డ్రగ్స్ వ్యవహారంలో ఎన్సీబీ కస్టడీలో ఉన్న షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అమాయకుడు అని అంటున్నారు ఆయన లాయర్. ఈ మేరకు ఆర్యన్ బెయిల్ కోసం ప్రయత్నాలు ప్రారంభం అయినట్టుగా తెలుస్తోంది. క్రూజ్ షిప్ లో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి ఆర్యన్ తో సహా ఎనిమిది మంది అరెస్టు అయ్యారు. వీరంతార నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టుగా ఎన్సీబీ అధికారులు గుర్తించారు. ఆ రేవ్ పార్టీలోకి సాధారణ గెస్టుల్లా అటెండ్ అయ్యి, అధికారులు ఈ డ్రగ్స్ స్కాండల్ ను బయటపెట్టారు.
ఈ వ్యవహారంలో ఆర్యన్ అండ్ గ్యాంగ్ ను ఎన్సీబీ అధికారులు అరెస్టు కూడా చేశారు. డ్రగ్స్ వాడకానికి సంబంధించి పట్టుబడితే.. ఏదో స్టార్ తనయుడు కాబట్టి.. కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేయలేదు. అరెస్టును కూడా చూపించి ఎన్సీబీ అధికారులు కూపీ లాగుతున్నారు. ఇప్పటికే ఎన్సీబీ కస్టడీలో ఉన్న ఆర్యన్ ఖాన్ ను చూడటానికి ఆయన తల్లి గౌరీ వెళ్లినట్టుగా ఉన్నారు. ఇక లాయర్ తరఫు నుంచి బెయిల్ ప్రయత్నాలు మొదలైనట్టుగా ఉంది.
ఆ పార్టీకి ఆర్యన్ ఖాన్ కేవలం గెస్ట్ మాత్రమే అని అంటున్నారు అతడి లాయర్. ఎవరో నిర్వహిస్తున్న పార్టీకి ఆర్యన్ గెస్టుగా వెళ్లాడని, అంతే తప్ప డ్రగ్స్ దందాతో సంబంధం లేదని ఆయన మీడియాతో చెప్పుకొచ్చారు. ఒకవేళ పార్టీలో డ్రగ్స్ ఏవైనా పట్టుబడి ఉంటే వాటితో ఆర్యన్ కు సంబంధం లేదంటున్నాడు. ఆర్యన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ పట్టు బడలేదని లాయర్ చెబుతున్నాడు.
అలాగే ఆర్యన్ ఖాన్ పై ఎన్సీబీ మోపుతున్న సెక్షన్ల ప్రకారం కూడా బెయిల్ కు అతడు అర్హుడే అని ఆ లాయర్ అంటున్నాడు. అయితే ఎన్సీబీ అధికారులు ఈ వ్యవహారాన్ని అంత తేలికగా వదిలేలా లేరు. ఆర్యన్ ఖాన్ ఫోన్ చాట్లను వారు గమనిస్తున్నట్టుగా భోగట్టా. వాటి ప్రకారం.. ఆర్యన్ కు రెగ్యులర్ గా డ్రగ్స్ వాడే అలవాటు ఉందని వారు గుర్తించినట్టుగా మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఈ విషయాన్సి ఎన్సీబీ అధికారులు ఇప్పటి వరకూ ఏమీ ధ్రువీకరించలేదు.