టాలీవుడ్ లో చాలా మంది ఆంధ్ర జనాలు వున్నారు. వారే కాకుండా తెలంగాణ జనాలకు కూడా ఆంధ్రలో సంక్రాంతికి జరిగే హడావుడి అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా కోడిపందాలు, గుళ్ల ఆటలు అంటే మరీ ఇష్టం. అందుకే సంక్రాంతికి ఛలో ఆంధ్ర అంటారు. కరోనా తరువాత ఈసారి తొలిసారి ఫుల్ ఫ్రీడమ్ దొరికేసింది. అందుకే ఈసారి టాలీవుడ్ లో చాలా మంది విజయవాడ, వెస్ట్, ఈస్ట్ బాట పట్టారు.
దీనికి తోడు గన్నవరం ఎమ్మెల్యే వంశీ, గుడివాడ ఎమ్మెల్యే నాని సన్నిహితులు అక్కడ భారీ కేసినోలు ఏర్పాటు చేసారని టాక్. అందుకే వారితో పరిచయం వున్న తెలుగు సినిమా నిర్మాతలు చాలా మంది అటు వెళ్లిపోయారు. విజయవాడ, ఏలూరుల్లో సెంటర్ పెట్టుకుని కోడిపందాలు, గుళ్లాటలు చూసి, ఆడి తరిస్తున్నారని బోగట్టా.
ఇండస్ట్రీ జనాలు చాలా మందికి నాని, వంశీలతో మంచి పరిచయాలే వున్నాయి. అందువల్ల కొందరు అటు వెళ్లారు. మరి కొందరు భీమవరం, నరసాపురం ఏరియాలకు వెళ్లారు. దిండి రిసార్ట్ లో మకాం వేసి కోడిపందాలు ఆడుతున్న సినిమా సెలబ్రిటీలు కొందరు.
సినిమా జనాలు చాలా మందికి కేసినో లు అంటే ఇష్టం. గోవా, శ్రీలంక, బ్యాంకాక్, ఇలా చాలా ప్రాంతాలకు వెళ్లి మరీ ఆడివస్తుంటారు. ఆంధ్ర అన్నది వాటితో పోల్చుకుంటే పక్కనే వున్నట్లు లెక్క.అందుకే చాలా మంది ఛలో ఆంధ్ర అనేసారు.