ఉయ్యాలవాడ జ్ఞాపకాల పరిరక్షణ చేసేదెవరు?

నూటా డెబ్బై రెండు సంవత్సరాల కిందటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. బ్రిటీష్ వారు ఇచ్చే తవర్జీని తీసుకుని ఎంతో మంది తన సహచర పాలెగాళ్లు, రాజులు  కూడా సర్దుకుపోతున్న వేళ ఎదురుతిరిగిన యోధుడు ఆయన.…

నూటా డెబ్బై రెండు సంవత్సరాల కిందటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. బ్రిటీష్ వారు ఇచ్చే తవర్జీని తీసుకుని ఎంతో మంది తన సహచర పాలెగాళ్లు, రాజులు  కూడా సర్దుకుపోతున్న వేళ ఎదురుతిరిగిన యోధుడు ఆయన. బానిసత్వం భారతీయులకు అలవాటు అయిపోయిందనుకుని రాజీ పడిపోయారు అందరూ. అప్పటికే శతాబ్ద కాలంగా పరదేశీయుల పాలనలో దేశమంతా మగ్గుతూ వచ్చింది. ఎదురుతిరిగిన వారి గతి ఏమవుతుందో ఎవరికీ తెలియనది ఏమీ కాదు. అయినప్పటికీ ఎదురు తిరిగిన యోధుడు ఉయ్యాలవాడ.

అలాంటి యోధుడును ప్రభుత్వాలు గుర్తించలేదు. చాలా కాలం పాటు ఎవరూ పట్టించుకోలేదు. స్వతంత్రం రాక ముందు, వచ్చిన తర్వాత కూడా ఒకటే రకమైన పరిస్థితి ఉంది. అయితే ఉయ్యాలవాడ గాథను ప్రజల్లో  నిలిపారు జానపదులు. వారు ఉయ్యాలవాడ గాథలను పాడుతూ ప్రజల్లో చైతన్యాన్ని నింపడంతో పాటు, ఉయ్యాలవాడ గురించి అందరికీ తెలిసేలా చేశారు. ఇప్పటికీ రేనాడు ప్రాంతంలోని కొన్ని సంచార సామాజికవర్గాల్లోని వృద్ధులు ఉప్పొంగిపోతూ ఉయ్యాలవాడ పాటలను పాడతారు. ఆ యోధుడి వీరగాథను వివరిస్తారు. వేరే ఉయ్యాలవాడను ప్రజల్లో బతికించారు.

స్వతంత్రం వచ్చి డెబ్బై రెండేళ్లు గడిచిపోయినా.. తొలి తొలి స్వతంత్ర సమరయోధుడి గురించి ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకున్నది లేదు. అయితే రెండేళ్ల కిందట ఉయ్యాలవాడ పేరుతో ఒక పోస్టల్ స్టాంప్ ను విడుదల చేశారు. ఉయ్యాలవాడ నూటా డెబ్బై రెండవ వర్ధంతి సందర్భంగా ఆయన పేరుతో ఇండియన్ పోస్టల్ వారు స్టాంప్ విడుదల చేశారు. అలాగే ఎన్వలప్ కవర్ ను కూడా విడుదల చేశారు.

ప్రధానమంత్రి  నరేంద్రమోడీ చేతుల మీదుగా అవి విదుదల అయ్యాయి. ఆ మాత్రం గుర్తింపు దక్కింది ఈ రేనాటి సూర్యుడికి. అయితే అది చాలా స్వల్పమైన గుర్తింపు. ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటే.. చేయాల్సింది అది మాత్రమే కాదు. ముందుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జ్ఞాపకాలను పరిరక్షించాలి. ఉయ్యాలవాడ నివసించిన ఇల్లు, ఆయన పాలన సాగించిన కోట, ఆయన పట్టుబడిన చోటు.. ఇవన్నీ ఇంకా సజీవ సాక్షాలుగా ఉన్నాయి. అయితే చాలా వరకూ శిథిలం అయిపోయాయి.

నొస్సం కోట పాక్షిక భాగం మాత్రమే మిగిలింది. దాన్ని ఆ చుట్టుపక్కల వారు ఆక్రమించేస్తూ ఉన్నారు. ఉయ్యాలవాడ హయాం నాటి ఇళ్లు దాదాపుగా శిథిలం అయ్యింది. ఆయన తర్వాతి తరాల వారు వాటాలుగా పంచుకుంటూ, పాత ఇంటిని కూల్చి చిన్న చిన్న ఇళ్లను కట్టుకున్నారు. అయినప్పటికీ ఇంకా కొంత భాగం మిగిలి ఉంది.  ఆ వారసుల నుంచి  ఆ ఇంటిని తీసుకుని ప్రభుత్వం సంరక్షించవచ్చు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జ్ఞాపకంగా పరిరక్షించవచ్చు.

నొస్సం కోటను, ఇతర ఉయ్యాలవాడ నడయాడిన పరిసరాలను కూడా  ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, వాటి పరిరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రభుత్వాలకు అంత తీరిక ఉందా? అనేదే ప్రశ్న. రేనాడు సూర్యచంద్రులు సేవా సమితి అని ఆ ప్రాంత వాసులు కొందరు ఒక సంఘంగా ఏర్పడి..ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి, వర్ధంతులను నిర్వహిస్తూ ఉంటారు. పలువురు సీనియర్ సిటిజన్లు, కొందరు రాజకీయ వాదులు ఆ యాక్టివిటీస్ లో ఉంటారు.

సినిమాతో సంబంధం లేకుండా.. వాళ్లు చాలా కాలంగా ఉయ్యాలవాడను స్మరిస్తూ ఉన్నారు. అయితే తెలుగు వీరుడికి అవన్నీ చిన్న చిన్న సత్కారాలే. ఉయ్యాలవాడ జయంతి, వర్ధింతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. సినిమా వచ్చిన తర్వాత, అది హిట్టైన రీతిని గమనించి అయినా ప్రభుత్వం మేల్కొంటే.. ఎంతో కొంత మంచిదే అని స్థానికులు అంటున్నారు.

సినిమా వస్తేనే.. యోధుడు గుర్తుకు వచ్చాడు!