ఉప్పెనతో హీరోగా మారిన వైష్ణవ్ తేజ్ కు అంతా అతడి మామయ్యే. పవన్ కల్యాణే దగ్గరుండి వైష్ణవ్ డెబ్యూను చూసుకున్నాడు. నటుడిగా మారాలనే ఆలోచన రేకెత్తించడంతో పాటు.. మంచి గైడెన్స్, ట్రయినింగ్ ఇచ్చి హీరోను చేశాడు పవన్ కల్యాణ్. అయితే అక్కడితో మామయ్య పని అయిపోయిందంటున్నాడు వైష్ణవ్. ప్రతి నిర్ణయం తనే తీసుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.
“ప్రస్తుతం గిరీశాయ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. ఆ తర్వాత పృధ్వి దర్శకత్వంలో సినిమా చేస్తాను. ఇలా ఏ సినిమా చేసినా ఆ స్టోరీని నేనే ఓకే చేస్తాను. పవన్ పర్మిషన్ తీసుకోను. కాకపోతే నేను చేస్తున్న సినిమాలు ఏంటనే విషయాన్ని మామయ్యకు ఎప్పటికప్పుడు చెబుతుంటాను. మామయ్య బిజీగా ఉంటారు.
ఉన్న కొంచెం టైమ్ లోనే నేను చేసే సినిమాల లైన్స్ చెబుతుంటాను. ఓకే అంటారంతే. ఏ పని చేసినా సిన్సియర్ గా చేయమని మాత్రం చెబుతుంటారు.”
తన కథల ఎంపికలో అన్నయ్య సాయి ధరమ్ తేజ్ ప్రమేయం కూడా ఉండదంటున్నాడు వైష్ణవ్ తేజ్. ప్రస్తుతానికైతే తన మనసుకు నచ్చిన కథలతోనే ముందుకెళ్తున్నానని, హీరోగా క్లిక్ అవ్వకపోతే మరో పని చేసుకుంటానని ఓపెన్ గా చెబుతున్నాడు.
“నిజానికి నాకు హీరో అవుదామని లేదు. తెరవెనక ఉండే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, డైరక్షన్ లాంటిది చేద్దాం అనుకున్నాను. కొన్ని కథలు కూడా రాశాను. కానీ అంత క్రియేటివిటీ నా వల్ల కాదని ఆపేశాను. ప్రస్తుతానికైతే నటుడిగా కెరీర్ బాగుంది. ఇది క్లిక్ అవ్వకపోతే మరో పని చేసుకుంటాను. అందులో మొహమాటం లేదు.”
అన్నయ్య సాయితేజ్ పూర్తిగా కోలుకున్నాడని, మరో వారం, పది రోజుల్లో డిశ్చార్జ్ అయిపోతాడని క్లారిటీ ఇచ్చాడు వైష్ణవ్. ఈ హీరో నటించిన కొండపొలం సినిమా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది. వైష్ణవ్ కు ఇది రెండో సినిమా.