సినిమాలు చూపించే అమెజాన్ టక్ జగదీష్ యూనిట్ కు చుక్కలు చూపించింది. సినిమా ఎప్పుడయితే వారికి అమ్మేసారో, ఇక అక్కడ నుంచి సినిమా ప్రచారం కూడా అమెజాన్ దే.
నిర్మాతకు ఏమీ అవకాశం వుండదు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని అమెజాన్ తాలూకా సిబ్బందే నిర్వహించారు. స్టేజ్ మీదకు ఎవర్ని పిలవాలి? ఎప్పుడు పిలవాలి? హీరోను ఏ యాంకర్ ఏ ప్రశ్నలు అడగాలి? దానికి హీరో ఏ భాషలో సమాధానం ఇవ్వాలి? ఇవన్నీ అమెజాన్ రూల్స్ నే.
ఇక మరీ దారుణం ఏమిటంటే నిర్మాతలకు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం. తమ అజెండాలో ఆ విషయం లేదని చెప్పేసారు. పైగా యాంకర్ ఇంగ్లీష్ లో అడిగే ప్రశ్నలకు హిందీలో సమాధానం ఇవ్వాలని హీరో నానిని ఇబ్బంది పెట్టడం.
హిందీలో ఫ్లూయెన్సీ వుందో లేదో తెలుసుకోకుండా ఇలాంటి వ్యవహారాలు చేసి స్టేజ్ మీద నానిని కార్నర్ లోకి తోసారు. అప్పటికీ నవ్వుతూ మరోసారి జరిగే ఫంక్షన్ కు హిందీ నేర్చుకుని వస్తా అని నాని సమాధానం చెప్పాడు.
ఇక మీడియాతో వ్యవహారం మరీ చిత్రం. అమెజాన్ కు ఎవరు ఇచ్చారో ఎలా ఇచ్చారో కానీ కొన్ని టీవీ చానెళ్లు, యూ ట్యూబ్ చానెళ్లకు ఇంటర్వూలు అనుమతించారు. లీడింగ్ చానెళ్ల అయిన టీవీ 9, ఎన్టీవీ లను కూడా పక్కన పెట్టేసారు.
హీరో పీఆర్ టీమ్ ను కానీ సినిమా పీఆర్ టీమ్ ను కానీ దగ్గరకు రానివ్వలేదు. ఎన్నో మాట్లాడదామనుకున్న నిర్మాతలు అమెజాన్ నిర్ణయంతో పాపం, కక్కలేక మింగలేక పక్కన నిలబడిపోయారు.