వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మది ఓ విచిత్రమైన క్యారెక్టర్. అంతా నా ఇష్టం అంటూ ఆయన అనడమే కాదు, అట్లే బతికేస్తుంటారు. జనానికి ఏదో ఇష్టమో, అది కాకుండా…తనకిష్టమైన సబ్జెక్ట్‌ను ఎంచుకుని తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. ఈ విషయాన్ని మరోసారి ఆర్కే ‘గుండె విప్పి’ చెప్పే కార్యక్రమంలో వర్మ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
ఆర్కే సంధించిన అన్ని ప్రశ్నలకు వర్మ తన మార్క్ ఆన్సర్స్ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా సినిమాలు తీయాలని, ఆర్కే రెండు సబ్జెక్టులు ఇచ్చినా…తీయాలా? వద్దా? అనేది తనిష్టమని మొహంమీదే చెప్పేశారు. అలాగే జగన్‌లో తనకు నచ్చేదేమిటో వర్మ మరోమారు చెప్పారు. ఇదే సందర్భంలో రఘురామకృష్ణం రాజును చితక్కొట్టినా సినిమా తీయాలని ఎందుకు అనిపించలేదని వర్మ ఎదుట ఆర్కే ఆవేదన వ్యక్తం చేశారు.
చివరికి జగన్‌కు వ్యతిరేకంగా సినిమాలు తీస్తానని వర్మతో కమిట్ చేయించడంలో ఆర్కే ఫెయిల్ అయ్యారు. చిత్రపరిశ్రమలో ఉన్నంత జెలసీ…మరెక్కడా ఉండదని వర్మ బాంబు పేల్చడం ఈ ఇంటర్వ్యూ ప్రత్యేకత.
జగన్మోహన్‌రెడ్డిపై అపారమైన ప్రేమ ఉంది కదా..అని ఆర్కే ప్రశ్నకు వర్మ మనసులో మాట ఏంటో విందాం. జగన్‌పై అపారమైన ప్రేమ ఉన్నట్టు తానెప్పుడూ చెప్పలేదన్నారు. అయితే జగన్ ప్రజల్లో కలిసి పోయి మామూలుగా ఉండటమనేది తనకు నచ్చిన విజువల్ అని స్పష్టం చేశారు. ఇంతకు మించి జగన్ ఏంటి? ఆయన పాలసీ, ఇతరత్రా విషయాలేవీ తెలియవన్నారు. అలాగే పవన్‌కల్యాన్ అంటే పడదనే ప్రచారంలో వాస్తవం లేదని వర్మ చెప్పడం కొసమెరుపు. ఇదే సందర్భంలో సినిమా ఇండస్ట్రీ మనస్తత్వం గురించి వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు.
పవన్‌కల్యాణ్‌పై అభిమానంతోనే ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ హిందీలో చేయవద్దని చెప్పానన్నారు. ఎందుకంటే అది వర్కౌట్ కాదనేది తన అభిప్రాయమన్నారు. పవన్‌పై అభిమానంతోనే బాహుబలి లాంటి సినిమా చేయాలని చెప్పినట్టు వర్మ తెలిపారు. కానీ నిజం చెబితే ఎవరికీ నచ్చదన్నారు. ఐకమత్యం ఎక్కడా ఉండదన్నారు. అది చెప్పినోడు వందశాతం పిచ్చోడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమలో ఉండే జెలసీ ఏ రంగంలో ఉండదన్నారు.
ఎందుకంటే ఈ పరిశ్రమలో ప్రెషర్, మనీ, పేరు ఉండడమే కారణమన్నారు. మానవ సహజమైన కుళ్లు ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరికీ ఓ ఎజెండా ఉంటుందన్నారు. వారందరూ ఎప్పుడూ కలిసి ఉండరనేందుకు ఇవే కారణాలుగా వర్మ చెప్పారు. అందుకే పరిశ్రమలో ఎవరూ ఎవరినీ పట్టించుకోరని తేల్చి చెప్పారు.