'కొందరికి డబ్బు పిచ్చి వుంటుంది. వీడికి మాత్రం కుటుంబం పిచ్చి' ఇదీ టక్ జగదీష్ ట్రయిలర్ లో హీరో గురించి వినిపించిన డయిలాగు. నిజమే ట్రైలర్ చూస్తుంటే ఓ పెద్ద కుటుంబం..వాళ్ల మధ్య ప్రేమానురాగాలు. స్వార్ధం..గొడవలు అన్నీ వున్నాయి. పనిలో పనిగా బయట విలన్, ఇంట్లో విలన్ కూడా.
ఒకప్పుడు ఇలాంటి సినిమాలు టాలీవుడ్ లో తెగ కనిపించేవి. అన్నదమ్ముల మధ్య అనుబంధం, బయట వాడు ఎవడో ఒకరిని పక్కకు లాగడం, ఎమోషన్లు, ఏడుపులు ఇలాంటివి అన్నీ. అయితే తరువాత తరువాత ఇవన్నీ నేరుగా టీవీ కి షిప్ట్ అయిపోయాయి.
ఇటు హీరోలు, మేకర్లు, అటు జనాలు కూడా ఇలాంటి సినిమాలను మరిచిపోయారు. కానీ తమిళ నాట మాత్రం వస్తూనే వున్నాయి అడపాదడపా. ఆ మధ్య కార్తీ చినబాబు సినిమా వచ్చిందిగా.
బహుశా అది చూసి హుషారు వచ్చిందో ఏమో? తెలుగులో కూడా మళ్లీ ఆ జోనర్ ను టచ్ చేసారు దర్శకుడు శివనిర్వాణ. హీరో నాని. మరి జనం ఎలా స్పందిస్తారు అన్నది తెలియడానికి సినిమా థియేటర్లలో విడుదల కావడం లేదు. అమెజాన్ ప్రైమ్ లో వస్తోంది ఈ నెల 10న.
ట్రైలర్ గ్రాండియర్ గానే వుంది. సినిమా ఖర్చు కనిపిస్తోంది. నాని నోట మాస్ డైలాగులు కూడా పడ్డాయి. ఫైట్లు కనిపించాయి. టోటల్ గా ఫ్యామిలీ అంతటికీ పనికి వచ్చేలా తయారు చేసిన ప్యాకేజ్ లా వుంది.