పాన్ ఇండియా అనే పిచ్చి లేదా ఇష్టం పుణ్యమా అని టాప్ హీరోల సినిమాల నిర్మాణం ఏళ్లూ పూళ్లూ పడుతోంది. ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, చరణ్, పవన్ ఇలా వీళ్లందరి సినిమాలు చూసి చాలా రోజులు అయింది ఈ ఏడాది ద్వితీయార్ధంలో అందరి సినిమాలు రాబోతున్నాయి. వాటి సంగతి సరే, ఈ 2024 సెకండాఫ్ లో వీళ్ల సినిమాలు వచ్చేస్తే మళ్లీ ఇంకెప్పుడు వస్తాయి అన్నది పాయింట్.
ఎన్టీఆర్ దేవర సినిమా తరువాత ప్రశాంత్ నీల్ సినిమా మొదలుపెడతారు. కనీసం ఏడాదికి పైగానే పడుతుంది. అంటే 2025లో ఎన్టీఆర్ డెరెక్ట్ తెలుగు సినిమా వుండే అవకాశం వుందా?
ప్రభాస్ కల్కి తరువాత విడుదల కావడానికి ఏ సినిమా కూడా రెడీగా లేదు. రాజాసాబ్ సినిమా సగం వరకు పూర్తయింది. కల్కి 2, సలార్ 2, హనురాఘవపూడి ఇవన్నీ ఇంకా మొదలు కావాలి. అంటే 2025 లో రావాలి అంటే రాజాసాబ్ ఒక్క దానికే చిన్న చాన్స్ వుంది.
బన్నీ పుష్ప 2 తరువాత సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ ఏడాది స్టార్ట్ అయినా కనీసం ఏడాది పడుతుంది నిర్మాణానికి. అంటే 2025లో ఆశ పెట్టుకోవచ్చా? అనుమానమే.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సంగతే ఇంకా తెలియదు. ఉప్పెన బుచ్చిబాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో? ఎప్పుడు పూర్తి అవుతుందో? బుచ్చిబాబు ఫాస్ట్ గా తీస్తారు కనుక 2025లో ఓ సినిమా వుండొచ్చని ఫ్యాన్స్ ఆశ.
పవన్ కళ్యాణ్ సినిమాలు నిర్మాణంలో వున్నాయి. ఆయన మనసు పెడితే ఓజి సినిమా ఒక్కటి రెడీ అవుతుంది. మిగిలిన వాటి సంగతి తెలియదు. అందువల్ల 2025లో సినిమా అంటే ఆలోచించాల్సిందే.
ఇలా పెద్ద హీరోల సినిమాలు ఈ ఏడాది చూసేస్తే, మళ్లీ చూడాలంటే ఇంకో ఏడాదిన్నర వెయిట్ చేయాలేమో?