2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో లోకేష్ కి పట్టాభిషేకం చేసి, ఆయన ఫేస్ తో ఎన్నికలకు వెళ్లాలనేది బాబు ఆలోచన. అయితే అప్పటికే టీడీపీపై ప్రజల్లో వ్యతిరేక వస్తోందనే నిఘా సమాచారం అందింది. అందుకే ఆ ప్రయత్నాన్ని విరమించారు. తానే స్వయంగా రంగంలోకి దిగారు. లోకేష్ ని వెనక్కు నెట్టారు. అధికారం వచ్చాక లోకేష్ కి బాధ్యతలు అప్పగించి తాను రిటైర్ అవుదామనుకున్నారు.
కానీ సీన్ పూర్తిగా రివర్స్ అయింది. చరిత్రలో ఎరుగని ఓటమిని టీడీపీ ఎదుర్కొనే సరికి బాబు బిక్కచచ్చిపోయారు. రెండేళ్లు గడిచాయి, కొడుక్కి వయసు పెరిగిందే తప్ప జ్ఞానం పెరగలేదు. కనీసం కొడుకు చేతికి అంది వస్తాడనే ఆశ కూడా లేదు. దీంతో చంద్రబాబే మళ్లీ రంగంలోకి దిగబోతున్నారు. 2024 ఎన్నికల్లో కూడా తానే రాజు, రథసారథి అనే క్లారిటీ ఇచ్చేశారు.
బాబు ముఖ చిత్రంతోనే..
2024 ఎన్నికల్లో కూడా టీడీపీలో మునుపటి సీన్ రిపీట్ కాబోతోంది. వచ్చే ఎన్నికలు కూడా ఎప్పటిలాగే చంద్రబాబు ముఖ చిత్రంతో ఉండబోతున్నాయి. ప్రచారం ఆయనదే, వ్యూహాలు ఆయనవే, అభ్యర్థుల ఎంపిక బాధ్యత కూడా ఆయనదే. దీనికి సంబంధించి క్యాడర్ కు పూర్తిగా క్లారిటీ ఇచ్చేశారు బాబు.
బద్వేల్ ఉప ఎన్నికను కూడా పక్కనపెట్టేశారు కాబట్టి, నెలాఖరు నుంచి రంగంలోకి దిగి సార్వత్రిక ఎన్నికల కోసం కసరత్తులు చేయాలనుకుంటున్నారు.
కేసీఆర్ ని ఫాలో అవుతున్న బాబు..
తెలంగాణలో కేసీఆర్ కి కూడా ఇదే సమస్య ఉంది. వారసుడికి స్మూత్ గా పగ్గాలు అప్పగించి, తాను పక్కకు తప్పుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నారు. 2018లో అందుకే ముందస్తుకి వెళ్లారు, ఆ తర్వాత మంత్రివర్గ కూర్పు విషయంలో కూడా కేటీఆర్ కి ప్రాధాన్యత ఇచ్చి మిగతావారిని పక్కన పెట్టారు. కానీ రాజకీయ పరిస్థితులు సహకరించక తానే సీఎంగా కొనసాగుతున్నారు.
ఇక్కడ ఏపీలో చంద్రబాబు కూడా కొడుక్కి పగ్గాలు అప్పగించాలని అనుకున్నారు. 2019లో పార్టీ పూర్తిగా దెబ్బతినే సరికి ఆయనకు ఆ అవకాశం లేకుండా పోయింది. ఈసారి చంద్రబాబు మాత్రం ఈ విషయంపై ముందే పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చేస్తున్నారు. అందరూ కష్టపడండి, పదవులు పొందండి, చినబాబును సీఎంను చేయండి అనే విషయాన్ని నేతలు, కార్యకర్తల మైండ్ కి ఎక్కిస్తున్నారు.
మరి చినబాబు ఏం చేస్తారు..?
ఎప్పటిలాగే సోషల్ మీడియా ఇన్ చార్జిగా చినబాబు తెరవెనక మిగిలిపోతారని అంటున్నారు టీడీపీ జనాలు. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో జనాల్లోకి రావాలని ప్రయత్నించి, పార్టీ మైలేజీ పెంచాలని చూసి విఫలమైన చినబాబు.. ఇకపై ఆ ఆలోచన విరమించుకునేట్టు ఉన్నారు.
వచ్చే ఎన్నికలనాటికి జనసేనతో పొత్తు ఖరారైతే.. ఫీల్డ్ వర్క్ అంతా బాబు, పవన్ చూసుకుంటే.. తెరవెనక లక్ష్మణ కుమారుడిలాగా ఫోజులివ్వాలనేది లోకేష్ ఆలోచన. కానీ ఇక్కడ ఉన్నది జగన్ కాబట్టి, బాబు, చినబాబు, దత్తపుత్రుడు పవన్ బాబు పప్పులు ఉడికేలా లేవు.