యక్షపదవికి ముందుగా బయటకు వచ్చిన పేరు ప్రకాష్ రాజ్. ఆయన అన్నమాటలు ఓసారి చూద్దాం. 'ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. దాదాపు ఏడాది కిందట నుంచి మా గురించి ఆలోచిస్తున్నాను. కలిసిన వారితో దాని గురించి డిస్కస్ చేస్తున్నాను'..
ఇంచుమించు ఇదే అర్థం వచ్చేలా ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నారు. అసలు అంత మాట్లాడాల్సింది, మథనపడాల్సింది ఏమిటి వుంది మా గురించి?
అసలు మా దేని కోసం? సభ్యుల మధ్య ఐకమత్యం. సభ్యుల సమస్యలు. సభ్యులను అవసరం అయితే ఆదుకోవడం. ఇవే ఇంకా పూర్తిగా జరగడం లేదు. ఎప్పటికప్పుడు ఇన్స్యూరెన్స్ కోసం నిధులు తడుముకోవాల్సి వస్తోందని అంటున్నారు. తమ వాటా కట్టలేని చిన్న చితక నటుల కోసం ఎవరో ఒకరు సాయం పట్టాల్సి వస్తోంది. మా సంఘలో మెజారిటీ జనాలు చాలా చిన్నా చితక నటులే. వీరికి పింఛన్లు లాంటి వ్యవహారాలు వున్నాయి. మిగిలిన వారంతా ఆర్థికంగా బలవంతులు.
కానీ వీటికన్నా కూడా ఎప్పుడూ ఈ అసోసియేషన్ కు సొంత భవన నిర్మాణం అనేది తెరపైకి వస్తోంది. నిజానికి మన హీరోల్లో క్రీమీ లేయర్ జనాలు తలుచుకుంటే ఇది చిటికెలో పని. యాభై కోట్ల నుంచి పది కోట్ల వరకు పారితోషికం తీసుకునే హీరోలు పాతిక మంది వరకు వున్నారు. వీరు తలుచుకుంటే పాతిక కోట్లు సమీకరించడం పెద్ద కష్టం కాదు.
కానీ ముందుగా ప్రభుత్వం నుంచి స్థలం సంపాదించాలని అనుకుంటున్నారు. అలా చేస్తే పెద్దగా ఖర్చు లేకుండానే భవనం నిర్మించుకోవచ్చు. పోనీ ఇచ్చే అవకాశం వున్నపుడు అలాంటి ఆలోచన చేయడం తప్పు కాదు. అయితే ఈసారి ఎన్నికల్లో కేవలం భవన నిర్మాణం మాత్రమే ఎజెండా కాదని, ఆ భవనానికి పెట్టే పేరు కూడా హిడెన్ ఎజెండాగా వుంది అని టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
మా సంఘానికి సరైన కార్యవర్గాన్ని సమకూర్చి, దాని వ్యవహారాలన్నీ గాడిలో పెట్టి, ఆపైన భవన నిర్మాణం పై దృష్టి పెట్టాలన్నది మెగా క్యాంప్ ఆలోచనగా తెలుస్తోంది. ఇలాంటి పనులు సమర్థంగా చేయాలి అంటే ప్రకాష్ రాజ్ వంటి వారు కచ్చితంగా సరిపోతారు. అందులో సందేహం లేదు. పైగా ఆయన తెలంగాణ ప్రభుత్వంతో కూడా మంచి సంబంధాలు వున్నాయి. అయితే మెగా క్యాంప్ ఆలోచన అంతటితో ఆగడం లేదని, మా సంఘ భవనానికి నామకరణం పై కూడా దృష్టి వుందని టాలీవుడ్ లో వదంతులు వినిపిస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఛారిటీ మీద బాగా దృష్టి పెట్టారు. ఆక్సిజన్ సరఫరా అన్న కార్యక్రమాన్ని రెండు రాష్ట్రాల్లో చేపట్టారు. అభిమానులకు, అవసరమైన వారికి ఆయన విరివిగా సాయం చేస్తున్నారు. అందులో భాగంగానే మా సంఘ భవనానికి కూడా ఆయన ఇతోధికంగా సాయం చేసే ఆలోచన చేస్తున్నారని బోగట్టా. కానీ మెగాస్టార్ అలా చేస్తే కనుక, ఆయన పేరు టాలీవుడ్ లో చిరస్థాయిగా మిగిలిపోయేలా, మా నటీనటుల సంఘ భవనానికి మెగాస్టార్ పేరు పెడితే బాగుంటుందని మెగా క్యాంప్ ఆలోచనగా వినిపిస్తోంది. పైగా మా సంఘం అన్నది అసలు మెగాస్టార్ బ్రెయిన్ చైల్డ్ నే.
అయితే తెలుగు సినిమా పరిశ్రమను, తెలుగు వాడి గౌరవాన్ని ప్రపంచం నలుమూలలా చాటిన నందమూరి తారకరామారావు పేరు పెట్టాలి అన్నది టాలీవుడ్ లోని మరో వర్గం ఆలోచనగా తెలుస్తోంది. మెగా క్యాంప్ ఆలోచనను పసిగట్టిన ఈ వర్గం అందుకే మా మీద పట్టు జారకూడదని పట్టుదలగా వుంది.
అయితే ఈ హిడెన్ ఎజెండా వ్యవహారం మాత్రం కేవలం కీలక వ్యక్తుల డిస్కషన్ లో మాత్రమే వినిపిస్తోందని, ఇంకా టాలీవుడ్ జనాల్లోకి విస్తృతంగా పాకలేదని, విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఈ విషయం బయటకు విస్తృతంగా పాకితే మా ఓటు బ్యాంక్ వర్గాల వారీగా చీలిపోతుంది. కానీ ఈ విషయాన్ని బయటకు పాకిస్తేనే మంచిదని, సభ్యులకు క్లారిటీ వస్తుందని కొందరు భావిస్తున్నారు.
ఎప్పుడో సెప్టెంబర్ లో జరగబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచీ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ప్రకాష్ రాజ్ రంగంలోకి దిగడమే కాకుండా, చకచకా దూసుకుపోతున్నారు. చానెళ్లలో కూర్చుంటున్నారు. విస్తృతంగా మాట్లాడుతున్నారు. ప్యానల్ ను చాలా పకడ్బందీగా కూర్చారు. ఇలా అన్ని విధాలా ముందు వున్నారు.
మంచు విష్ణు ఇంకా ప్యానల్ ను ప్రకటించలేదు. సిట్టింగ్ అధ్యక్షుడు నరేష్ తెరవెనుక అన్నీ తానై వ్యవహరిస్తున్నారని బోగట్టా. ఈ ప్యానల్, ప్రచారం, ఓటు బ్యాంక్ లాంటి వ్యవహారాలు అన్నీ ఆయనే చూసుకుంటున్నారు. విష్ణు తండ్రి మోహన్ బాబు కూడా ఫోన్ లో వీలయినంత మందితో టచ్ లో వున్నారు.
నటి జీవిత పోటీ చేస్తానని ప్రకటించినపుడు కూడా మోహన్ బాబు ఆమెతోనూ, ఆమె పిల్లలతోనూ ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో పెద్దలతో మాట్లాడి, ఎలాగైనా ఈ పోటీ అనేది లేకుండా చేసి, ఏకగ్రీవం చేయించాలన్నది మోహన్ బాబు ఆలోచనగా తెలుస్తోంది. కానీ ఆ అవకాశం ఇవ్వకుండా ముందుగానే చకచకా దూసుకుపోవాలని, అలా అయితే ఇంతదాకా వచ్చాక ఏకగ్రీవం సాధ్యం కాదనే మెసేజ్ పంపాలని రెండో క్యాంప్ ఆలోచనగా వినిపిస్తోంది.
విష్ణు ఇంకా చిన్నవాడని, ఎంత భవిష్యత్ ముందు వుందని, నచ్చచెప్పి విత్ డ్రా చేయించాలని వుంది కానీ, వెనుక వున్న నరేష్ అస్సలు తగ్గడం లేదని బోగట్టా. ఇలాంటి నేపథ్యంలో ఎన్నిక విషయంలోనే ఇంత పోటీ వుంటే భవన నిర్మాణం, అలాగే దానికి నామకరణం విషయంలో ఇంకెంత పోటీ వస్తుందో అన్న కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.