అరెస్టైంది బాలీవుడ్ స్టార్ హీరో తనయుడు. బాలీవుడ్ మెగాస్టార్ తనయుడు. బాలీవుడ్ లో షారూక్ వేళ్లు పాతుకుపోయాయి చాలా కాలం అయ్యింది. బడా ప్రొడ్యూసర్లే కాదు, షారూక్ సినీ హీరోయిజం నేపథ్యంలో రాజకీయ పలుకుబడి కూడా బోలెడంత. దేశంలోనే అత్యంత ధనికులు అంబానీల ఇంట జరిగే ఏ పార్టీలకు షారూక్ కు ప్రత్యేక ఆతిధ్యం ఉంటుంది.
కేంద్రమంత్రులు, రాజకీయ నేతలు కూడా షారూక్ పక్కన నిలబడి ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపించే పరిస్థితి. ఇక సహచర బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు.. వీళ్లంతా షారూక్ తో సాన్నిహిత్యం చాలనే పరిస్థితి. హీరోగా హిట్లు గత కొన్నాళ్లుగా పెద్దగా లేకపోయినా.. షారూక్ స్టార్ డమ్ కూ, మార్కెట్ వ్యాల్యూకూ ఏమాత్రం ఇబ్బంది లేదు.
మరి ఇలాంటి స్టార్ తనయుడు అరెస్టు అయిన నేపథ్యంలో బాలీవుడ్ రియాక్షన్ ఎలా ఉందనేది ఆసక్తిదాయకమైన అంశం. అది కూడా సినిమా వాళ్లకు ఈ మధ్యకాలంలో చాలా రొటీన్ అయిన డ్రగ్స్ వ్యవహారంలో షారూక్ తనయుడు అరెస్టు అయ్యారు. చోటాచోటా సినిమా వాళ్లు కూడా ఈ రోజుల్లో డ్రగ్స్ వ్యవహారాల్లో వార్తల్లోకి నిలుస్తున్నారు. వారి రెమ్యనిరేషన్లే అంతంత మాత్రం అనుకునే వాళ్లే వాటి జోలికి వెళ్తున్నారు. అలాంటిది షారూక్ తనయుడు ఇలాంటి వ్యవహారంలో చిక్కుకోవడం బయటి వాళ్లకు ఆశ్చర్యం ఏమో కానీ.. బాలీవుడ్ స్టార్లకు కాకపోవచ్చు!
వాళ్ల సర్కిల్స్ లో డ్రగ్స్ వినియోగం చాలా చిన్న స్థాయి వ్యవహారం కావొచ్చు. బయటి వాళ్లకు తెలిసో, తెలియకో.. బాలీవుడ్ లోని ఇతర స్టార్ల పిల్లలు కూడా ఈ తరహా వినియోగాల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు! కాబట్టి షారూక్ తనయుడిని వాళ్లు ఒక రేంజ్ లో దోషిగా చూసేదేమీ లేకపోవచ్చు. అందుకే వారు బాహాటంగానే స్పందిస్తున్నారు.
నటుడు సునీల్ షెట్టి స్పందిస్తూ.. మీడియా కాస్త వేచి చూడాలన్నాడు. ఆ కుర్రాడిని ఊపిరిపీల్చుకోనివ్వాలని, అన్ని విషయాలూ బయటకు వస్తాయని, ఆలోపే అత్యుత్సాహం చూపవద్దని సునీల్ షెట్టి హితవు పలికాడు. ఇక షారూక్ తో స్టార్ వార్ ను కలిగి ఉన్న సల్మాన్ కూడా స్పందించాడు.
బాహాటంగా ఏం మాట్లాడలేదు కానీ, షారూక్ ఇంటికి వెళ్లాడు సల్మాన్. అరెస్టు నేపథ్యంలో షారూక్ కు ధైర్యం చెప్పడానికి కాబోలు. ఇది వరకే బాలీవుడ్ తారాగణంపై ఈ తరహా ఆరోపణలు గుప్పుమన్న నేపథ్యంలో.. ఆర్యన్ ఖాన్ పట్టుబడటం కేవలం పట్టుబడటం మాత్రమే లాగుంది!