తిరుమల.. ఆ మార్పులతో పాటు ఈ ఒక్కటి కూడా!

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తర్వాత తిరుమలలో పలు మార్పుచేర్పులు చోటు చేసుకుంటున్నాయి. తిరుమల నడక మార్గంలో దివ్యదర్శనం టోకెన్లు తిరిగి ప్రారంభించారు. క్యూ లైన్లలో, కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదం…

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తర్వాత తిరుమలలో పలు మార్పుచేర్పులు చోటు చేసుకుంటున్నాయి. తిరుమల నడక మార్గంలో దివ్యదర్శనం టోకెన్లు తిరిగి ప్రారంభించారు. క్యూ లైన్లలో, కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదం అందించే కార్యక్రమం మొదలుపెట్టారు.

రాబోయే రోజుల్లో మరిన్ని మంచి మార్పులు చోటుచేసుకుంటాయని చెబుతున్నారు కొత్తగా వచ్చిన ఈవో. ఇదే ఊపులో ఇంకో కీలకమైన మార్పు కూడా చేయాలని కోరుతున్నారు శ్రీవారి భక్తులు. అదే ఆన్ లైన్లో దర్శనం టికెట్లు.

300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్ లైన్లో నెలవారీ కోటా ప్రాతిపదికన విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ టికెట్లు క్షణాల్లో అమ్ముడుపోతున్నాయి. మొన్నటికిమొన్న సెప్టెంబర్ నెల కోటా విడుదల చేస్తే జస్ట్ 2 గంటల్లో నెల మొత్తం టికెట్లు బుక్ అయిపోయాయి.

ఆర్జిత సేవ, అంగప్రదక్షణ లాంటి సేవల టోకెన్లు ఎలాగూ తక్కువగా ఉంటాయి. చాలామంది భక్తులు వాటిని ఆశించరు కూడా. కానీ 300 రూపాయల టికెట్ల కోసం ఎక్కువ మంది ఎదురుచూస్తుంటారు. ఇలా ఒక నెలకు మాత్రమే విడుదల చేసి, భక్తులను నిరాశకు గురిచేయడం బాగాలేదు.

ఒకప్పుడు ఆన్ లైన్లో 3 నెలల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఒకేసారి విడుదల చేసేవారు. దాని వల్ల లక్షలాది మంది భక్తులు తమ వెసులుబాటు బట్టి టికెట్లు బుక్ చేసుకునేవారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ దొరికిన తర్వాతే ట్రయిన్ లేదా ఫ్లయిట్ టికెట్ బుక్ చేసుకునేవారు. కుటుంబంతో వచ్చే భక్తులు ఇలా ముందుగానే అంతా ప్లాన్ చేసుకునేవారు.

కానీ ప్రస్తుతం రైల్వే తత్కాల్ టికెట్లలా గంటల్లో దర్శనం టికెట్లు అమ్ముడుపోతుండడంతో చాలామంది భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. శ్రీవారి దర్శనానికి నోచుకోలేకపోతున్నారు. ఇకపై ఒక నెల కాకుండా, ఒకేసారి 2-3 నెలల టికెట్లు విడుదల చేస్తే భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటుంది.